Startup India : స్టార్టప్‌ ఇండియాకు దరఖాస్తు ఎలా చేయాలి? ప్రయోజనాలేంటి?-how to apply for startup india scheme and benefits ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Startup India : స్టార్టప్‌ ఇండియాకు దరఖాస్తు ఎలా చేయాలి? ప్రయోజనాలేంటి?

Startup India : స్టార్టప్‌ ఇండియాకు దరఖాస్తు ఎలా చేయాలి? ప్రయోజనాలేంటి?

Praveen Kumar Lenkala HT Telugu
Jan 24, 2022 09:02 PM IST

Startup India Scheme: కొత్త కంపెనీల స్థాపన లక్ష్యంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 2015 ఆగస్టు 15న స్టార్టప్‌ ఇండియాను ప్రకటించారు. కొత్త కొత్త వ్యాపార, పరిశ్రమ ఆలోచనలతో ముందుకు వచ్చే వారికి ప్రభుత్వం చేయూత ఇవ్వడం ఈ పథకం ఉద్దేశం.

<p>ప్రతీకాత్మక చిత్రం : స్టార్టప్&nbsp;</p>
<p>ప్రతీకాత్మక చిత్రం : స్టార్టప్&nbsp;</p> (unsplash)

స్టార్టప్‌ ఇండియా గుర్తింపు పొందాలంటే కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ పరిధిలోని డిపార్ట్‌మెంట్‌ ఫర్‌ ప్రమోషన్‌ ఆఫ్‌ ఇండస్ట్రీ అండ్‌ ఇంటర్నల్‌ ట్రేడ్‌(డీపీఐఐటీ)కి దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు చేసుకోబోయే స్టార్టప్‌ ప్రయివేటు లిమిటెడ్‌ కంపెనీగా గానీ, పార్ట్‌నర్‌షిప్‌ ఫర్మ్‌గా గానీ, లిమిటెడ్‌ లయబులిటీ పార్ట్‌నర్‌షిప్‌గా గానీ రిజిస్టర్‌ చేసుకుని ఉండాలి.

దరఖాస్తు చేసుకోబోయే స్టార్టప్‌ సంస్థ టర్నోవర్‌ గతంలో ఎన్నడూ రూ. 100 కోట్లకు మించరాదు.

ఏ సంస్థ అయినా ఇన్‌కార్పొరేట్‌ అయిన తరువాత పదేళ్ల వరకు మాత్రమే స్టార్టప్‌గా దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉంది.

ఆయా సంస్థలు సృజనాత్మక ఆవిష్కరణలు, ప్రస్తుతం ఉనికిలో ఉన్న ఉత్పత్తుల అభివృద్ధి, సేవలు అందించేవి అయి ఉండాలి. అలాగే ఉపాధి, సంపద సృష్టించే అవకాశం కలిగి ఉండాలి.

ఒక సంస్థను విభజించడమో, ఉనికిలో ఉన్న వ్యాపార సంస్థను కొత్తగా రీకన్‌స్ట్రక్ట్‌ చేయడం వంటి సందర్భాల్లో స్టార్టప్‌ గుర్తింపు కోసం దరఖాస్తు చేసుకోలేరు.

స్టార్టప్‌ గుర్తింపు ద్వారా ప్రయోజనాలేంటి?

స్టార్టప్‌ పరిశ్రమలకు మూడేళ్ల పాటు ఆదాయపన్ను మినహాయింపు లభిస్తుంది. ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్‌ 80 ఐఏసీ పరిధిలో మూడేళ్లపాటు ఆదాయ పన్ను మినహాయింపు లభిస్తుంది. 80 ఐఏసీ పరిధిలో ఆదాయ పన్ను మినహాయింపు లభించాలంటే 2016 ఏప్రిల్‌ 1 తరువాత స్టార్టప్‌ ఏర్పాటు చేసి ఉండాలి. దానికి గుర్తింపు ఉండాలి. కేవలం ప్రయివేటు లిమిటెడ్‌ కంపెనీగా లేదా లిమిటెడ్‌ లయబులిటీ పార్టనర్‌షిప్‌గా రిజిస్టర్‌ చేసుకుని ఉండాలి.

ఇది కాకుండా ఇన్‌కమ్‌ టాక్స్‌ పరిధిలోని సెక్షన్‌ 56 కింద కూడా పన్ను రాయితీ లభిస్తుంది. దీనిని ఏంజెల్‌ టాక్స్‌ అని కూడా అంటారు.

స్టార్టప్‌గా గుర్తింపు పొందిన తరువాత దీనికి దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే పెయిడ్‌ అప్‌ షేర్‌ కాపిటల్, స్టార్టప్‌ షేర్‌ ప్రీమియం రూ. 25 కోట్లకు మించరాదు.

స్టార్టప్‌ ఇండియా సీడ్‌ ఫండ్‌ స్కీమ్‌ ద్వారా మూలధన వ్యయం కోసం ఫండింగ్‌ పొందడం సులువవుతుంది. డీపీఐఐటీ స్టార్టప్‌ ఇండియా సీడ్‌ ఫండ్‌ స్కీమ్‌(ఎస్‌ఐఎస్‌ఎఫ్‌ఎస్‌)ను రూ. 945 కోట్ల నిధితో ప్రారంభించింది. ప్రూఫ్‌ ఆఫ్‌ కాన్సెప్ట్, ప్రొటోటైప్‌ డెవలప్‌మెంట్, ప్రొడక్ట్‌ డీటైల్స్, మార్కెట్‌ ఎంట్రీ, కమర్షలైజేషన్‌ వివరాలు ఉన్న వారు ఈ స్కీమ్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు.

అర్హత కలిగిన ఇంక్యుబేటర్స్‌ ద్వారా ఈ స్కీమ్‌ కింద ఫండింగ్‌ లభిస్తుంది. దరఖాస్తులను డీఐపీపీ వెబ్‌సైట్‌లో సమర్పించవచ్చు.

 

సంబంధిత కథనం