విజయ దశమి రోజు శ్రీ రాజరాజేశ్వరీ దేవి అవతారం విశిష్టత- పఠించాల్సిన మంత్రం ఇదే-navaratri 10th day vijaya dasami sri rajarajeshwari devi alankaram significance ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  విజయ దశమి రోజు శ్రీ రాజరాజేశ్వరీ దేవి అవతారం విశిష్టత- పఠించాల్సిన మంత్రం ఇదే

విజయ దశమి రోజు శ్రీ రాజరాజేశ్వరీ దేవి అవతారం విశిష్టత- పఠించాల్సిన మంత్రం ఇదే

HT Telugu Desk HT Telugu
Oct 11, 2024 04:57 PM IST

అక్టోబర్ 12 దసరా పండుగ జరుపుకోనున్నారు. తొమ్మిది రోజులు తొమ్మిది రూపాలలో దర్శనం ఇచ్చిన అమ్మవారు విజయ దశమి రోజు రాజరాజేశ్వరీ దేవిగా భక్తులకు కనిపిస్తారు. ఈ అలంకార విశిష్టత గురించి ఆధ్యాత్మికవేత్త పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ వివరించారు.

శ్రీ రాజరాజేశ్వరీ దేవి అవతారం
శ్రీ రాజరాజేశ్వరీ దేవి అవతారం

దేవీ నవరాత్రులలో విజయదశమిగా పిలువబడే ఆశ్వయుజ శుక్ల దశమి నాడు రకరకాల పూజలు, వేడుకలు చేసుకుంటారు. తొమ్మిది రోజుల పాటు సాగిన యుద్ధంలో దుష్టశిక్షణ జరిపిన అమ్మను శాంతింప చేసి ప్రసన్నమూర్తిని చేసుకుంటారు. ఈరోజు శ్రీ రాజరాజేశ్వరీ దేవి రూపంలో పరిపరి విధాల స్తుతించి, భ‌క్తులు ఇహపర సౌఖ్యాలు పొందుతార‌ని ప్ర‌ముఖ ఆధ్యాత్మిక వేత్త‌, పంచాంగ క‌ర్త చిల‌క‌మ‌ర్తి ప్ర‌భాక‌ర చ‌క్ర‌వ‌ర్తి శ‌ర్మ తెలిపారు.

అమ్మవారు చిద్రూపిణి. పరదేవతగా అలరారుతుందని చిల‌క‌మ‌ర్తి తెలిపారు. పరమేశ్వరుని అంకమును ఆసనముగా చేసుకుని చేతిలో చెరకుగడతో, చిరుమందహాసంతో శోభాయమానమై ప్రకాశించే జగన్మాతను మనోనేత్రంతో దర్శించుకుంటూ పూజోపచారాలు భక్తితో సమర్పించుకుందాం అని చిల‌క‌మ‌ర్తి తెలిపారు. అనంత శక్తి స్వరూపిణి అయిన ఈ తల్లి శ్రీచక్రానికి అధిష్టాన దేవత. త్రిపుర త్రయంలో తృతీయ దేవత.

ఈ రోజున శ్రీ రాజరాజేశ్వరిని ప్రసన్నం చేసుకోవడానికి కుంకుమార్చనలు, సువాసినీ పూజలు, శ్రీచక్రార్చనలు నిర్వహిస్తారని చిల‌క‌మ‌ర్తి తెలిపారు. వాహనాలకి, వ్యవసాయ పనిముట్లకి పసుపు, కుంకుమ బొట్లు పెట్టి పూల మాలలు అలంకరించి పూజలు చేస్తారు. శమీ వృక్షానికి పూజలు చేస్తారు. ఈ రోజే పాండవులు శమీ వృక్షానికి ప్రదక్షణలు చేసి ఆయుధపూజ జరిపి, అమ్మవారి ఆశీస్సులు పొంది కురుక్షేత్ర యుద్ధంలో విజయం సాధించారని చిల‌క‌మ‌ర్తి తెలిపారు. అందుచేత మనం కూడా విజయదశమి నాడు శమీ వృక్షానికి పూజలు, ప్రదక్షణిలు చేసి ఈ క్రింది శ్లోకాన్ని పఠించుకోవడం వల్ల సర్వత్రా విజయం సిద్ధిస్తుందని చిలకమర్తి తెలిపారు.

శమీ శమయతే పాపం శమీ శత్రువినాసినీ

అర్జునస్య ధనుర్థారీ రామస్య ప్రియదర్శినీ

దశమి నాడు జరిపే పూజా వేడుకలు అమ్మవారి నవరాత్రి పూజకు పునః పూజ చేసి, ఉద్యాపన పలకడం అనుకోవచ్చు అని చిల‌క‌మ‌ర్తి తెలిపారు. బొమ్మలకొలువు పూజలకు కానీ, బాల పూజలకు కానీ ఈ రోజుతో ముగింపు పలుకుతారని చిల‌క‌మ‌ర్తి తెలిపారు.

నవరాత్రులలో తుది పూజ విజయ దశమి పూజ. అమ్మవారికి శ్రీ రాజరాజేశ్వరీ దేవి అష్టోత్తరంతో అన్ని పూజలు జరిపి సమస్త జనులు సుఖంగా ఉండాలని కోరుకుంటూ అమ్మవారికి ఎంతో ఇష్టమైన బూందీ లడ్డూతో పాటు షడ్రసోపేతమైన భోజన పదార్థాలతో మహానివేదన సమర్పించాలని చిల‌క‌మ‌ర్తి తెలిపారు.

విజయదశమి రోజు విజయ ముహూర్తంగా పిలుస్తారు. అంటే ఏ పని తలపెట్టినా అది విజయవంతం అవుతుందని భక్తుల ప్రగాడ విశ్వాసం. పిల్లలు పెద్దలు కొత్త దుస్తులు ధరించి బంధుమిత్రులతో కలిసి విందులు, వినోదాలు చేస్తారు. ప్రతీ తెలుగు లోగిలి పిల్లా పాపలతో, పెద్దల ఆదరాభిమానాలతో, కన్నె పిల్లల పట్టు పావడాలతో ముత్తైదువుల పట్టు చీరల రెపరెపలతో, కొత్త అల్లుళ్ళు, మరదళ్ల సరసాలతో, కొత్త కోడళ్ళ మురిపాలతో, ఆడపడుచుల ముచ్చటలతో, షడ్రసోపేతమైన తెలుగు భోజనాలతో పండగ సందడి నెలకొంటుందని చిల‌క‌మ‌ర్తి తెలిపారు. ఒకరికొకరు కానుకలు, మిఠాయిలు ప్రేమగా పంచుకుంటారు. కలశం పెట్టి అమ్మవారి మూర్తిని పెట్టి సామూహికంగా చేసుకున్నవారు దశమి రోజున భక్తిశ్రద్ధలతో ఉద్వాసన పలికి, నిమజ్జనం చేస్తారని ఆధ్యాత్మికవేత్త పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.

పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
Whats_app_banner