Bathukamma songs lyrics: తొమ్మిది రోజులు ఉయ్యాలో.. అంటూ సింపుల్ గా ఉండే బతుకమ్మ పాటల లిరిక్స్ మీ కోసం
Bathukamma songs lyrics: బతుకమ్మ అనగానే అందరికీ పాటలు గుర్తుకు వస్తాయి. చాలా మందికి బతుకమ్మ ఆడేందుకు పాటలు రాక జానపద గీతాలు ఫోన్లో పెట్టేసుకుని ఆడిపాడతారు. అలాంటి ఇబ్బంది కలగకుండా మీకు HT Telugu సింపుల్ గా ఉండే పాటలు అందిస్తుంది.
తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలని తెలియజేసే పండుగ బతుకమ్మ. మరో రెండు రోజుల్లో ముగియబోతుంది. దుర్గాష్టమి రోజు అంటే అక్టోబర్ 11న రాష్ట్రవ్యాప్తంగా సద్దుల బతుకమ్మ వేడుకలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి.
ఎంగిలి పూల బతుకమ్మతో మొదలైన వేడుకలు తొమ్మిది రోజుల పాటు సాగి సద్దుల బతుకమ్మ రోజు ముగుస్తాయి. చివరి రోజు వేడుకలు అంబరాన్ని అంటుతాయి. తొమ్మిదో రోజు ఊరు వాడా ఏకమై అన్ని బతుకమ్మలు ఒక చోటకు చేర్చి ఆడి పాడతారు.
జానపద గీతాలు ఆలపిస్తూ బతుకమ్మల చుట్టూ లయబద్ధంగా చేతులు ఆడిస్తూ నృత్యాలు చేస్తారు. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరూ చివరి రోజు బతుకమ్మ సంబరాల్లో పాల్గొంటారు. బతుకమ్మ ఆడేటప్పుడు ఎలాంటి పాటలు పాడాలో తెలియడం లేదా? అయితే సింపుల్ గా ఉంటే ఈ రెండు పాటలు పాడుతూ నృత్యాలు చేయండి. బతుకమ్మలో ఎలాంటి పూలు వాడతారు, తొమ్మిది రోజుల బతుకమ్మను ఎలా సాగనంపుతున్నారు అనే దాని గురించి ఇందులో చక్కగా ఉంటుంది. ఆ పాటల లిరిక్స్ మీకోసం.
తొమ్మిది రోజులు ఉయ్యాలో
తొమ్మిది రోజులు ఉయ్యాలో
నమ్మిక తొడుతో ఉయ్యాలో
అలరీ గుమ్మడి పూలు ఉయ్యాలో
ఆరుగులు వేయించి ఉయ్యాలో
గోరింట పూలతో ఉయ్యాలో
గోడలు పెట్టించి ఉయ్యాలో
తామర పూలతో ఉయ్యాలో
ద్వారాలు పెట్టింది ఉయ్యాలో
మొగిల పూలతోను ఉయ్యాలో
మొగురాలు ఎక్కించి ఉయ్యాలో
వాయిలి పూలతో ఉయ్యాలో
వాసాలు చేయించి ఉయ్యాలో
పొన్న పూలతో ఉయ్యాలో
యిల్లును కప్పించి ఉయ్యాలో
పసుపు ముద్దను చేసి ఉయ్యాలో
తోరణాలు కట్టించి ఉయ్యాలో
దోసపూలతోను ఉయ్యాలో
గౌరమ్మను నిలిపిరి ఉయ్యాలో
చేమంతి పూలతోను ఉయ్యాలో
చెలియను పూజింతురు ఉయ్యాలో
సుందరాంగులెల్ల ఉయ్యాలో
చుట్టూతా తిరిగిరి ఉయ్యాలో
ఆటలు ఆడిరి ఉయ్యాలో
పాటలు పాడిరి ఉయ్యాలో
ఆటపాటలు చూసి ఉయ్యాలో
ఆనందమొందిరి ఉయ్యాలో
గౌరమ్మ వరమిచ్చే ఉయ్యాలో
కాంతలందరికీ ఉయ్యాలో
ఆడిన వారికి ఉయ్యాలో
ఆరోగ్యము కల్గు ఉయ్యాలో
పాడిన వారికి ఉయ్యాలో
పాడిపంటలు కల్గు ఉయ్యాలో
విన్నట్టి వారికి ఉయ్యాలో
విష్ణుపథము కల్గు ఉయ్యాలో
తంగేడు పువ్వుల్ల చందమామ
తంగేడు పువ్వుల్ల చందమామ
మళ్ళీ ఎప్పుడొస్తావు చందమామ
గునుగై పువ్వుల్ల చందమామ
బతుకమ్మ పోతుంది చందమామ
పోతే పోతివి గానీ చందమామ
మళ్ళీ ఎప్పుడొస్తావు చందమామ
ఏడాది కోసారి చందమామ
ఆడుకుంటూ వస్తా చందమామ
బీరాయి పువ్వుల్లా చందమామ
మళ్ళీ ఎప్పుడొస్తావు చందమామ
ముత్యాల పువ్వుల్లా చందమామ
బతుకమ్మ పోతుంది చందమామ
పోతే పోతివి గానీ చందమామ
మళ్ళీ ఎప్పుడొస్తావు చందమామ
ఏడాది కోసారి చందమామ
ఆడుకుంటూ వస్తా చందమామ
తోక బంతి పువ్వుల్లా చందమామ
మళ్ళీ ఎప్పుడొస్తావు చందమామ
కట్లాయి పువ్వుల్లా చందమామ
బతుకమ్మ పోతుంది చందమామ
పోతే పోతివి గాని చందమామ
మళ్ళీ ఎప్పుడొస్తావు చందమామ
ఏడాది కోసారి చందమామ
ఆడుకుంటూ వస్తా చందమామ
మళ్ళీ ఎప్పుడొస్తావు చందమామ
రుద్రాక్ష పువ్వుల్లా చందమామ
మళ్ళీ ఎప్పుడొస్తావు చందమామ
గోరంట పువ్వుల్లా చందమామ
బతుకమ్మ పోతుంది చందమామ