కాలసర్ప దోషం అంటే ఏమిటి? దాని ప్రభావం, పరిష్కారం తెలుసా?
కాలసర్ప దోషం అంటే ఏమిటి? దాని ప్రభావం, పరిష్కారం తెలుసా? పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించిన వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
ప్రతీ మానవునికి జీవితములో కష్ట సుఖములు, జయాపయాలు, సుఖదుఃఖాలు ఏర్పడతాయి. ఇవన్నీ వారి యొక్క జాతక ప్రభావాన్నిబట్టి, వారు ఆచరించే కర్మలను బట్టి, పాప పుణ్యాల కర్మలను బట్టి కలుగుతుంటాయి. మానవుని యొక్క జీవితంలో మంచి చెడుల విశ్లేషణకు, పాప పుణ్య కర్మ ఫలితాల విశ్లేషణకు, మన బుషులు, మహర్షులు అందించినటువంటి గొప్ప జ్ఞానము జ్యోతిష్యశాస్తము. ఈ జ్యోతిష్య శాస్త్రము మానవుల జీవితాన్ని అర్ధం చేసుకోవడానికి, సరైన మార్గములో పెట్టుకోవడానికి గొప్ప సాధనమని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
జ్యోతిష్యశాస్త్ర ప్రకారము మానవులు పూర్వ జన్మ పాపకర్మలు అనుభవించేటటువంటి స్థితి కొన్ని దోషాల ద్వారా జాతక చక్రము తెలియచేస్తుంది. అలా పూర్వ జన్మ కర్మ ఫలితాలు ఈ జన్మలో అనుభవింపచేసే దోషాలలో కాలసర్ప దోషము ఒకటి.
కాలసర్ప దోషము అంటే జ్యోతిష్యశాస్త్ర ప్రకారము మానవుని జాతక చక్రములో రాహువు, కేతువు గ్రహాల మధ్య ఎలాంటి గ్రహాలు లేకపోతే దానిని కాలసర్ప దోషము అంటారు. రాహువు, కేతువు గ్రహాల మధ్య ఏ గ్రహాలు లేకున్నా, లగ్నమే ఉన్నా అలాంటి జాతకాన్ని కాలసర్ప దోషముగా తీసుకోవాలి.
కాలసర్ప దోషం ఉంటే కలిగే సమస్యలు
ఈ కాలసర్ప దోష ప్రభావము వలన ఆ జాతకులకు జీవితములో ప్రతీ పనిలో ఆటంకములు కలగడం, వివాహము ఆలస్యము అవ్వడం, వివాహము అయిన తరువాత వైవాహిక జీవితములో సమస్యలు ఇబ్బంది కలిగించడం, ఆవేశపూరిత నిర్ణయాలు తీసుకోవడము, కొన్ని సందర్భములలో మూర్ఖంగా వ్యవహరించడం వంటి అనేక సమస్యలు ఏర్పడతాయి.
ఈ కాల సర్ప దోషము వారి జాతకములో ఉన్న స్థానాన్ని బట్టి వారికి అనేక విషయాలలో ఇబ్బందులు, ఆటంకములు ఏర్పడతాయి. ఆ జాతకములో ఆ కాలసర్ప దోష స్థానాన్ని బట్టి శారీరక సమస్యలు, మానసిక సమస్యలు ఏర్పడుతుంటాయి. రాహువుతో క్రూర గ్రహాలు అయిన కుజుడు, రవి, బుధుడు వంటి గ్రహాలు కలిసినట్లయితే వాటి ప్రభావం వలన తీవ్రమైన మానసిక ఒత్తిళ్ళు ఇబ్బందులు జీవితానికి ఏర్పడతాయి. ఈ కాల సర్ప దోష ప్రభావాలు పూర్వజన్మ కర్మ ఫలితాలే అధికముగా ఉంటాయని శాస్త్రాలు తెలియచేసాయి.
కాలసర్ప దోషానికి పరిహారాలు
కాలసర్పదోషం జాతకములో ఉన్నటువంటి వారు ప్రతీ నిత్యం సుబ్రహ్మణ్యేశ్వరుని ఆరాధించడం మంచిదని చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు. జాతకములో కాలసర్ప దోషము ఉన్నటువంటివారు వారి పేరులో నాగ లేదా సుబ్రహ్మణ్య ఉండేటట్లుగా చూసుకోవడం మంచిది. కాల సర్ప దోషమున్న జాతకులు ప్రసిద్ధ సుబ్రహ్మణ్య క్షేత్రాలలో అభిషేకాలు, హోమాలు వంటివి చేసుకోవాలి. జాతకములో తీవ్రమైన కాలసర్ప దోషాలు ఉన్నవారు నాగ ప్రతిష్ట చేయించడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి. కాలసర్ప దోషము వల్ల వైవాహిక జీవితములో సమస్యలు ఉన్న వారు రాహువు కేతువులకు శాంతులు, హోమాలు, జపతపాదులు చేయించుకోవడం ఉత్తమము.
కాలసర్ప దోషము ఉన్నటువంటివారు మంగళవారం కుజ గ్రహాన్ని పూజించాలి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించాలి. అలాగే ఈ దోషము ఉన్నవారు శనివారం రాహువు, కేతువులను పూజించడం, దుర్గాదేవిని పూజించడం వల్ల కొంత దోష నివృత్తి కలుగుతుందని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.