Ugadi Rasi Phalalu 2024: ధనుస్సు రాశి ఉగాది రాశి ఫలాలు.. ఆదాయం 11, వ్యయం 5
Dhanusu Rashi 2024 Ugadi: ధనుస్సు రాశి ఉగాది 2024 రాశి ఫలాలను పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు. ఆరోగ్యం, ఆర్థికం, కెరీర్, ప్రేమ తదితర అంశాల్లో ఈ క్రోధి నామ సంవత్సరం ధనూ రాశి వారికి ఎలా ఉండబోతోందో వివరించారు. అలాగే మాసవారీ ఫలితాలను కూడా ఇక్కడ చూడవచ్చు.
ధనుస్సు రాశి వారికి శ్రీ క్రోధి నామ సంవత్సరం మధ్యస్తం నుంచి అనుకూల ఫలితాలు ఉన్నాయని పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ వివరించారు.
మూల నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదంలో జన్మించిన వారు ధనుస్సు రాశి జాతకులు అవుతారు.
శ్రీ క్రోధి నామ సంవత్సరంలో ధనూ రాశి వారికి ఆదాయం 11 పాళ్లు, వ్యయం 6 పాళ్లుగా ఉంది. రాజ్యపూజ్యం 4 పాళ్లు, అవమానం 5 పాళ్లుగా ఉంది.
ధనూ రాశి సంవత్సర ఫలాలు
శ్రీ క్రోధి నామ సంవత్సరం నందు చిలకమర్తి పంచాంగ గణనం ఆధారంగా ధనుస్సు రాశి వారికి ఈ సంవత్సరం బృహస్పతి 6వ స్థానంలో సంచరిస్తున్నాడు. శని 3వ స్థానములో సంచరిస్తున్నాడు.
రాహువు 1వ స్థానము నందు, కేతువు 10వ స్థానమునందు సంచరించుట చేత ధనూరాశి వారికి ఈ శ్రీ కోధి నామ సంవత్సరంలో మధ్యస్థం నుంచి అనుకూల ఫలితాలున్నాయి.
తృతీయంలో శని అనుకూలించుట వలన, దశమంలో కేతువు, చతుర్ధంలో రాహువు అనుకూల ప్రభావం వలన వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో అనుకూల ఫలితాలు ఉన్నప్పటికి శత్రు స్థానములో గురుని ప్రభావంచేత శత్రుపీడ, నరఘోష ఇబ్బంది కలిగించును.
ఈ సంవత్సరం పనులయందు ఆలస్యము, చికాకులు ఇబ్బంది కలిగించును. ఉద్యోగస్తులకు ఉద్యోగములో రాజకీయ ఒత్తిళ్ళు అధికమగును. శత్రువర్గం చేత ఇబ్బందులు ఏర్పడును. వ్యాపారస్తులకు వ్యాపారంలో అనుకూలత ఉన్నప్పటికి మీతో వ్యాపార సంబంధ కలిగిన వారికి మరియు పనిచేసేవారి వలన ఆటంకాలు, ఇబ్బందులు కలుగు సూచన. శత్రువులతో ఆచితూచి వ్యవహరించాలి.
రైతాంగానికి ఈ సంవత్సరం అన్ని విధాలుగా అనుకూలంగా ఉన్నది. మీడియా, సినీరంగాల వారికి మధ్యస్థం నుండి అనుకూల ఫలితాలు ఉన్నాయి.
'రాజకీయ నాయకులకు శత్రుపీడ అధికముగా ఉండును. స్త్రీలకు కుటుంబంలో సమస్యలు వేధించును. మొత్తం మీద ధనుస్సు రాశి వారికి శ్రీ క్రోధి నామ సంవత్సరంలో మధ్యస్థం నుండి అనుకూల ఫలితాలు ఉన్నాయి. విద్యార్థులకు అన్ని విధాలుగా అనుకూల ఫలితాలు కలుగుతాయి.
ధనుస్సు రాశి ప్రేమ జీవితం 2024-25
ధనూ రాశి వారికి ఈ సంవత్సరం ప్రేమపరమైనటువంటి విషయాలు అనుకూలించవు. జీవిత భాగస్వామితో సమస్యలు, ఘర్షణలు అధికమగును. చికాకులు కలుగును. ప్రేమ వ్యవహారాల్లో ఆవేశపూరిత నిర్ణయాలకు దూరంగా ఉండాలని సూచన. మానసిక ఒత్తిళ్ళు ఏర్పడును.
ధనుస్సు రాశి వారి ఆర్థిక భవితవ్యం 2024-25
ధనస్సు రాశి వారికి ఈ సంవత్సరం మధ్యస్థంగా ఉన్నది. వ్యాపారస్తులకు ఆశించిన స్థాయిలో లాభం రాకపోవడం, ఖర్చులు కూడా పెరగడం కొంత ఇబ్బంది కలిగించేటటువంటి అంశం. శత్రు పీడ ధనవ్యయం అధికముగా ఉన్నాయి. ధనూరాశి వారు ఈ సంవత్సరం ఖర్చులు నియంత్రించుకోవాలని సూచన.
ధనుస్సు రాశి వారి కెరీర్ 2024-25
ధనుస్సు రాశి వారికి ఈ సంవత్సరం కెరీర్ పరంగా మధ్యస్థం నుండి అనుకూల ఫలితాలు ఉన్నాయి. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నం ఫలించును. వ్యాపారస్తులకు వ్యాపారాభివృద్ధి కలుగును. ఉద్యోగస్తులకు కెరీర్‌లో ప్రమోషన్లు వంటివి ద్వితీయార్థంలో అనుకూలించును.
ధనూ రాశి వారి ఆరోగ్యం 2024-25
ధనూ రాశి వారికి ఈ సంవత్సరం ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉన్నది. ఆరోగ్య విషయాల్లో పురోగతి కనిపించును. టెన్షన్‌లకు, ఒ త్తిళ్ళకు దూరంగా ఉండాలని సూచన.
చేయదగిన పరిహారాలు
ధనుస్సు రాశి జాతకులు 2024 సంవత్సరంలో మరింత శుభఫలితాలు పొందాలనుకుంటే దత్తాత్రేయుని పూజించాలి. దత్తాత్రేయుని ఉపాసించడం వలన మరింత శుభఫలితాలు కలుగుతాయని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు. ధనూ రాశి వారు 2024 సంవత్సరంలో ప్రతి గురువారం గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం మంచిదని చిలకమర్తి తెలిపారు.
ధరించాల్సిన నవరత్నం: ధనూ రాశి వారు ధరించవలసిన నవరత్నం కనక పుష్యరాగం.
ప్రార్థించాల్సిన దైవం: ధనూ రాశి వారు పూజించవలసిన దైవం గురు దక్షిణామూర్తి.
ధనుస్సు రాశి వారి 2024-25 నెలవారీ రాశి ఫలాలు
ఏప్రిల్: ఈ మాసం మీకు అంత అనుకూలంగా లేదు. దూరపు బంధువుల రాక. సహనం వహించుట మంచిది. ఆదాయానికి మించిన ఖర్చులు. కుటుంబములో చికాకులు. మృష్టాన్నభోజనం, శత్రు జయము. అనుకోని వస్తువులు కొనుగోలు చేయుట.
మే: ఈ మాసం మీకు అనుకూలముగా లేదు. వృథా ప్రయాణములు. శతృభయం. శ్రమ. అస్వస్తత. వృత్తివ్యాపారములు మందగించుట. పెద్దల సహకార లోపం. అకాల భోజనం.
జూన్: ఈ మాసం మీకు మధ్యస్థముగా ఉంది. కుటుంబ విభేదములు తొలగుతాయి. భూ సంబంధిత వ్యవహారాలను చక్కబెడతారు. వ్యాపారములు మందకొడిగా సాగుతాయి.
జూలై: ఈ మాసం ధనూ రాశి జాతకులకు మధ్యస్థ సమయం. ఖర్చులు అధికమగును. వ్యతిరేకులపై విజయము. ఉద్యోగాభివృద్ధి. గవర్నమెంట్ ఉద్యోగస్తులకు కొంత అనుకూలం. ప్రయాణముల యందు జాగ్రత్త అవసరం. స్త్రీ మూలక సౌఖ్యం.
ఆగస్టు: ఈ మాసం మీకు మధ్యస్థ సమయం. కొన్ని విషయముల యందు మధ్యవర్తిత్వం చేయవలసి రావచ్చును. శుభకార్య నిర్వహణం. ధన వ్యవహారములు ముందుకు సాగుతాయి.
సెప్టెంబర్: ఈ మాసం ధనుస్సు రాశి జాతకులకు అనుకూలంగా లేదు. మనశ్శాంతి లోపించుటచే చిరాకులు. పెద్దవారి అరోగ్యం మందగిస్తుంది. వ్యాపార సంబంధిత వ్యవహారములయందు ప్రత్యేక శ్రద్ద పెట్టుట మంచిది. ప్రయాణ వాయిదాలు ఉండవచ్చును. సోదర పుత్ర వైషమ్యాలు.
అక్టోబర్: ఈ మాసం మీకు కొంత అనుకూలం. ఉద్యోగ బదిలీలు. శారీరక (శ్రమ తగ్గుతుంది. వృత్తి వ్యాపారముల యందు సామాన్యం. బంధుమిత్రుల కలయిక. అహ్లాదకరంగా ఉంటారు. దైవపర కార్యక్రమాల్లో పాల్గొంటారు.
నవంబర్: ఈ మాసం మీకు అనుకూలంగా లేదు. అనారోగ్య సూచన. ధన వ్యయము. దైవదర్శనములు. మిత్ర భేదములు. దూరప్రయాణములు చేయుట. కొన్ని అనుకూల ఖర్చులు. ప్రయాణములచే అలసట, కొంత చికాకులు కలుగును.
డిసెంబర్: ఈ మాసం ధనుస్సు రాశి జాతకులకు మధ్యస్థం. ఇంటిలోని వారికి అనారోగ్య సమస్యలు. విందులు వినోదాల్లో పాల్గొంటారు. అతిశ్రమ వల్ల ధనాదాయము. నూతన వ్యాపారములు ప్రారంభించుటకు ప్రయత్నములు. సంఘంలో కీర్తి ప్రతిష్టలు సామాన్యంగా ఉంటాయి.
జనవరి: ఈ మాసం మీకు మధ్యస్థం నుండి కొంత అనుకూలం. సంతాన విషయంలో శుభములు. వృత్తి వ్యాపారాలలో కొంత అభివృద్ధి. ఆర్థికంగా నిలబడతారు.
ఫిబ్రవరి: ఈ మాసం మీకు అనుకూలంగా లేదు. భార్యకు అనారోగ్య సమస్యలు. శుభ పరంగా ధనవ్యయం. శారీరక శ్రమ అధికమగును. కొన్ని పనుల యందు నిదానం అవసరం. భాగస్వామ్య వ్యాపారులకు మధ్య మనస్పర్థలు.
మార్చి: ఈ మాసం ధనుస్సు రాశి వారికి అనుకూలంగా లేదు. భోజన సౌఖ్యము. కొత్త విషయములందు అసక్తి. కొంత ద్రవ్య నష్టము. ప్రయాణముల వలన అలసట, చికాకులు కలుగును. కష్టపడి పనిచేసినా ఫలం అందదు. దూర ప్రయాణ విషయముగా ఆలోచనలు.