Tata Motors Hyundai sales rise: టాటా మోటార్, హ్యుందాయ్ మోటార్ సేల్స్‌లో పెరుగుదల
Tata Motors Hyundai sales rise: టాటా మోటార్స్, హ్యుందాయ్ కార్ల అమ్మకాల్లో వృద్ధి నమోదైంది.
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 1: ఆగస్టులో తమ మొత్తం అమ్మకాలు 36 శాతం పెరిగి 78,843 యూనిట్లకు చేరుకున్నాయని టాటా మోటార్స్ గురువారం వెల్లడించింది. గత ఏడాది ఇదే నెలలో 57,995 యూనిట్లను విక్రయించింది.
ఆగస్టులో దీని మొత్తం దేశీయ విక్రయాలు 41 శాతం పెరిగి 76,479 యూనిట్లకు చేరుకున్నాయి. ఆగస్టు 2021లో కంపెనీ 54,190 యూనిట్లను అమ్మింది.
దేశీయ విపణిలో ప్యాసింజర్ వాహన విక్రయాలు గత నెలలో 47,166 యూనిట్లుగా ఉన్నాయి. ఆగస్టు 2021లో 28,018 యూనిట్లుగా ఉన్నాయి. ఈ విభాగంలో 68 శాతం వృద్ధి నమోదైంది.
దేశీయ విపణిలో వాణిజ్య వాహనాల విక్రయాలు గత నెలలో 29,313 యూనిట్లుగా నమోదయ్యాయి. గత ఏడాది ఇదే నెలలో 26,172 యూనిట్లు అమ్ముడయ్యాయి. ఈ విభాగంలో 12 శాతం వృద్ధి నమోదైంది.
హ్యుందాయ్ మోటార్ కార్ల అమ్మకాలు ఇలా..
హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ (హెచ్‌ఎంఐఎల్) అమ్మకాలు ఆగస్టులో 5 శాతం పెరిగి 62,210 యూనిట్లకు చేరుకున్నాయి.
గత ఏడాది ఇదే నెలలో కంపెనీ 59,068 యూనిట్లను డీలర్లకు పంపినట్లు హెచ్‌ఎంఐఎల్ తెలిపింది. ఆగస్టు 2021లో 46,866 యూనిట్ల నుంచి దేశీయ విక్రయాలు 6 శాతం పెరిగి 49,510 యూనిట్లకు చేరుకున్నాయని కంపెనీ తెలిపింది.
గత నెలలో కంపెనీ ఎగుమతులు 12,700 యూనిట్లుగా ఉన్నాయి. ఆగస్టు 2021లో 12,202 యూనిట్లు ఉండగా.. ఇప్పుడు 4 శాతం వృద్ధి నమోదైంది.
‘నిరంతరంగా మెరుగుపడుతున్న సెమీ-కండక్టర్ లభ్యత, భారతదేశంలో ఓనం, గణేష్ చతుర్థితో ప్రారంభమైన పండుగ సీజన్‌లో మా ప్రియమైన కస్టమర్‌లకు సేవలను అందించడానికి సరఫరా పెరుగుతూనే ఉంది..’ అని హెచ్ఎంఐఎల్ డైరెక్టర్ తరుణ్ గార్గ్ అన్నారు.
కొత్తగా విడుదల చేసిన ప్రీమియం ఎస్‌యూవీ టక్సన్ కూడా బలమైన బుకింగ్స్ కనబరిచిందని, అద్భుతమైన కస్టమర్ స్పందనను పొందిందని ఆయన తెలిపారు.