Burn Bay Leaves : మీ ఇంట్లో బిర్యానీ ఆకులు ఇలా కాల్చితే డబ్బే డబ్బు.. ప్రయత్నించండి!-burn biryani leaves in home like this to get huge money ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Burn Bay Leaves : మీ ఇంట్లో బిర్యానీ ఆకులు ఇలా కాల్చితే డబ్బే డబ్బు.. ప్రయత్నించండి!

Burn Bay Leaves : మీ ఇంట్లో బిర్యానీ ఆకులు ఇలా కాల్చితే డబ్బే డబ్బు.. ప్రయత్నించండి!

Anand Sai HT Telugu
May 10, 2024 02:36 PM IST

Biryani Leaves Benefits : బిర్యానీ ఆకులకు ఎంతో ప్రాధాన్యత ఉంది. అయితే కొన్ని నమ్మకాల ప్రకారం వీటిని కొన్ని రకాలుగా కాల్చితే డబ్బు వస్తుందని చెబుతారు.

బిర్యానీ ఆకులను కాల్చితే ప్రయోజనాలు
బిర్యానీ ఆకులను కాల్చితే ప్రయోజనాలు (Unsplash)

జ్యోతిష్యశాస్త్రం ప్రకారం మన ఇంటి వంటగదిలో ఉండే అనేక మసాలా దినుసులు ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తిని తొలగించి, ఇంట్లో సానుకూల శక్తి ప్రవాహాన్ని పెంచుతాయి. ఈ మసాలా దినుసులను ఎవరైనా తమ ఇంట్లో సరైన పద్ధతిలో ఉపయోగిస్తే, ఇంట్లోని సమస్యలను తొలగించి ఆర్థిక స్థితిని పెంచుకోవచ్చు. అలాంటి వాటిలో ఒకటి బిర్యానీ ఆకులు.

బిర్యానీ ఆకులు శ్రేయస్సు, అదృష్టంతో ముడిపడి ఉంది. అనేక సంస్కృతులలో బిర్యానీ ఆకును డబ్బును ఆకర్షించడానికి ఒక మాయా ఆకుగా చెబుతారు. దీనికి కారణం బిర్యానీ ఆకుల వాసన. ఎందుకంటే సంపదలకు అధిపతి అయిన లక్ష్మీదేవికి మంచి వాసన అంటే ఇష్టమని అంటారు. ఈ ఆకును ఇంట్లో వాడితే లక్ష్మీదేవి మన ఇంట్లోకి ప్రవేశిస్తుందని, ఇంటి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందని నమ్మకం.

బిర్యానీ ఆకులు ఇంట్లో ఎక్కువ డబ్బు రావడానికి సహాయపడతాయని కొందరు చెబుతారు. ఇంట్లోని అనేక సమస్యల నుండి బయటపడటానికి కూడా సహాయపడతాయి. సంపద పెరగడానికి, సమస్యలు తగ్గడానికి బిర్యానీ ఆకును ఎలా ఉపయోగించాలో ఇప్పుడు చూద్దాం.

భార్యాభర్తల మధ్య గొడవలు జరిగి ఇంటి శాంతికి భంగం వాటిల్లుతుందా? ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉంటే దంపతుల మధ్య గొడవలు తగ్గుతాయి. నెగెటివ్ ఎనర్జీ తగ్గించుకోవడానికి రోజూ 2 బిర్యానీ ఆకులను కాల్చి, దాని పొగను ఇంటి చుట్టూ చూపించండి. దీంతో దంపతుల మధ్య తగాదాలు తగ్గి ఇంట్లో ఆనందం పెరుగుతుందని అంటారు.

మీ ఇంట్లో ఉన్న దుష్టశక్తులను వదిలించుకోవాలంటే, బిర్యానీ ఆకులు మీకు చాలా సహాయపడతాయి. అందుకు 7 బిర్యానీ ఆకులను 1 టీస్పూన్ ఉప్పుతో కలిపి తలకు 7 సార్లు చుట్టాలి. ఈ చర్యను ఎవరికీ చెప్పకుండా చేయాలని ఒక నమ్మకం.

మీ ఇంట్లో అనవసర ఖర్చులు ఎక్కువ అవుతున్నాయా? చేతిలో నగదు లేదా? కావున శుక్రవారం నాడు బిర్యానీ ఆకును తీసుకొని లక్ష్మీదేవి పాదాలపై ఉంచి, డబ్బు ఎల్లప్పుడూ మీ చేతిలో ఉండాలని ప్రార్థించండి. ఇలా చేయడం వల్ల డబ్బు సమస్య ఉండదని అంటారు. మీ చేతిలో డబ్బు ఎల్లప్పుడూ ఉంటుంది. అంతే కాకుండా బిర్యానీ ఆకు తీసుకుని దానిపై కోరికలు రాసి కాల్చితే తీరుతాయని కూడా కొందరి నమ్మకం.

మీరు ఏదైనా ముఖ్యమైన పని చేయబోతున్నారా? ఆ పనికి ఆటంకం ఉండకూడదని అనుకుంటే శనివారం నాడు 5 మిరపకాయలతో పాటు 5 బిర్యానీ ఆకులు తీసుకుని కాల్చండి. ఇలా చేయడం వల్ల మీ చుట్టూ ఉన్న ప్రతికూల శక్తులు తొలగిపోవడంతో పాటు మీ పనుల్లో ఉన్న అడ్డంకులు కూడా తొలగిపోతాయి. చెడు కలలు రాకుండా ఉండాలంటే.. రోజూ పీడకలలు మీ నిద్రను పాడు చేస్తే నిద్రకు ఉపక్రమించే ముందు మీ దిండు కింద బిర్యానీ ఆకు పెట్టుకుని పడుకోండి. ఇది చెడు కలలను ఆపుతుందని చాలా మంది నమ్ముతారు.

గమనిక : పైన ఇచ్చిన సమాచారం నమ్మకాల మీద ఆధారపడి ఉంది. ఇంటర్నెట్‌లో దొరికిన వివరాల ఆధారంగా ఇచ్చాం. ఇది కేవలం సమాచారం కోసం మాత్రమే. పైన చెప్పిన విషయాలకు HT Telugu ఎలాంటి బాధ్యత వహించదు. మీకు ఏమైనా అనుమానాలు ఉంటే సంబంధిత నిపుణులను సంప్రదించండి.

Whats_app_banner