Puja gadi: పూజగది తలుపు తెరిచి ఉంచాలా? లేక మూసి ఉంచాలా?
Puja gadi: దీపారాధన చేసిన తర్వాత చాలా మంది పూజ గది తలుపులు మూసేస్తారు. అసలు పూజ గది తలుపులు తెరిచి ఉంచాలా లేదా అనే సందేహం చాలా మందికి ఉండే ఉంటుంది. అటువంటి వారికోసమే ఇది.
Puja gadi: ఇంట్లో పవిత్రమైన ప్రదేశం పూజ గది. ప్రతి ఒక్కరూ తమ స్తోమతకి తగినట్టుగా పూజ గది ఏర్పాటు చేసుకుంటారు. లేదంటే ఒక అల్మరా అయినా దేవుడి చిత్రపటాలు, విగ్రహాలు పెట్టుకునేందుకు ఏర్పాటు చేస్తారు. పూజ గదికి కొంతమంది రెండు తలుపులు ఉండేలా పెట్టుకుంటే మరికొందరు ఒక తలుపు పెడతారు.
పూజ గది వాస్తు
పూజ గదికి వేసే తలుపులకి చిన్న గంటలు ఉన్న డిజైన్ తో చేయించుకుంటారు. నిత్యం దీపారాధన చేస్తూ ఉంటే ఆ ఇంటి మీద దేవతల ఆశీర్వాదం ఉంటుందని నమ్ముతారు. వాస్తు ప్రకారం పూజ గది నిర్మించుకోవడం చాలా ముఖ్యం. ఈశాన్యం, తూర్పు, ఉత్తర దిక్కులు పూజ గదికి అనుకూలమని నిపుణులు చెబుతున్నారు. మరీ ముఖ్యంగా ఈశాన్యం ఈశ్వరుని నిలయం అంటారు. అందుకే ఆ మూలన పూజ గది పెట్టుకుంటే అదృష్టం పొందుతారు. ఈశాన్య దిక్కులో పూజ గది పెట్టుకోవడం కుదరకపోతే తూర్పు లేదా ఉత్తర దిక్కులో పెట్టుకోవచ్చు. నైరుతి, ఆగ్నేయ దిశలలో పూజ గది అసలు పెట్టకూడదు.
పూజ గది తలుపు మూసి ఉంచాలా?
మనసుకి ప్రశాంతతని ఇచ్చే మందిరం పూజ గది. దీపారాధన చేసుకున్న తర్వాత చాలా మంది పూజ గది తలుపులు మూసేసి ఉంచుతారు. నిజానికి పూజ గది తలుపులు మూసి ఉంచాలా? లేదంటే తెరిచి ఉంచాలా అనే సందేహం చాలా మందికి ఉంటుంది. దేవుడి గదికి తాళం వేయడం తలుపులు మూసి ఉంచడం అసలు చేయకూడదు.
దేవుడి విగ్రహాలు ఏ స్థానంలో పెట్టాలి?
ఎంతో పవిత్రమైన పూజా మందిరంలో ఏర్పాటు చేసే దేవతలు, దేవుళ్ళ విగ్రహాలు పెట్టె ముందు కొన్ని నియమాలు తప్పనిసరిగా పాటించాలి. పూజ గదిలో పెట్టె విగ్రహాలు 9 అంగుళాల కంటే ఎక్కువ ఎత్తు, రెండు అంగుళాల కంటే తక్కువ ఎత్తు ఉండకూడదు. పూజ గదిలో దేవుడి విగ్రహాలు ఎప్పుడూ గోడకి తగిలేలా పెట్టకూడదు. కొద్దిగా ఖాళీ స్థలం వదిలిపెట్టాలి. దేవుడి గదిలో విగ్రహాలు సరైన దిశలో పెట్టకపోతే తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయి. గాలి, వెలుతురు సరిగా ఉండేలా చూసుకోవాలి.
దేవుని విగ్రహాలు పూజ గదిలో ఒకటే ఉండాలి. కానీ దేవుని చిత్రపటాలు మాత్రం ఎన్నైనా ఉండవచ్చు. పడమర దిశల్లో విగ్రహాలు పెట్టకూడదు. ఉత్తర, ఈశాన్య దిశలో మూర్తుల విగ్రహాలు పెట్టుకుంటే మంచిది.
పూజ గది శుభ్రంగా ఉండాలి
దేవతల ఆశీర్వాదం పొందాలంటే పూజ గది శుభ్రంగా ఉంచుకోవాలి. దుమ్ము, ధూళి లేకుండా ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటూ ఉండాలి. బాత్ రూమ్, టాయిలెట్ పక్కన పూజ గది ఎప్పుడు ఏర్పాటు చేయకూడదు. స్నానం చేయకుండా పూజ గదిలోకి అడుగుపెట్టకూడదు. పూజగదిలో ఎక్కువగా రాగి పాత్రలు ఉంచుకోవడానికి ప్రయత్నించండి. ఈ గది ఎప్పుడు చిందరవందరగా ఉండకూడదు.
పూజకి ఉపయోగించిన పూలు వాడిపోయినా, ఎండిపోయిన వాటిని వెంటనే తొలగించాలి. దేవతా మూర్తుల ప్రతిమలతో పాటు ఇంటి పెద్దలు, పూర్వీకుల ఫోటోలు పూజ గదిలో అసలు పెట్టకూడదు. పగిలిన విగ్రహాలు ఉంటే వాటిని వెంటనే తొలగించి వాటి స్థానంలో కొత్తవి పెట్టాలి. విరిగిపోయిన విగ్రహాలు గుడిలో లేదంటే ఏదైనా నదిలో నిమజ్జనం చేయాలి.