Heavy rains in Delhi: ఢిల్లీలో వర్ష బీభత్సం కొనసాగుతోంది. వరుసగా రెండో రోజు శుక్రవారం కూడా నగరాన్ని వానలు ముంచెత్తాయి. మరోవైపు, శనివారం కూడా వాన ముప్పు తప్పదని వాతావరణ శాఖ ఢిల్లీ పౌరులను హెచ్చరించింది.
ఎడతెగని వర్షాలతో ఢిల్లీ నగరం తడిసి ముద్దైంది. జనజీవనం అస్తవ్యస్తమైంది. ట్రాఫిక్ కష్టాలతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. పలు చోట్ల రోడ్లపై చెట్లు కూలి ట్రాఫిక్ కష్టాలను మరింత పెంచాయి. మరోవైపు, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. నగర శివార్లు, ఇతర ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ప్రధాన రోడ్లపై కూడా మోకాలెత్తున నీరు నిలిచిన పరిస్థితి నెలకొన్నది. హనుమాన్ మందిర్ క్యారేజ్ వే, లిబాస్పూర్అండర్ పాస్, మహారాణి బాగ్, సీడీఆర్ చౌక్, మెహ్రౌలి, వసంత్ కుంజ్ ప్రాంతాల్లో రోడ్లపై పెద్ద ఎత్తున నీరు నిలిచింది. ఈ మార్గాల్లో ప్రయాణాలు చేయవద్దని పోలీసులు సూచిస్తున్నారు.
మరోవైపు, ఢిల్లీ నగర పౌరుల వాన కష్టాలు శనివారం కూడా కొనసాగనున్నాయి. నగరంలో శనివారం కూడా భారీ వర్షాలు కురిసే అవకాశమున్నదని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ మేరకు, ఎల్లో అలర్ట్ జారీ చేసింది. అత్యవసరమైతేనే ఇంటి నుంచి బయటకు రావాలని పౌరులకు పోలీసులు సూచిస్తున్నారు. కొన్ని చోట్లు పాత భవనాలు పాక్షికంగా కూలిన ఘటనలు చోటు చేసుకున్నాయి. నగరంలో సెప్టెంబర్ నెల సగటు వర్షపాతంలో సగం ఒక్క శుక్రవారం రోజే నమోదు కావడం విశేషం.