Vehicle sales in July: మహీంద్రా జోరు.. హ్యుందాయ్ హుషారు..
Vehicle sales: జూలై 2022లో మహీంద్రా అండ్ మహీంద్రా, హ్యుందాయ్ మోటార్ ఇండియా సంస్థలు వాహనాల అమ్మకాల్లో మంచి వృద్ధిని కనబరిచాయి.
న్యూఢిల్లీ: ఈ ఏడాది జూలైలో దేశీయ ప్యాసింజర్ వాహనాల అమ్మకాలు 33 శాతం పెరిగి 28,053 యూనిట్లకు చేరుకున్నాయని మహీంద్రా అండ్ మహీంద్రా లిమిటెడ్ సోమవారం నివేదించింది.
గత ఏడాది ఇదే నెలలో కంపెనీ 21,046 యూనిట్లను విక్రయించినట్లు మహీంద్రా అండ్ మహీంద్రా (M&M) సెబీకి తెలిపింది.
ఈ నెలలో దేశీయ యుటిలిటీ వాహనాల విక్రయాలు 27,854 యూనిట్లుగా ఉన్నాయి. గత ఏడాదితో పోలిస్తే 20,797 యూనిట్ల నుంచి 34 శాతం వృద్ధిని సాధించింది.
XUV700, థార్, బొలెరో, XUV300తో సహా తమ బ్రాండ్‌లకు బలమైన డిమాండ్ కనిపించిందని M&M ప్రెసిడెంట్(ఆటోమోటివ్ డివిజన్) వీజయ్ నక్రా తెలిపారు.
‘సప్లై చైన్ పరిస్థితి డైనమిక్‌గా కొనసాగుతోంది. మేం పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నాం’ అని ఆయన చెప్పారు.
వాణిజ్య వాహనాల విక్రయాలు గత నెలలో 17,666 యూనిట్ల నుంచి 18.56 శాతం వృద్ధితో 20,946 యూనిట్లుగా నమోదయ్యాయని M&M తెలిపింది.
అయితే మొత్తం ట్రాక్టర్ విక్రయాలు జూలై 2021లో 27,229 యూనిట్లతో పోలిస్తే, గత నెలలో 14 శాతం తగ్గి 23,307 యూనిట్లుగా నమోదయ్యాయి.
దేశీయ ట్రాక్టర్ల విక్రయాలు 16 శాతం క్షీణించి 21,684 యూనిట్ల నుంచి 25,769 యూనిట్లుగా ఉన్నాయి. ఎగుమతులు 1,460 యూనిట్లతో పోలిస్తే 1,623 యూనిట్లకు పెరిగి 11 శాతం వృద్ధి నమోదైంది.
రుతుపవనాలు కొనసాగుతున్నప్పటికీ, దేశంలో కీలకమైన వరి ఉత్పత్తి మార్కెట్లు ఉన్న తూర్పు ప్రాంతంలోని కొన్ని రాష్ట్రాలు ఇప్పటి వరకు లోటు వర్షపాతాన్ని ఎదుర్కొంటున్నాయి. అక్కడ వర్షపాతం పుంజుకోవడం చాలా కీలకమని ఆయన అన్నారు.
హ్యుందాయ్ మోటార్ సేల్స్ 6 శాతం అప్
జూలైలో హ్యుందాయ్ మోటార్ ఇండియా విక్రయాలు 6% పెరిగి 63,851 యూనిట్లకు చేరుకున్నాయి.
గతేడాది ఇదే నెలలో కంపెనీ 60,249 యూనిట్లను విక్రయించింది. దేశీయ విక్రయాలు జూలై 2021లో 48,042 యూనిట్ల నుండి ఈ జూలైలో 50,500 యూనిట్లుగా నమోదయ్యాయి. ఇది 5.1 శాతం వృద్ధిని కలిగి ఉందని హెచ్ఎంఐఎల్ ఒక ప్రకటనలో తెలిపింది.
ఎగుమతులు 9.4 శాతం వృద్ధి చెంది 13,351 యూనిట్ల నుంచి 12,207 యూనిట్లుగా ఉన్నాయి.
‘సెమీకండక్టర్ లభ్యత పరిస్థితి మెరుగుపడటంతో ప్యాసింజర్ వెహికల్ సెగ్మెంట్‌లో డిమాండ్ ఊపందుకుంది..’ అని హెచ్ఎంఐఎల్ డైరెక్టర్ (సేల్స్, మార్కెటింగ్, సర్వీస్) తరుణ్ గార్గ్ చెప్పారు.
కంపెనీ కొత్తగా ప్రారంభించిన ఎస్‌యూవీ టక్సన్ కూడా వినియోగదారుల నుంచి మంచి స్పందనను రాబట్టిందని చెప్పారు.
50 శాతం పెరిగిన టయోటా సేల్స్
టయోటా కిర్లోస్కర్ మోటార్ (TKM) సోమవారం జులైలో 19,693 యూనిట్ల వెహికిల్స్ సేల్ చేసింది.
కంపెనీ టోకు విక్రయాలు జూలై 2021లో విక్రయించిన 13,105 యూనిట్ల కంటే 50 శాతం ఎక్కువ.
‘జూలై నెల కంపెనీకి అసాధారణమైనది. అమ్మకాల పరంగా అలాగే భారతదేశంలో మాస్ ఎలక్ట్రిఫికేషన్ వైపు మా ప్రయత్నం కొనసాగుతోంది. బీ ఎస్‌యూవీ విభాగంలో భారీగా అమ్మకాలు నమోదయ్యాయి. అలాగే బలమైన హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వాహనం అర్బన్ క్రూయిజర్ హైరైడర్ ఆవిష్కరించాం..’ అని TKM అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ (సేల్స్, స్ట్రాటజిక్ మార్కెటింగ్) అతుల్ సూద్ ఒక ప్రకటనలో తెలిపారు.
జూలైలో కంపెనీ అత్యధికంగా ఇన్నోవా క్రిస్టా, ఫార్చ్యూనర్ తదితర మోడల్ కార్లను విక్రయించింది.
టాపిక్