Independence Day 2024 : ఇది.. 77వ స్వాతంత్య్ర దినోత్సవమా? లేక 78 ఆ?
Independence Day : ఆగస్టు 15, 2024 న భారతదేశం ఎన్నో స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటుంది? 77వదా లేక 78వదా? ఇక్కడ తెలుసుకోండి..
2024 ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకునేందుకు భారత దేశం సన్నద్ధమవుతోంది. దాదాపు రెండు శతాబ్దాల బ్రిటిష్ వలస పాలన నుంచి భారతదేశానికి స్వాతంత్య్ర రావడానికి దారితీసిన పోరాటాన్ని గౌరవిస్తూ, దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా భారతీయులు ఉత్సాహంగా జరుపుకునే రోజు ఇది. స్వతంత్ర భారతం కోసం ప్రాణాలర్పించిన నాయకులు, స్వాతంత్య్ర సమరయోధులకు నివాళులర్పించేందుకు సరైన వేదిక ఈ స్వాతంత్య్ర దినోత్సవం.
2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలన్న ప్రభుత్వ దార్శనికతను ప్రతిబింబించేలా 2024 స్వాతంత్య్ర దినోత్సవం సమీపిస్తున్న తరుణంలో ఈ ఏడాది థీమ్ 'విక్షిత్ భారత్' అని నిర్ణయించారు. అయితే ఈ ఏడాది 77వ స్వాతంత్య్ర దినోత్సవమా? లేక 78వదా? అన్న డౌట్ అందరిలోనూ ఉంది.
77వ స్వాతంత్య్ర దినోత్సవమా లేక 78వ స్వాతంత్య్ర దినోత్సవమా?
దాదాపు 200 సంవత్సరాల తరువాత 1947 ఆగస్టు 15 న భారతదేశంలో బ్రిటిష్ వలస పాలన ముగిసింది. అప్పటి నుంచి ఆగస్టు 15వ తేదీని భారత స్వాతంత్య్ర దినోత్సవంగా జరుపుకుంటున్నారు. ఆగస్టు 15, 1948 న దేశం తన మొదటి స్వాతంత్య్ర సంవత్సరాన్ని జరుపుకుంది. ఈ లెక్కన చూసుకుంటే 2024ను భారతదేశ 77వ స్వాతంత్య్ర వార్షికోత్సవంగా మార్చింది.
అయితే, 1947నే స్టార్టింగ్ పాయింట్‌గా పరిగణిస్తే, ఆగస్టు 15, 2024 తేదీ 78వ స్వాతంత్య్ర దినోత్సవం అవుతుంది. ఈ నేపథ్యంలో 2024 ఆగస్టు 15న భారత్ 78వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటుందని చెప్పడం కరెక్టే. 1947 నుంచి 77వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్న భారత్ 2024లో 78వ స్వాతంత్య్ర దినోత్సవం కోసం ఏర్పాట్లు చేసుకుంటోంది.
భారతదేశం తన స్వాతంత్య్ర దినోత్సవాన్ని 2024 ఎలా జరుపుకుంటుంది?
ఆగస్టు 15న ఉదయం 7.30 గంటలకు ప్రధాని నరేంద్ర మోదీ ఎర్రకోటపై జాతీయ పతాకాన్ని ఎగురవేసి వరుసగా 11వ స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగం చేయనున్నారు. ఇందుకోసం దేశ రాజధాని దిల్లీ సిద్ధమవుతోంది. దిల్లీ నగరం ఇప్పటికే భారీ భద్రతా వలయంలోకి జారుకుంది. ఎక్కడికక్కడ పోలీసులు గస్తీకాస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటన జరగకుండా నిఘాని పెంచారు.
మరోవైపు ఎర్రకోట కార్యక్రమాన్ని దూరదర్శన్, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) యూట్యూబ్ ఛానల్, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఎక్స్ (గతంలో ట్విట్టర్) లో @PIB_India, పీఎంఓ ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు.
ఎర్రకోటపై జాతీయ జెండాను ఎగరవేసిన అనంతరం ప్రధాని మోదీ జాతినుద్దేశించి ప్రసంగిస్తారు. గత విజయాలను గుర్తు చేసి, భవిష్యత్తు లక్ష్యాలు, విధానాలను వివరిస్తారు. స్వాతంత్య్ర సమరయోధులకు నివాళులు అర్పిస్తారు. ప్రధాన మంత్రి ప్రసంగం తరువాత భారతదేశ సైనిక శక్తి, సాంస్కృతిక వైవిధ్యం, సాంకేతిక పురోగతిని ప్రదర్శించే భారీ పరేడ్ ఉంటుంది. సాయంత్రం ముఖ్యమైన భవనాలు, స్మారక చిహ్నాలు ప్రకాశవంతంగా మారి పండుగ వాతావరణాన్ని పెంచుతాయి.
సంబంధిత కథనం