Sri rama navami 2024: మీ ఇంట్లోనే శ్రీరామనవమి రోజు ఇలా పూజ చేయండి.. సుఖ సంతోషాలు కలుగుతాయి
Sri rama navami 2024: శ్రీరామనవమి రోజు మీ ఇంట్లోనే ఈ ఆచారాలు పాటిస్తూ పూజ చేయండి. శ్రీరాముని ఆశీస్సులతో సుఖ సంతోషాలు కలుగుతాయి. ఈ ఏడాది శ్రీరామనవమి ఏప్రిల్ 17వ తేదీన జరుపుకోనున్నారు.
Sri rama navami 2024: శ్రీరామనవమి పండుగ అంటే పల్లెటూరులో పది రోజుల ముందు నుంచే వేడుకలు ప్రారంభమవుతాయి. తాటాకు పందిళ్లు వేసి ఆలయాలను అందంగా అలంకరిస్తారు. ఈ పండుగను ఎంతో ఘనంగా చేసుకునేవారు.
ఆలయాల దగ్గర వడపప్పు, పానకం పంచి పెట్టెవాళ్ళు. వాటి కోసమే చాలా మంది గుడి దగ్గరకు వచ్చేవాళ్ళు ఉంటారు. దంపతి తాంబూలాలు, విసనకర్రల దానాలు వంటి కార్యక్రమాలను నిర్వహిస్తారు. ఈ తరం పట్టణ ప్రజలకు అలాంటి వాతావరణంలో ఇప్పుడు కనిపించకపోవచ్చు. శ్రీరామనవమి పండుగ సందడి చూడాలంటే పల్లెటూర్లకు వెళ్లాల్సిందే.
చైత్ర మాసం తొమ్మిదో రోజున శ్రీరాముడు జన్మించినట్లు పురాణాలు చెబుతున్నాయి. ఈ ఏడాది శ్రీరామనవమి ఏప్రిల్ 17వ తేదీ జరుపుకోనున్నారు. చైత్ర శుద్ధ నవమి రోజు మధ్యాహ్నం అభిజిత్ ముహూర్తంలో శ్రీరామచంద్రుడు జన్మించాడని పురాణాలు చెబుతున్నాయి. శ్రీరాముడి జననం, వివాహ మహోత్సవం, పట్టాభిషేకము ఆరోజే జరిగాయని అంటారు.
అందుకే శ్రీరామనవమి రోజు సీతారాముల కళ్యాణం తప్పకుండా నిర్వహిస్తారు. సీతారాముల కళ్యాణం లో ఉపయోగించే అక్షింతలు తల మీద చల్లుకుంటే వివాహం త్వరగా అవుతుందని భక్తుల విశ్వాసం.
శ్రీరామనవమి శుభ ముహూర్తం
నవమి తిథి ప్రారంభం.. ఏప్రిల్ 16 మధ్యాహ్నం 1.23 గంటల నుంచి
తిథి ముగింపు- ఏప్రిల్ 17 మధ్యాహ్నం 3.14 గంటలకు వరకు
ఉదయ తిథి ప్రకారం శ్రీరామనవమి ఏప్రిల్ 17 జరుపుకుంటారు.
శుభ ముహూర్తం ఏప్రిల్ 17 ఉదయం 11.03 గంటల నుంచి మధ్యాహ్నం 1. 38 గంటల వరకు ఉంది. పూజా సమయం వ్యవధి 2 గంటల 35 నిమిషాలు ఉంది.
ఇంట్లో శ్రీరామనవమి పూజా విధానం
బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేచి ఇల్లు వాకిలి శుభ్రం చేసుకోవాలి. అభ్యంగన స్నానం చేయాలి. ఇంటి ముందు అందమైన రంగవల్లులు వేయాలి. ఇంటి గుమ్మాలకు మామిడి ఆకులతో తోరణాలు కట్టుకోవాలి. కొత్త బట్టలు ధరించి పూజ చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకోవాలి.
శ్రీరామనవమి రోజు సీతారాముల సమేతంగా ఉన్న చిత్రపటాన్ని లేదా విగ్రహాన్ని పూజ గదిలో ప్రతిష్టించుకోవాలి. రామ దర్భార్ విగ్రహం ఏర్పాటు చేసుకుని పూజ చేసుకుంటే సకల సంతోషాలు కలుగుతాయి. సీతారాముల వారిని క్రమం తప్పకుండా పూజించడం వల్ల ఇంటికి సంతోషం, శ్రేయస్సు లభిస్తుంది. జాతకంలోని గ్రహదోషాలు తొలగిపోతాయి.
పూజ గదిలో సీతారాముల విగ్రహాన్ని లేదా చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకొని పూజ చేసుకోవచ్చు. ఇంటికి తూర్పు దిశలోనే ఈ విగ్రహాన్ని ప్రతిష్టించాలి. ఇది ప్రతిష్టించడం వల్ల ఇంట్లోని ప్రతికూల శక్తులను తొలగిస్తుంది. ప్రతిరోజు రామ్ దర్భార్ ను పూజించడం వల్ల మోక్షం లభిస్తుంది. సానుకూల శక్తి ఇంట్లో ప్రసరిస్తుంది. అన్ని బాధల నుంచి విముక్తి పొందుతారు. శ్రీరామనవమి రోజు రామ దర్భార్ పూజించడం వల్ల పుణ్యం లభిస్తుంది.
బియ్యం పిండితో ముగ్గు వేసి దాని మీద ఒక పీట ఏర్పాటు చేసుకోవాలి. పట్టు వస్త్రం లేదా నూతన వస్త్రం పరిచి దాని మీద సీతారాముల చిత్రపటం లేదా విగ్రహాలను పెట్టుకోవాలి. శ్రీరాముడికి పంచామృతాలతో అభిషేకం చేయాలి. తర్వాత షోడాపచారాలను అనుసరిస్తూ పూజ చేయాలి. ధూప, దీప, నైవేద్యాలు సమర్పించాలి. తర్వాత రామచరిత మానస్, సుందరకాండ వంటివి పారాయణం చేస్తే శ్రీరాముని అనుగ్రహం మీకు లభిస్తుంది. నైవేద్యంగా వడపప్పు, పానకం సమర్పిస్తారు. పూజ ముగిసిన తర్వాత బ్రాహ్మణులకు లేదా పెద్దవారికి పండ్లు, విసనకర్ర, తాంబూలం, నూతన వస్త్రాలను దానం చేయాలి. శ్రీరామనవమి రోజు రామాయణం చదువుకోవడం లేదా వినడం చేస్తే మంచి జరుగుతుంది.