US Visa news: అమెరికా వీసా సిస్టమ్ లో కీలక మార్పులు; ఎఫ్ 4 స్పాన్సర్ షిప్ వీసా తేదీల్లో చేంజ్
US Visa news: అమెరికా బ్యూరో ఆఫ్ కాన్సులర్ అఫైర్స్ తన నవంబర్ 2024 వీసా బులెటిన్‌ను గురువారం విడుదల చేసింది. ఇందులోఅమెరికన్ పౌరసత్వం కలిగినవారు తమ భారతీయ కుటుంబ సభ్యులు అమెరికాలో స్థిరపడేందుకు స్పాన్సర్ చేసేందుకు వీలు కల్పించే వీసా నిబంధనల్లో కీలక మార్పులు చేశారు.
US Visa news: అమెరికా హోం శాఖ బ్యూరో ఆఫ్ కాన్సులర్ అఫైర్స్ తన నవంబర్ 2024 వీసా బులెటిన్‌ను గురువారం విడుదల చేసింది. గ్రీన్ కార్డ్ దరఖాస్తుదారుల కోసం, ముఖ్యంగా భారతీయ పౌరుల కోసం కుటుంబ ప్రాయోజిత వీసా కేటగిరీలలో గణనీయమైన మార్పులను ఈ బులెటిన్ లో పొందుపర్చారు. అన్ని ఉపాధి ఆధారిత వీసా కేటగిరీలు మునుపటి నెలతో పోలిస్తే స్థిరంగా ఉన్నప్పటికీ, భారతీయ దరఖాస్తుదారులకు సంబంధించిన F4 వీసా కేటగిరీలో గణనీయమైన అప్‌డేట్‌లు చేయబడ్డాయి.
ఇండియన్ అప్లికంట్స్ కు మారిన నిబంధనలు
తాజా బులెటిన్ ప్రకారం.., అమెరికా పౌరులు తమ తోబుట్టువులను స్పాన్సర్ చేయడానికి అనుమతించే F4 వీసా కేటగిరీకి సంబంధించి భారతదేశం యొక్క ఫైనల్ యాక్షన్ కటాఫ్ తేదీ, మార్చి 8, 2006కి మార్చారు. ఇది గతంలో ప్రకటించిన తేదీ కన్నా ఒక వారం ముందు. అదనంగా, 'డేట్స్ ఫర్ ఫైలింగ్' విభాగంలో, ‘F4 ఫర్ ఇండియా’ తేదీలను ఆగస్ట్ 1, 2006కు మార్చారు. F4 వీసా US పౌరుల తోబుట్టువులు, వారి జీవిత భాగస్వాములు, మైనర్ పిల్లలు యునైటెడ్ స్టేట్స్‌కు వచ్చే వీలు కల్పించే స్పాన్సర్‌షిప్‌ను సులభతరం చేస్తుంది.
వీసా బులెటిన్ పూర్తి వివరాలు..
యుఎస్ వీసా (us visa) బులెటిన్ అనేది వివిధ గ్రీన్ కార్డ్ వర్గాలకు వీసాల లభ్యతను సూచించే నెలవారీ ప్రచురణ. పెండింగ్‌లో ఉన్న దరఖాస్తుల పరిమాణం ఆధారంగా దరఖాస్తుదారులు తమ ఇమ్మిగ్రేషన్ ప్రయాణంలో ఎప్పుడు పురోగతి సాధించవచ్చనే దానిపై ఇది మార్గనిర్దేశం చేస్తుంది. ప్రతి నెల, డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్టేట్ వీసా లభ్యతను అంచనా వేస్తుంది. వివిధ కేటగిరీలలోని దరఖాస్తుల సంఖ్యకు అనుగుణంగా సర్దుబాట్లు చేస్తుంది.
కుటుంబ ప్రాయోజిత వీసా కేటగిరీ అప్‌డేట్‌లు
నవంబర్ 2024 వీసా బులెటిన్‌లో ఇండియా, మెక్సికో, ఫిలిప్పీన్స్ సహా వివిధ దేశాలకు కుటుంబ ప్రాయోజిత వీసా వర్గాల్లో అనేక మార్పులు చేశారు. కుటుంబ వర్గాలలో భారతీయ దరఖాస్తుదారుల కోసం నిర్దేశించిన మార్పులు క్రింది విధంగా ఉన్నాయి.
- F4 కేటగిరీ: ఫైనల్ యాక్షన్ కటాఫ్ తేదీ మార్చి 8, 2006 (వారం రోజులు ముందుకు) గా, ఫైలింగ్ తేదీని ఆగష్టు 1, 2006 (1.5 నెలలు ముందుకు) గా నిర్ణయించారు.
- F1 కేటగిరీ: (US పౌరుల పెళ్లికాని కుమారులు, కుమార్తెలు): భారత్ సహా పలు ఇతర దేశాలకు సంబంధించి ఎలాంటి మార్పు లేదు. మెక్సికో వారికి మాత్రం నవంబర్ 22, 2004 నాటికి 1 సంవత్సరం, 10 నెలలు ముందుకు జరిపారు.
- F2A కేటగిరీ: ( అమెరికా (usa) శాశ్వత నివాసితుల జీవిత భాగస్వాములు, పిల్లలు): మెక్సికో మినహా భారత్ సహా వేరే దేశాలకు సంబంధించి ఎలాంటి మార్పులు చేయలేదు.
- F3 కేటగిరీ: (US పౌరుల వివాహిత కుమారులు, కుమార్తెలు): మెక్సికో మినహా భారత్ సహా వేరే దేశాలకు సంబంధించి ఎలాంటి మార్పులు చేయలేదు.
- ఉపాధి ఆధారిత కేటగిరీల్లో మార్పులు లేవు.
ఉపాధి ఆధారిత వీసాల్లో..
- EB-1: భారత్ కు ఫైలింగ్ తేదీ ఫిబ్రవరి 1, 2022 కాగా, చైనాకు ఫైలింగ్ తేదీ నవంబర్ 8, 2022. ఈ తేదీల్లో ఎలాంటి మార్పు లేదు.
- EB-2: చైనాకు ఫైలింగ్ తేదీ మార్చి 22, 2020 కాగా, భారత్ కు జూలై 15, 2012. ఈ తేదీల్లో ఎలాంటి మార్పు లేదు.
- EB-3: భారత్ కు సంబంధించి నిపుణులు, నైపుణ్యం కలిగిన కార్మికుల ఫైలింగ్ తేదీల్లో ఎలాంటి మార్పు లేదు. ఫైలింగ్ తేదీ నవంబర్ 1, 2012.
- EB-5: చైనా, భారతదేశం కోసం అన్‌రిజర్వ్డ్ కేటగిరీల తేదీలలో ఎలాంటి మార్పు లేదు.