September 27 Telugu News Updates : కన్నుల పండువగా దసరా ఉత్సవాలు
- తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం అయ్యాయి. మంగళవారం సాయంత్రం ధ్వజారోహణంతో శ్రీవారి సాలికట్ల బ్రహ్మోత్సవాలను మెుదలు అయ్యాయి. బ్రహ్మోత్సవాల తొలిరోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు.
Tue, 27 Sep 202204:18 PM IST
కన్నుల పండువగా దసరా ఉత్సవాలు
తెలుగు రాష్ట్రాల్లో దసరా ఉత్సవాలు కన్నుల పండువగా జరుగుతున్నాయి. భక్తులు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా రెండో రోజు అమ్మవారు.. బాలా త్రిపుర సుందరీదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు.
Tue, 27 Sep 202201:21 PM IST
వివేకా హత్య కేసులో మరో కీలక పరిణామం
వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కీలక పరిణామం జరిగింది. ఈ హత్య కేసులో కీలక సూత్రదారి శివశంకర్ రెడ్డి అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ప్రస్తుతం శివశంకర్ రెడ్డి ఇదే కేసులో అరెస్టు అయి జైలులో ఉన్న విషయం తెలిసిందే. బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించిన సందర్భంలో ఆయనే కీలక వ్యక్తి అని వ్యాఖ్యానించింది సుప్రీం కోర్టు. బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించింది. గతంలో ఆయన బెయిల్ కోసం ఏపీ హైకోర్టుకు వెళ్లారు. అక్కడ బెయిల్ రాక.. సుప్రీంకోర్టుకు వెళ్లగా అక్కడ నిరాశ ఎదురైంది.
Tue, 27 Sep 202201:16 PM IST
నవరాత్రుల తొలిరోజు ఇంద్రకీలాద్రి ఆదాయం
దసరా నవరాత్రులు తొలిరోజు వివిధ సేవల టిక్కెట్ లు, ప్రసాదాలు అమ్మకాలు ద్వారా ఇంద్రకీలాద్రికి రూ. 26 లక్షల 10 వేల 444 రూపాయలు ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈఓ భ్రమరాంబ ఒక ప్రకటనలో తెలిపారు. దసరా శరన్నవరాత్రులు తొలిరోజు సోమవారం అమ్మవారు స్వర్ణ కవచాలంకృత శ్రీ కనకదుర్గా దేవీ అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. రూ.500 టిక్కెట్స్ అమ్మకాల ద్వారా రూ. లక్ష 81 వేల 500 రూపాయలు, రూ. 300 టిక్కెట్స్ అమ్మకాల ద్వారా రూ. 9 లక్షల 67 వేల 500 రూపాయలు, రూ. 100 టిక్కెట్స్ అమ్మకం ద్వారా రూ.5 లక్షల 13 వేల 600 రూపాయలు ఆర్జించడం జరిగిందన్నారు. అలాగే లడ్డూ ప్రసాదం ద్వారా రూ. 7 లక్షల 07 వేల 160 రూపాయలు, కుంకుమార్చన టిక్కెట్స్ ద్వారా రూ. లక్షా 20 వేలు, చండీ హోమం టిక్కెట్స్ రూ. 68 వేల రూపాయలు, ఇతర సేవలు ద్వారా రూ. 52 వేల 680 రూపాయల ఆదాయం సమకూరినట్లు ప్రకటనలో ఈఓ తెలిపారు.
Tue, 27 Sep 202212:22 PM IST
విగ్రహాలపై దాడులు!
దసరా శరన్నవరాత్రులు జరుగుతున్న సమయంలో నగరంలో విగ్రహాల ధ్వంసం ఘటన కలకలం రేపుతోంది. దుర్గా మాత విగ్రహం, మదర్ మేరీ, జీసస్ విగ్రహాలను ఇద్దరు ముస్లిం మహిళలు ధ్వంసం చేసినట్టుగా వార్తలు వస్తున్నాయి. అయితే వారు పోలీసుల అదుపులో ఉన్నారని ప్రచారం జరుగుతుంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Tue, 27 Sep 202210:54 AM IST
మంచిరెడ్డి కిషన్ రెడ్డిని అరెస్ట్ చేయాలి
మని లాండరింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన మంచి రెడ్డి కిషన్ రెడ్డిని తక్షణమే అరెస్ట్ చేయాలని.. మల్ రెడ్డి రంగారెడ్డి డిమాండ్ చేశారు. భూ కబ్జాలు, కేసినోలో నిందితుడిగా ఉన్న మంచి రెడ్డి కిషన్ రెడ్డి నీ వెంటనే విచారించాలన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం తక్షణమే ఎమ్మెల్యే నీ బర్తరఫ్ చేయాలన్నారు. ఇప్పటికే ఎన్నో సార్లు అతనిపై ఆరోపణలు వచ్చాయని చెప్పారు. ఇబ్రహింపట్నం నియోజికవర్గంలో అనేక భూ కబ్జాలు చేసి కోట్లు గడించి విదేశాలకు హవాల ద్వారా డబ్బులు పంపించారని ఆరోపించారు.
Tue, 27 Sep 202207:31 AM IST
మూడు రాజధానులు కాదు మూడు రాష్ట్రాలు చేస్కోండి
షర్మిల తనపై నిందలు వేయడం దురదృష్టకరమని, తాను కోవర్టునో కాదో తర్వాత సమాధానం చెబుతానన్నారు జగ్గారెడ్డి. షర్మిలను సీఎం చేయాలనుకుంటే జగన్‍కు నచ్చజెప్పి ఏపీలో సీఎం చేయాలని, మూడు రాజధానులు ఎందుకు? మూడు రాష్ట్రాలు చేయాలని సూచించారు. వైజాగ్, అమరావతి, కడపను రాష్ట్రాలుగా చేసుకోవాలని, మూడు ప్రాంతాలకు ముగ్గురిని సీఎంలుగా చేసుకోవాలన్నారు. షర్మిల ఏం చేసినా తెలంగాణలో నాయకురాలు కాలేదని, కుటుంబంలో పంచాయితీ తీసుకొచ్చి రాష్ట్రాల మధ్య పంచాయితీలా మార్చొద్దన్నారు. మీ ఇంట్లో వాళ్లే సీఎంలుగా ఉండాలా అని నిలదీశారు.
Tue, 27 Sep 202207:28 AM IST
ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకలు
ప్రపంచ పర్యాటక దినోత్సవవేడుకలను సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రారంభించారు. రాష్ట్ర పర్యాటక అభివృద్దిలో భాగంగా విజిట్ ఆంధ్రప్రదేశ్ 2023 క్యాంపెయిన్‌ను సీఎం ప్రారంభించారు. క్యాంపెయిన్ బ్రోచర్ల ఆవిష్కరించారు. రాష్ట్రంలో సులువుగా పర్యాటక ప్రదేశాలను గుర్తించేందుకు వీలుగా రూపొందించిన జీఐఎస్ వెబ్‌పోర్టల్‌ను సీఎం ప్రారంభించారు. పర్యాటక అభివృద్దిలో కీలకపాత్ర పోషిస్తూ టూరిజం, ట్రావెల్, ఆతిధ్య రంగాలలో అత్యుత్తమ ప్రతిభ కనపరచాలని సీఎం సూచించారు. ఈ సందర్భంగా అరకు నుంచి వచ్చిన గిరిజన థింసా నృత్య కళాకారులతో సీఎం ముచ్చటించారు.
Tue, 27 Sep 202206:49 AM IST
సిఎం జగన్ హీరో … యార్లగడ్డ
సీఎం జగన్ తన దృష్టిలో హీరో అని యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ చెప్పారు. సోనియా కేంద్రమంత్రిని చేస్తానన్నా, ఓదార్పు యాత్ర చేశారని, ప్రజల మధ్యే ఉంటూ 151 సీట్లు సాధించారని చెప్పారు. ఎన్టీఆర్‍కు భారతరత్న అడ్డుకున్నది చంద్రబాబేనని దానికి తానే ప్రత్యక్ష సాక్షిని అని చెప్పారు. బాబు హయాంలో గన్నవరం ఎయిర్‍పోర్టుకు ఎన్టీఆర్ పేరెందుకు పెట్టలేదన్నారు. తెలుగుగంగ ప్రాజెక్టుకు ఎన్టీఆర్ పేరును వైఎస్సార్ పెట్టారని యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గుర్తు చేశారు.
Tue, 27 Sep 202206:43 AM IST
డిఎస్పీపై టీడీపీ నేతల ఆగ్రహం
అనంతపురం జిల్లా తాడిపత్రి డీఎస్పీ తీరుపై మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. డీఎస్పీ చైతన్య ప్రోద్బలంతోనే వైసీపీ రౌడీల అరాచకాలు జరుగుతున్నాయని ఆరోపించారు. వరుసగా దళిత సామాజిక వర్గానికి చెందిన కౌన్సిలర్లే టార్గెట్‍గా జరుగుతున్న దాడులు క్షీణించిన శాంతిభద్రతలకు నిదర్శనమన్నారు. డీఎస్పీ ఏకపక్షంగా వ్యవహరిస్తూ టీడీపీ నేతలను ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు. కౌన్సిలింగ్ పేరుతో చితకబాది గాయాలపాలు చేసున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యే పెద్దారెడ్డి ప్రోద్బలంతోనే టీడీపీ కౌన్సిలర్లపై వరుస దాడులు చేస్తున్నారని మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు ఆరోపించారు.
Tue, 27 Sep 202205:55 AM IST
అమెరికా రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి
అమెరికాలో జరిగిన రోడ్డుప్రమాదంలో తానా బోర్డు సభ్యుడు నాగేంద్ర శ్రీనివాస్ భార్య మృతి చెందారు. రోడ్డు ప్రమాదంలో నాగేంద్ర శ్రీనివాస్ భార్య, ఇద్దరు కుమార్తెలు మృతి చెందారు. హ్యూస్టన్‍లో స్థిరపడిన పామర్రు మండలం కురుమద్దాలికి చెందిన శ్రీనివాస్ కుటుంబం ప్రమాదం బారిన పడింది. తానా బోర్డు సభ్యుడిగా బాధ్యతలు నిర్వహిస్తున్న డాక్టర్ కొడాలి నాగేంద్ర శ్రీనివాస్ - కుమార్తెలను తీసుకొచ్చేందుకు కళాశాలకు వెళ్లిన శ్రీనివాస్ భార్య వాణి , కళాశాల నుంచి వస్తుండగా వాణి ప్రయాణిస్తున్న కారును బలంగా వ్యాను ఢీకొట్టడంతో ఘటనాస్థలిలో ఇద్దరు మృతి చెందారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరొకరు మృతి చెందారు.
Tue, 27 Sep 202205:55 AM IST
విష్ణుకుమార్‍రాజు సంచలన వ్యాఖ్యలు
అమరావతి రైతుల పాదయాత్రపై బీజేపీ నేత విష్ణుకుమార్‍రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో దారుణంగా నష్టపోయింది అమరావతి రైతులేనని చెప్పారు. ఉత్తరాంధ్రలో రాజధాని రైతులు పాదయాత్ర చేస్తే.. ఊరుకోమని వైసీపీ నేతలు హెచ్చరించడాన్ని తప్పు పట్టారు. పాదయాత్రను ఊరుకోమంటే, ఇదేమైనా మీ సొంత జాగీరా అని నిలదీశారు. అమరావతి రైతులను బెదిరించడం సరికాదన్నారు.
Tue, 27 Sep 202205:55 AM IST
తిరుమలలో సిఎం పర్యటన
నేడు తిరుమలలో సీఎం జగన్ పర్యటించనున్నారు. ఉదయం ఎలక్ట్రిక్ బస్సుల ప్రారంభోత్సవం జరుగుతుంది. రాత్రికి తిరుమలలో పట్టువస్త్రాలు సమర్పిస్తారు. రేపు ఉదయం పరకామణి భవనం ప్రారంభోత్సవం నిర్వహిస్తారు. ఆ తర్వాత నంద్యాల పర్యటనకు సీఎం జగన్ వెళ్తారు.
Tue, 27 Sep 202205:55 AM IST
విభజన సమస్యలపై చర్చ
తెలుగురాష్ట్రాల విభజన సమస్యలపై నేడు కేంద్రం ప్రత్యేక సమావేశం నిర్వహించనుంది. కేంద్ర హోం శాఖ కార్యదర్శి అజయ్ భల్లా నేతృత్వంలో ఢిల్లీలో సమావేశం జరుగుతోంది. భేటీకి ఇరు రాష్ట్రాల ఉన్నతాధికారులు, కేంద్ర ప్రభుత్వ అధికారులు హాజరుకానున్నారు. ఉభయ రాష్ట్రాల మధ్య వివాదాలపైనా చర్చించనున్నారు. ఏపీ రాజధాని అంశంపై ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది.
Tue, 27 Sep 202205:55 AM IST
నేటి నుంచి తిరుమల బ్రహ్మోత్సవాలు
ధ్వజారోహణంతో నేటి నుంచి శ్రీవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. కరోనా తరువాత తొలిసారి భక్తుల సమక్షంలో ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. వైభవంగా ఉత్సవాలను నిర్వహించేందుకు టీటీడీ సర్వం సిద్ధం చేసింది. విద్యుత్ వెలుగుల్లో శ్రీవారి ఆలయం, రంగనాయకుల మండపం మెరిసిపోతోంది. సాయంత్రం ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సీఎం జగన్ సమర్పించనున్నారు. బ్రహ్మోత్సవాలకు టీటీడీ పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది.
Tue, 27 Sep 202205:55 AM IST
పాపులర్ ఫ్రంట్‌పై అభియోగాలు
ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీ ముఖ్య నేతల హత్యకు కుట్ర చేసినట్లు పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాపై అభియోగాలు నమోదయ్యాయి. పాట్నాలో ప్రధాని హత్యకు కుట్ర చేసినట్లు NIA విచారణలో వెల్లడైంది. 6 నెలల కాలంలో PFI అకౌంట్ లో రూ.120కోట్లు జమ అయినట్లు గుర్తించారు. - విదేశాల నుంచి భారీ గా డబ్బులు సేకరించిన PFI వాటిని ఉగ్ర కార్యకలాపాల కోసం వినియోగించినట్లు అనుమానిస్తున్నారు.
Tue, 27 Sep 202205:55 AM IST
బాలాత్రిపుర సుందరీ దేవిగా దుర్గమ్మ
తెలుగు రాష్ట్రాల్లో శరన్నవరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. బెజవాడ ఇంద్రకీలాద్రి దుర్గాదేవి, బాలా త్రిపురసుందరీ దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో అమ్మవారిని దర్శించుకునేందుకు తరలి వస్తున్నారు. ఈ ఏడాది దసరా ఉత్సవాల్లో అమ్మవారు పది రోజుల పాటు పది అలంకారాల్లో భక్తులకు దర్శనమిస్తారు.