Telugu News  /  Rasi Phalalu  /  Navaratri 2022 Special Story On Durga Saptashati Parayanam
దుర్గా సప్తశతి పారాయణం
దుర్గా సప్తశతి పారాయణం

Durga Saptashati Parayanam: దుర్గా సప్తశతి పారాయణం.. ఎప్పుడు, ఎలా చేయాలో తెలుసా?

28 September 2022, 8:02 ISTGeddam Vijaya Madhuri
28 September 2022, 8:02 IST

Sri Durga Saptashati Parayanam : దసరా నవరాత్రుల్లో దుర్గా సప్తశతి పారాయణంకి చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ తొమ్మిది రోజుల్లో ఎప్పుడైనా దీనిని పారాయణం చేయవచ్చు. దీనివల్ల మరిన్ని శుభఫలితాలు పొందవచ్చు అంటున్నాయి పురణాలు. అయితే దీనిని మూడు విధానాలలో పారాయణం చేయవచ్చు. మీకు ఏ విధానం సరిపోతుందో చూసుకుని.. మీరు సప్తశతిని పారాయణం చేసేయండి.

Sri Durga Saptashati Parayanam : దసరాకు మరో పేరు ఉంది. అదే దశహరా. అంటే పది పాపాలను హరించేది అని అర్థం. ఆశ్వయుజ మాసంలో శుక్లపక్షంలో పాడ్యమి, హస్తానక్షత్రములో వచ్చే శుభదినాన దేవీ పూజ చేస్తే మంచిదని మార్కండేయ పురాణం చెప్తోంది. అందుకే అందరూ దేవీ మాతను అప్పుడే పూజించి.. నవరాత్రులు అప్పటినుంచే ప్రారంభింస్తారు. ముందు మూడు రోజులు దుర్గారూపాన్ని.. మరో మూడు రోజులు లక్ష్మీ రూపాన్ని.. చివరి మూడు రోజులు సరస్వతి రూపాన్ని పూజిస్తారు.

ట్రెండింగ్ వార్తలు

అయితే నవరాత్రుల్లో దుర్గా సప్తశతి పారాయణంకి కూడా అంతే విలువ ఉంది. ఈ పారాయణం చేస్తే.. చాలా మంచిదని భక్తులు భావిస్తారు. ఎందుకంటే నవరాత్రుల్లో దుర్గా సప్తశతి పారాయణం చేస్తే పుణ్యఫలం దక్కుతుందని పండితులు చెప్తున్నారు. మరి దీనిని ఎలా పారాయణం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఎంతో విశిష్టత కలిగిన దుర్గా సప్తశతిలో 13 అధ్యాయాలుంటాయి. మరి ఈ నవరాత్రుల్లో దీనిని ఎలా పారాయణం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

సప్తశతిని పారాయణం చేయడానికి మూడు విధాలు ఉన్నాయి. వీటిలో ఏది తీసుకున్న ఫలితం పొందడడంలో ఎలాంటి తేడా ఉండదు. కాబట్టి మీకు అనుకూలమైన దానిని ఎంచుకోవచ్చు. ఈ పారాయణ సమయంలో పలు అధ్యాయాల్లో దేవతలు, ఇంద్రుడు, మునులు మొదలైన వారి స్తోత్రములు కూడా వస్తాయి. వాటిని పఠిస్తే మీకు ఇంకా మంచి ఫలితం లభిస్తుంది. అయితే మూడు విధానాలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

మొదటి విధానం

నవరాత్రుల్లో తొమ్మిది రోజులు అత్యంత పుణ్యప్రదమైనవి. పారాయణ చేయడం, నామజపం, ఉపవాసం, అర్చన, దేవీస్తోత్రం ఇలా ఎవరికి ఏది అనుకూలంగా ఉంటుందో.. వారు అది ఆచరించి.. అమ్మవారి ఆశీస్సులు పొందవచ్చు. అందరూ అన్ని చేయాలని రూల్ ఏమి లేదు. అయితే మొదటి విధానంలో మొదటిరోజు నుంచి తొమ్మిది రోజులు ప్రతి రోజూ 13 అధ్యయాలు పారాయణం చేయాలి. అయితే దీనికి భక్తి, శ్రద్ధ, ముఖ్యంగా ఓపిక చాలా అవసరం. ఎందుకంటే.. ప్రతి రోజు దీనిని పారాయణం చేయడానికి ఐదారు గంటల సమయం పడుతుంది. ఇది మొదటి విధానం.

రెండో విధానం

పాడ్యమి ప్రధమాధ్యాయం మాత్రమే పారాయణం చేయడం. రెండవ రోజు.. 2,3,4 అధ్యాయాలు పారాయణం చేయవచ్చు. 3వ రోజు.. 5 నుంచి 13 అధ్యాయాలు పూర్తి చేయవచ్చు. ఇలా నవరాత్రుల్లో మూడుసార్లు సప్తశతిని పారాయణం చేసుకోవచ్చు. అయితే ఇక్కడో నియమం ఉంది. అదేంటంటే.. ఒకటో రోజు చేసి.. రెండు, మూడురోజులు కూడా వరుసగా చదవాలి. ఓ రోజు గ్యాప్ ఇచ్చి.. చదవకూడదు. పాడ్యమి, విదియ, తదియ.. నవరాత్రి మొదటి మూడురోజుల్లో.. ఎవరికైనా ఇబ్బంది ఉంటే.. చివరి మూడు రోజులు దీనిని చదువుకోవచ్చు. అంటే దుర్గాష్టమి, మహర్నవమి, విజయదశమి రోజు దీనిని పారాయణం చేయవచ్చు.

మూడువ విధానం

* మొదటి రోజు - 1 అధ్యాయం

* రెండో రోజు - 2,3 అధ్యాయాలు

* మూడవ రోజు - నాలుగవ అధ్యాయం

* నాలుగో రోజు - 5,6 అధ్యాయాలు

* ఐదవ రోజు - 7 అధ్యాయం

* ఆరవ రోజు - 8 అధ్యాయం

* ఏడవ రోజు - 9,10 అధ్యాయాలు

* ఎనిమిదవ రోజు - 11 అధ్యాయం

* తొమ్మిదవ రోజు - 12 అధ్యాయం

* విజయ దశమి రోజు - 13 అధ్యాయం పారాయణం చేయాలి. ఇలా అన్ని అధ్యాయాలను మొత్తం పది రోజులలో పూర్తి చేయవచ్చు.