Types marriages: సనాతన ధర్మం ప్రకారం వివాహాలు ఎన్ని రకాలో తెలుసా?-how many types of marriages in sanathana dharmam ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Types Marriages: సనాతన ధర్మం ప్రకారం వివాహాలు ఎన్ని రకాలో తెలుసా?

Types marriages: సనాతన ధర్మం ప్రకారం వివాహాలు ఎన్ని రకాలో తెలుసా?

Gunti Soundarya HT Telugu
Aug 17, 2024 10:15 AM IST

Types marriages: వివాహం అనగానే ప్రేమ, పెద్దలు కుదిర్చిన వివాహం అనుకుంటారు. కానీ పురాతన సాంప్రదాయాల ప్రకారం ఎనిమిది రకాల వివాహాలు ఉన్నాయి. అవి ఎలా చేస్తారు? గాంధర్వ వివాహం, అసుర వివాహం అంటే ఏంటి? ఈ అష్టవిధ వివాహాలలో ఏవి ఎక్కువగా ప్రాచుర్యంలో ఉన్నాయో తెలుసుకుందాం.

వివాహాలు ఎన్ని రకాలంటే..
వివాహాలు ఎన్ని రకాలంటే..

Types marriages: హిందూ ధర్మశాస్త్రం లో వివాహానికి చాలా ప్రాముఖ్యత ఉంది. విభిన్న సాంప్రదాయాలు ఆచరిస్తూ ఈ పవిత్రమైన బంధంతో జంటలు ఒక్కటవుతాయి. ప్రతి మతానికి అనుగుణంగా వివాహ సాంప్రదాయాలు ఉన్నాయి. ఎక్కువగా హిందూ, క్రైస్తవ, ముస్లిం సాంప్రదాయాల గురించి చూస్తూ ఉంటారు.

కానీ సనాతన ధర్మం ప్రకారం వివాహాలు ఎనిమిది రకాలు ఉన్నాయి. కొన్ని సరదాగా సాగేవి ఉంటే మరికొన్ని భయంకరమైన సంస్కృతులు కలిగి ఉంటాయి. ఎనిమిది వివాహాలు ఏంటో తెలుసుకుందాం.

బ్రహ్మ వివాహం

ఇది అత్యంత ఆదర్శవంతమైన, గౌరవప్రదమైన వివాహంగా పరిగణిస్తారు. ఇది పెద్దలు కుదిర్చే వివాహం. వధువు, వరుడి కుటుంబాల సమ్మతితో ఈ వివాహ వేడుక నిర్వహిస్తారు. ఈ రకమైన పెళ్ళిలో వధువు లేదా వరుడికి బదులుగా డబ్బు మార్పిడి లేదా విలాసవంతమైన బహుమతులు ఇచ్చిపుచ్చుకోవడం ఉండదు. అందుకే ఇది సనాతన ధర్మంలో అత్యున్నత వివాహంగా పరిగణిస్తారు. సంప్రదాయ ఆచారాలు, వేడుకలు నిర్వహిస్తారు.

దైవ వివాహం

దైవ వివాహం అనేది మతపరమైన వేడుక లేదా ఆచారంలో భాగంగా నిర్వహించే వివాహం. ఈ రకమైన వివాహంలో వధువును పూజారికి ఇచ్చి చేస్తారు. ఒక రకంగా చెప్పాలంటే బ్రహ్మణులకు మాత్రమే అమ్మాయిని ఇచ్చి వివాహం చేస్తారు.

ఆర్ష వివాహం

ఆర్ష వివాహంలో భాగంగా వధువు తరపు వాళ్ళు వరుడి తండ్రికి ఆవు, రెండు ఎద్దులను బహుమతిగా ఇస్తారు. లేదంటే వాటి విలువ కలిగిన వస్తువులు ఇస్తారు. ఇలా చెల్లించడాన్ని వధువు కుటుంబ సభ్యులు గౌరవ సూచకంగా స్వీకరిస్తారు.

గాంధర్వ వివాహం

గాంధర్వ వివాహం దీన్నే ప్రేమ వివాహం అని కూడా పోలుస్తారు. ఒక జంట సంప్రదాయ వేడుకలను అనుసరించకుండా వ్యక్తిగత ఎంపికతో వివాహం చేసుకుంటారు. ఇది వారి పరస్పర ప్రేమ, సమ్మతి ఆధారంగా జరుగుతుంది. అనేక సాంప్రదాయాలు ఈ వివాహాన్ని అంగీకరించడం లేదు.

ప్రజాపత్య వివాహం

ప్రజాపత్య వివాహం అనేది సామాజిక ఆమోదంపై ఆధారపడి ఉంటుంది. వధూవరుల కుటుంబాల ఆమోదం ఈ వివాహానికి ఉంటుంది. సంతానం ఇవ్వమని చెప్తూ ఈ వివాహం చేస్తారు.

అసుర వివాహం

అసుర వివాహం అత్యంత విమర్శనాత్మకమైనది. ఈ వివాహంలో వరుడు లేదా వధువు తమ భాగస్వామిని పొందేందుకు పెద్ద మొత్తంలో డబ్బును చెల్లిస్తారు. డబ్బులు ఇచ్చి వధువు లేదా వరుడిని కొనుగోలు చేసి పెళ్లి చేసుకుంటారు. ఇది అసలు ఆమోదయోగ్యమైనది కాదని అంటారు.

రాక్షస వివాహం

రాక్షస వివాహం అనేది వధువు లేదా వరుడిని అపహరించడం వారి కుటుంబం, బంధువులపై హింసాత్మకంగా దాడి చేసి బలవంతంగా పెళ్లి చేసుకోవడం. పేరులోనే ఉంది రాక్షసత్వం అని. బందీల పట్ల వారి క్రూరత్వాన్ని చూపించి పెళ్లి చేసుకుంటారు.

పైశాచిక వివాహం

పైశాచిక వివాహాన్ని సనాతన ధర్మంలో అత్యంత హీనమైనదిగా చూస్తారు. వరుడు లేదా వధువు అపస్మారక స్థితిలో ఉన్నప్పుడు సమ్మతి లేకుండా చేసుకునే వివాహం ఇది. వధువు లేదా వరుడిని మోసగించి వివాహం చేస్తారు. ఈ రకమైన వివాహం చాలా విమర్శలు కలిగి ఉంటుంది. హిందూ పురాణాలలో మాంసం తినే రాక్షసులు ఈ వివాహానికి పేరు పెట్టారని అంటారు.

ఇవి కాక కులాంతర వివాహాలు, స్వయంవరం అనేవి కూడా ఉన్నాయి. శ్రీరాముడు సీతాదేవి వివాహం జరిగింది స్వయంవరంలోనే. ఇక కులాంతర వివాహం అనేది వేర్వేరు కులాలకు చెందిన వధూవరులు వివాహం ఆడతారు. ఇది కూడా సమాజంలో కొంతమంది ఆమోదయోగ్యం కాదని అంటారు.

గమనిక : పైన ఇచ్చిన సమాచారం నమ్మకాల మీద ఆధారపడి ఉంది. ఇంటర్నెట్‌లో దొరికిన వివరాల ఆధారంగా ఇచ్చాం. ఇది కేవలం సమాచారం కోసం మాత్రమే. పైన చెప్పిన విషయాలకు HT Telugu ఎలాంటి బాధ్యత వహించదు. మీకు ఏమైనా అనుమానాలు ఉంటే సంబంధిత నిపుణులను సంప్రదించండి.

టాపిక్