LED television explodes: ఎల్‌ఈడీ టెలివిజన్ పేలి యువకుడు మృతి.. ఇద్దరికి గాయాలు-teen killed two injured as led television explodes in ghaziabad ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Led Television Explodes: ఎల్‌ఈడీ టెలివిజన్ పేలి యువకుడు మృతి.. ఇద్దరికి గాయాలు

LED television explodes: ఎల్‌ఈడీ టెలివిజన్ పేలి యువకుడు మృతి.. ఇద్దరికి గాయాలు

HT Telugu Desk HT Telugu
Oct 05, 2022 11:51 AM IST

LED television explodes: ఘజియాబాద్‌లో ఎల్‌ఈడీ టెలివిజన్ పేలడంతో యువకుడు మృతిచెందాడు. మరో ఇద్దరు గాయపడ్డారు.

<p>ఘజియాబాద్‌లో ఎల్ఈడీ టీవీ పేలి ధ్వంసమైన గోడలు</p>
ఘజియాబాద్‌లో ఎల్ఈడీ టీవీ పేలి ధ్వంసమైన గోడలు (PTI)

ఘజియాబాద్: ఘజియాబాద్‌లోని తిలా‌మోర్హ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హర్ష్ విహార్ -2 ప్రాంతంలో మంగళవారం మధ్యాహ్నం ఓ ఇంట్లో టెలివిజన్ పేలిన సంఘటనలో 16 ఏళ్ల బాలుడు మరణించగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.

మృతుడు ఒమేంద్ర కుమార్‌గా పోలీసులు గుర్తించగా, గాయపడిన మరో ఇద్దరు అతని స్నేహితుడు కరణ్ కుమార్ (16), ఓమేంద్ర తల్లి ఓంవతి (50)గా గుర్తించారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా ఒమేంద్ర మృతి చెందాడని పోలీసులు తెలిపారు.

‘ఎల్‌ఈడీ టెలివిజన్‌లో పేలుడు సంభవించి ముగ్గురు వ్యక్తులు గాయపడ్డారు. వీరిలో ఒకరు మృతి చెందగా, మరో ఇద్దరు చికిత్స పొందుతున్నారు. సంఘటన జరిగిన వెంటనే అగ్నిమాపక శాఖ అధికారులు కూడా ఇంటిని సందర్శించి దుర్ఘటన జరిగిన తీరును పరిశీలించారు.’ అని సర్కిల్ ఆఫీసర్ (సాహిబాబాద్) స్వతంత్ర కుమార్ సింగ్ తెలిపారు. పేలుడు సంభవించే ప్రమాదం ఉన్నవి, మరే ఇతర మండే వస్తువులు ఇంట్లో లేవని అగ్నిమాపక శాఖ అధికారులు తెలిపారు.

‘ఇంట్లో పేలిన పరికరం ఎల్ఈడీ టెలివిజన్ మాత్రమే. దీని ప్రభావం కారణంగా, టెలివిజన్ ఉంచిన గది మొత్తం దెబ్బతింది..’ అని చీఫ్ ఫైర్ ఆఫీసర్ సునీల్ కుమార్ సింగ్ చెప్పారు. ఓల్టేజీలో హెచ్చుతగ్గుల కారణంగానే ఈ ఘటన జరిగి ఉండవచ్చని అధికారులు అనుమానిస్తున్నారు.

ఘటన జరిగినప్పుడు ఓంవతి దేవి కూడా ఇంటి మొదటి అంతస్తులో ఇంటి పనులు చేస్తుండగా అబ్బాయిలిద్దరూ సినిమా చూస్తున్నారని ఇంట్లోని నివాసితులు తెలిపారు. టెలివిజన్ ముక్కలై బాలుడు తీవ్రంగా గాయపడ్డాడని పోలీసులు వివరించారు.

‘నేను నా భర్త, కుమార్తెతో గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉన్నాను. ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించింది. మా అత్తగారు, బావగారు మేడమీద ఉన్నారని చెబుతూనే నా భర్త ఫస్ట్ ఫ్లోర్‌కి పరిగెత్తాడు. పేలుడు వల్ల మా ఇల్లు దెబ్బతింది. గోడలు, పైకప్పు లోతైన పగుళ్లకు గురయ్యాయి’ అని మృతుడి సమీప బంధువు మోనికా తెలిపారు.

ఇరుగుపొరుగు వారు కూడా షాక్‌కు గురై ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ‘మేం వారి ఇంటి పక్కనే నివసిస్తున్నాం. భారీ పేలుడు వినిపించింది. ఎల్‌పీజీ సిలిండర్‌లో పేలుడు సంభవించిందని ఇరుగుపొరుగు వారందరూ తొలుత భావించారు. అందుకని అందరం సిలిండర్ల రెగ్యులేటర్లు ఆఫ్ చేసి వాళ్ళ ఇంటికి పరుగెత్తాం. లోపల దుమ్ము దట్టంగా కప్పబడి ఉంది. మోనికా ఏడుస్తోంది. గాయపడిన ముగ్గురిని ఆసుపత్రికి తరలించారు..’ అని పొరుగింటి వినీతా దేవి చెప్పారు.

Whats_app_banner