Balarishta dosham: చంద్రగ్రహణం వేళ బాలారిష్ట దోషం.. తల్లిదండ్రులు పిల్లల పట్ల జాగ్రత్తగా ఉండాలి
Balarishta dosham: ఈ ఏడాది తొలి చంద్రగ్రహణం కన్యా రాశిలో ఏర్పడుతుంది. చంద్రుడు, కేతువు కలయిక వల్ల బాలారిష్ట దోషం ఏర్పడుతుంది. దీని ప్రభావం వల్ల పిల్లలు ఇబ్బందులు పడే అవకాశం ఉంది.
Balarishta dosham: ఈ ఏడాది మార్చి 25 తొలి చంద్రగ్రహణం ఏర్పడుతుంది. చంద్రుడు, కేతువు ఉత్తర ఫల్గుణి నక్షత్రంలో కన్యా రాశిలో కలిసి రావడం వల్ల అత్యంత ప్రతికూలమైన బాలారిష్ట దోషం కూడా ఏర్పడుతుంది. ఈ దోషం నవజాత శిశువులు, పిల్లల మీద ప్రభావం చూపిస్తుంది. కొన్ని అశుభకరమైన గ్రహాల కలయికలో పుట్టినప్పుడు శిశువు జాతకంలో బాలరిష్ట దోషం ఏర్పడుతుంది.
ఈ దోష ప్రభావంతో బాల్య దశలో పిల్లలు ప్రమాదాన్ని కలిగించే సందర్భాలు ఎదుర్కొంటారు. ఈ పరిస్థితిని బాలారిష్ట దోషం లేదా బాల గ్రహ దోషం అంటారు. బాలారిష్ట దోషం అంటే బాల్యంలో అనేక సమస్యలు ఎదుర్కోవడమే. ఈ దోషం పిల్లల దీర్ఘాయువు, శ్రేయస్సు మీద ప్రభావం చూపిస్తుంది. దీని ఫలితంగా పిల్లలు తరచు అనారోగ్యానికి గురవుతారు. బాలారిష్ట దోషం కలిగిన పిల్లలు జన్మించినప్పటి నుంచి పన్నెండు సంవత్సరాల వరకు దీని ప్రభావం వల్ల ఇబ్బందులు పడతారు.
మొదటి దశ బిడ్డ పుట్టినప్పటి నుంచి నాలుగు సంవత్సరాల వరకు ఉంటుంది. రెండో దశ ఐదవ సంవత్సరం నుంచి ప్రారంభమై తొమ్మిదో సంవత్సరం వరకు ఉంటుంది. బాలారిష్ట దోషం ఏర్పడినప్పుడు పిల్లలకు ఏదైనా శారీరక, ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. మూడో దశ తొమ్మిది సంవత్సరాల నుంచి ప్రారంభమై 12వ సంవత్సరం వరకు కొనసాగుతుంది. ఇది ఒక ప్రతికూలమైన దోషం. శారీరక ఆరోగ్య సమస్యలను కలిగిస్తుంది.
కొన్నిసార్లు పిల్లల జాతకంలో బాలారిష్ట దోషం ఉన్నప్పటికీ అది వారి జీవితం మీద ప్రతికూల ప్రభావాన్ని చూపకపోవచ్చు. అయినప్పటికీ తల్లిదండ్రులు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఈ దోషం ప్రభావాల నుంచి తప్పించుకోవచ్చు. జాతక లగ్నంలో బృహస్పతి ఉంటే బాలారిష్ట దోషం ప్రభావం తగ్గిపోతుంది. అలాగే గురు గ్రహం స్నేహపూర్వక గ్రహాలతో అనుకూలమైన స్థానంలో ఉంటే ఈ దోషం తొలగిపోతుంది. శుక్రుడు, బుధుడు గ్రహాలు జాతకంలో బలమైన స్థానంలో ఉన్నప్పుడు ఈ దోష ప్రభావం ఏ మాత్రం ఉండదు.
బాలారిష్ట దోషం తగ్గించే పరిహారాలు
ప్రతిరోజు వినాయకుడిని పూజించడం వల్ల బాలారిష్ట దోషం తొలగిపోతుంది. ముఖ్యంగా జాతకంలో కేతువు వల్ల దోషం ఉంటే ఇది చాలా ప్రభావవంతంగా ఉంటుంది. ఈ ప్రతికూల ప్రభావాలను తొలగించడం కోసం దుర్గాదేవిని ఆరాధించాలి. అలాగే గ్రహశాంతి నివారణ పూజ చేయించడం మంచి మార్గం. బాలారిష్ట దోషం వల్ల కొన్ని రాశుల వారి మీద ప్రతికూల ప్రభావం ఉంటుంది.
కన్యా రాశి
ఈసారి చంద్రుడు, కేతువు కన్యా రాశిలోనే ఉత్తర ఫల్గుణి నక్షత్రంలో కలిసి ఉంటారు. ఈ సంయోగం కన్యా రాశి ఒకటో ఇంట్లో జరుగుతుంది. ఫలితంగా బాలారిష్ట దోషాన్ని ఇస్తుంది. పిల్లల జాతకంలో ఇప్పటికే ఈ దోషం ఉన్నవారు ఈ సమయంలో శారీరక సమస్యలు ఎదుర్కొంటారు. పిల్లల ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి.
మీన రాశి
మీన రాశి వారికి చంద్రుడు, కేతువు కలిసి ఏడో ఇంట్లో సంచరిస్తారు. దీని వల్ల పిల్లలు తమ జీవితంలో ఆటంకాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అనారోగ్యాలతో ప్రభావితం అవుతారు. పిల్లల ఆరోగ్యం విషయంలో తల్లిదండ్రులు ఈరోజు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. వారి ఆరోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేయకూడదు.