SC affirms death penalty: ఎర్రకోట ఉగ్రదాడి సూత్రధారికి ఉరిశిక్ష సబబేనన్న సుప్రీం
SC affirms death penalty: 2000 డిసెంబరులో ఎర్రకోటపై ఉగ్రదాడికి పాల్పడిన మహ్మద్ అష్పాక్ ఆరిఫ్‌కు సుప్రీం కోర్టు గతంలో ఉరిశిక్ష విధించింది. ఆరిఫ్ దానిపై రివ్యూ పిటిషన్ వేయగా.. సుప్రీం కోర్టు ఇప్పుడు ఆ ఉరిశిక్షను ధ్రువీకరిస్తూ పిటిషన్‌ను కొట్టివేసింది.
SC affirms death penalty: 2000 సంవత్సరం డిసెంబరులో ఢిల్లీలోని ఎర్రకోట వద్ద ఆర్మీ బ్యారక్‌పై దాడికి పాల్పడిన పాకిస్థాన్ వ్యక్తి, లష్కరే తోయిబా ఉగ్రవాది మహ్మద్ అష్ఫాక్ ఆరిఫ్ మరణశిక్షను సుప్రీంకోర్టు గురువారం ధృవీకరించింది.
భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉదయ్ ఉమేష్ లలిత్ నేతృత్వంలోని ధర్మాసనం ఆరిఫ్ దాఖలు చేసిన రివ్యూ పిటిషన్‌ను తోసిపుచ్చింది. బెంచ్‌లో న్యాయమూర్తులు జస్టిస్ ఎస్.రవీంద్ర భట్, జస్టిస్ బేల ఎం. త్రివేది కూడా ఉన్నారు.
దాడికి సూత్రధారిగా తేలిన ఆరిఫ్‌కు 2005లో ఢిల్లీ ట్రయల్ కోర్టు మరణశిక్ష విధించింది. ఆరిఫ్‌కు ఉరిశిక్షను ఢిల్లీ హైకోర్టు 2007లో నిర్ధారించింది. తర్వాత 2011లో అత్యున్నత న్యాయస్థానం సమర్థించింది.
జనవరి 2014 నాటికి అతని రివ్యూ, క్యూరేటివ్ పిటిషన్లు కూడా కొట్టివేసింది. కానీ 2014 సెప్టెంబర్‌లో రాజ్యాంగ బెంచ్ ఇచ్చిన ఓ తీర్పు నేపథ్యంలో ఆరిఫ్‌కు మరణ శిక్షపై పోరాడేందుకు మరో అవకాశం ఇవ్వాలని నిర్ణయించింది. న్యాయమూర్తుల ఛాంబర్లలో కాకుండా ఓపెన్ కోర్టులో రివ్యూ పిటిషన్‌పై విచారణ జరపాలన్న ఆ తీర్పు చెప్పింది.
భారతదేశంలోని అత్యంత ప్రసిద్ధ కట్టడాల్లో ఒకటైన 17వ శతాబ్దపు ఎర్ర కోటపై డిసెంబర్ 2000లో జరిగిన దాడిలో ముగ్గురు వ్యక్తులు మరణించారు. ఘటన జరిగిన నాలుగు రోజుల తర్వాత ఆరిఫ్‌తో పాటు అతని భార్య రెహ్మానా యూసుఫ్ ఫరూఖీని అరెస్ట్ చేశారు. హత్య, నేరపూరిత కుట్ర, భారతదేశానికి వ్యతిరేకంగా యుద్ధం చేయడం వంటి అభియోగాల కింద ట్రయల్ కోర్టు అతనితో పాటు మరో ఆరుగురిని అక్టోబర్ 2005లో దోషులుగా నిర్ధారించింది. అతనికి మరణశిక్ష విధించింది. మిగిలిన వారికి వివిధ కాలపరిమితులతో జైలు శిక్షలు విధించింది.
2007 సెప్టెంబరులో హైకోర్టు అతని నేరాన్ని ధృవీకరించింది. అయితే సాక్ష్యాధారాలు లేనందున ఇతర సహ నిందితులందరినీ విడుదల చేయాలని ఆదేశించింది.
ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం 22 డిసెంబర్ 2000 రాత్రి ఇద్దరు మిలిటెంట్లు ఎర్రకోటలోకి ప్రవేశించారు. అప్పుడు అది సైనిక స్థావరంగా ఉంది. ముష్కరులు ఆ సైనిక సరఫరా డిపోపై దాడి చేశారు. ఇద్దరు సైనికులు, ఒక గార్డును చంపి, తప్పించుకున్నారు.
ఈ దాడికి తామే బాధ్యులమని పాకిస్థాన్‌కు చెందిన ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా ప్రకటించింది. ఇది భారత్, పాకిస్తాన్ మధ్య సంబంధాలను దెబ్బతీసింది.