Lamborghini : ఇక్కడ విల్లా కొంటే లంబోర్గిని కారు ఫ్రీ.. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే
Luxury Villa With Lamborghini : ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి చేసిన ట్వీట్ వైరల్‌గా మారింది. లగ్జరీ విల్లా కొంటే దానితోపాటుగా లంబోర్గిని ఉచితం అని చెప్పాడు. దీంతో ఈ విషయం వైరల్‌గా మారింది.
లగ్జరీ కారు లంబోర్గిని అంటే చాలా మందికి ఇష్టం. కానీ దానిని కొనాలంటే మాత్రం తడిసిమోపెడవుతుంది. అందుకే చాలా మంది ఈ కారును ఇష్టపడుతారు. కానీ కొనేందుకు సహసం చేయరు. కానీ ఓ రియల్ ఎస్టేట్ సంస్థ మాత్రం లగ్జరీ విల్లా కొంటే లంబోర్గిని ఉచితం అని ప్రకటించింది. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. ఇది కాస్త వైరల్ అయింది.
నోయిడాలోని ప్రముఖ రియల్ ఎస్టేట్ డెవలపర్ అయిన జేపీ గ్రీన్స్ లగ్జరీ లివింగ్, పాష్ కార్లపై ఇష్టం ఉన్నవారి కోసం ఓ ఆఫర్ ప్రకటించింది. రూ.26 కోట్ల కంటే ఎక్కువ ధర కలిగిన విల్లాలను కొనుగోలు చేసేవారికి.. రూ.4 కోట్ల కంటే ఎక్కువ విలువైన లాంబోర్గినీ ఉరుస్‌ని కాంప్లిమెంటరీగా అందుకుంటారని తెలిపింది. గ్రేటర్ నోయిడాలో ఉన్న జేపీ గ్రీన్స్ 3 బీహెచ్‌కే, 4 బీహెచ్‌కే, 5 బీహెచ్‌కే, 6 బీహెచ్‌కేలతో సహా వివిధ విల్లా ఆప్షన్స్ కలిగి ఉంది. ఇక్కడ ధరలు రూ.51 లక్షల నుండి రూ.30 కోట్ల వరకు ఉంటాయి.
అయితే అందరి దృష్టిని ఆకర్షించేందుకు ఈ కంపెనీకి చెందిన గౌరవ్ గుప్తా సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేశారు. 'నోయిడాలో 26 కోట్లతో కొత్త విల్లా ప్రాజెక్ట్ వస్తోంది, అది కొన్నవారికి లంబోర్గిని అందిస్తోంది!.' అని ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
విల్లా ధర రూ.26 కోట్లు ఆశ్చర్యకరంగా అనిపించవచ్చు. కానీ అది బేస్ విల్లాకు మాత్రమే లెక్క అని మీరు తెలుసుకోవాలి. ఎందుకంటే అనేక అదనపు ఖర్చులు కూడా ఉంటాయి. ఈ అదనపు ఛార్జీలు ఏంటంటే.. నిర్ణీత పార్కింగ్ కోసం రూ. 30 లక్షలు, పవర్ బ్యాకప్ కోసం రూ. 7.5 లక్షలు, క్లబ్ సభ్యత్వం కోసం మరో రూ.7.5 లక్షలుగా నిర్ణయించారు.
మంచి గోల్ఫ్ కోర్స్ వీక్షణతో విల్లాను కోరుకునే కొనుగోలుదారులు అదనంగా రూ.50 లక్షలను చెల్లించాల్సి ఉంటుంది . ఈ ఎక్స్‌ట్రా ఖర్చులు ఎంచుకున్న సౌకర్యాలపై ఆధారపడి ఉంటాయి. మొత్తం ధర రూ.26.95 కోట్ల నుండి రూ. 27.45 కోట్ల వరకు అవుతాయి.
ఈ ఆఫర్ సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. కొంతమంది వినియోగదారులు విలాసవంతమైన విల్లా, సూపర్‌కార్ రెండింటినీ సొంతం చేసుకునే అవకాశంపై ఆసక్తి చూపిస్తున్నారు. మరికొందరు ఈ ఆఫర్ నిజంగా గేమ్ ఛేంజర్ లేదా కేవలం ఒక జిమ్మిక్ అని అంటున్నారు.
బిల్డర్ మార్జిన్‌లో 50 శాతం కంటే ఎక్కువ సంపాదిస్తున్నాడని కామెంట్స్ చేస్తున్నారు. ఫ్రీ మార్కెటింగ్ ఉత్తమమైనది.. వైరల్ అవ్వండి, సరైన ప్రేక్షకులను ఆకర్షించండి అంటున్నారు.
టాపిక్