Juneteenth day : బానిసత్వ సంకెళ్లకు విముక్తి.. అమెరికాలో 'జూనిటీన్త్' చరిత్ర ఇది..
Juneteenth day : అమెరికాలో ఈ నెల 19ని జూనిటీన్త్ అని పిలుస్తారు. ఇదొక ఫెడరల్ హాలిడే. దీని వెనుక ఓ పెద్ద కథ ఉంది. అసలేంటి ఈ జూనిటీన్త్? దీని ప్రాముఖ్యత ఏంటి? ఇక్కడ తెలుసుకుందాము..
Juneteenth day significance : జూన్ 19ని అమెరికావ్యాప్తంగా 'జూనిటీన్త్' అని పిలుస్తుంటారు. జూన్- 19 నెంబర్‌ను కలిపి.. జూనిటీన్త్ అని పిలుస్తారు. శతాబ్దాల క్రితం.. అమెరికాలో బానిసలకు విముక్తి కలిగిన రోజు ఇది! ఇదొక ఫెడరల్ హాలీడే. ఇది.. అమెరికాకు రెండో స్వాతంత్ర్య దినోత్సవం అని, ఆఫ్రికన్ అమెరికన్లకు సాతంత్ర్య దినోత్సవమని పిలుస్తుంటారు. ఈ జూనిటీన్త్ వెనుక ఓ పెద్ద కథ ఉంది. అదేంటంటే..
లింకెన్ ఆదేశాలు చేరేందుకు రెండేళ్లు..!
అవి అమెరికాలో అంతర్యుద్ధం జరుగుతున్న రోజులు. అమెరికా రెండుగా విడిపోయింది! ఒకటి తిరుగుబాటుదారులతో కూడిన కాన్ఫెడరేట్ స్టేట్స్, రెండు అధ్యక్షుడు అబ్రహం లింకెన్ ఉన్న యూనియన్. తిరుగుబాటుదారులు.. యూనియన్‌లో చేరితే కాన్ఫెడరేట్లోని దక్షిణాది రాష్ట్రాల్లో జీవిస్తున్న బానిసలకు విముక్తి కలిగిస్తామని.. 1862 సెప్టెంబర్ 22న లింకెన్ ప్రకటించారు. 1863, జనవరి 1న ఇది అమల్లోకి వస్తుందని స్పష్టం చేశారు. లింకెన్ చెప్పినట్టు.. చాలా రాష్ట్రాల్లో ఆ రోజున ఆయన ఆదేశాలు అమల్లోకి వచ్చాయి. ఫలితంగా 30లక్షలకుపైగా మందికి బానిసత్వం చెర నుంచి విముక్తి లభించింది. వీరిలో చాలా మంది ఆఫ్రికన్ అమెరికన్లే ఉన్నారు.
కానీ కొన్ని కాన్ఫెడరేట్ స్టేట్స్లో బానిసత్వం కొనసాగింది. వీటిల్లో టెక్సాస్ కూడా ఉంది. కాగా.. బానిసత్వాన్ని అంతమొందించేందుకు యూనియన్ ట్రూప్స్ చాలా కష్టపడ్డాయి. ఒక్కో రాష్ట్రంలోకి వెళ్లి లింకెన్ ఆదేశాలను అమలు చేశాయి. టెక్సాస్ రాష్ట్రం.. అమెరికాలో మారుమూల ప్రాంతంగా ఉండటంతో అక్కడ యూనియన్‌కు చెందిన దళాల ప్రభావం తక్కువగా ఉండేది.
Juneteenth day meaning : ఇలా రెండేళ్లు గడిచింది. చివరికి.. జూన్ 19 1865లో యూనియన్ దళాలు టెక్సాస్‌లోకి అడుగుపెట్టాయి. ఆఫ్రికన్ అమెరికన్లకు రెండేళ్ల క్రితమే బానిసత్వం నుంచి విముక్త లభించిందని ప్రకటించారు.
"అమెరికాలోని బానిసలకు విముక్తి లభించిందని టెక్సాస్ ప్రజలకు చెబుతున్నాము. అంటే.. ఇక నుంచి మాస్టర్లు, బానిసలకు సమానమైన హక్కులు ఉంటాయి. ఎవరు మాస్టర్లు కాదు.. ఎవరు బానిసలు కారు. మాస్టర్లు, బానిసల స్థానంలో ఎంప్లాయర్లు, లేబర్- వర్కర్లు అని పిలవాలి," అని ఐల్యాండ్ ఆఫ్ గాల్వెస్టన్లోని ప్రజలకు చదివి వినిపించారు యూనియన్ మేజర్ జనరల్ గార్డన్ గ్రెంజర్. అలా టెక్సాస్‌లోని బానిసలకు విముక్తి లభించింది.
ఆనందం.. సంతోషం..
What is Juneteenth day : ఇది తెలుసుకున్న ప్రజలు సంబరాలు చేసుకున్నారు. ప్రార్థనలు చేస్తూ, పాటలు పాడుకుంటూ, విందు భోజనాలు ఆరగిస్తూ ఆ రోజును గడిపారు. ఆ మరుసటి ఏడాదిన వచ్చిన జూన్ 19ని జూనిటెన్త్గా పిలిచారు. అప్పటి నుంచి ఆరోజున టెక్సాస్ వ్యాప్తంగా వేడుకలు జరుగుతున్నాయి. కొన్ని సంవత్సరాల తర్వాత.. అమెరికాలోని ఇతర రాష్ట్రాల ప్రజలు కూడా జూనిటీన్త్ని వేడుకగా జరుపుకోవడం మొదలుపెట్టారు.
జూనిటీన్త్ను 1980లో అధికారికంగా గుర్తించింది టెక్సాస్. 2002 నాటికి 8 రాష్ట్రలు జూనిటీన్త్ను అధికారికంగా గుర్తించారు. 2008 నాటికి సగానికిపైగా అమెరికా దేశాలు ఈ చర్యలు చేపట్టాయి. 2019 నాటికి 47 రాష్ట్రాలతో పాటు డిస్ట్రిక్ట్ ఆఫ్ కొలంబియా సైతం.. జూనిటీన్త్ని అధికారికంగా గుర్తించింది.
సంబంధిత కథనం