Prajwal Revanna : సెక్స్​ కుంభకోణం నిందితుడు ప్రజ్వల్​ రేవన్న అరెస్ట్​.. నెక్ట్స్​ ఏంటి?-suspended jds leader prajwal revanna arrested in bengaluru in sex scandal case ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Prajwal Revanna : సెక్స్​ కుంభకోణం నిందితుడు ప్రజ్వల్​ రేవన్న అరెస్ట్​.. నెక్ట్స్​ ఏంటి?

Prajwal Revanna : సెక్స్​ కుంభకోణం నిందితుడు ప్రజ్వల్​ రేవన్న అరెస్ట్​.. నెక్ట్స్​ ఏంటి?

Sharath Chitturi HT Telugu
May 31, 2024 05:43 AM IST

Prajwal Revanna arrested : సెక్స్​ కుంభకోణం నిందితుడు ప్రజ్వల్​ రేవన్న దేశానికి తిరిగొచ్చారు. ఆ వెంటనే.. బెంగళూరు విమానాశ్రయంలో సిట్​ బృందం ఆయన్ని అరెస్ట్​ చేసింది.

ప్రజ్వల్​ రేవన్న అరెస్ట్​,,
ప్రజ్వల్​ రేవన్న అరెస్ట్​,,

Prajwal Revanna arrested : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కర్ణాటక హసన్​ సెక్స్​ కుంభకోసం కేసు నిందితుడు, జేడీఎస్​ సస్పెండెడ్​ నేత ప్రజ్వల్​ రేవన్నను బెంగళూరు పోలీసులు అరెస్ట్​ చేశారు. సెక్స్​ కుంభకోణం బయటకు వచ్చిన వెంటనే జర్మనీ వెళ్లిపోయిన ఆయన.. గురువారం అర్థరాత్రి బెంగళూరుకు తిరిగివచ్చిన వెంటనే, కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో సిట్​ బృందం ఆయన్ని కస్టడీలోకి తీసుకుంది.

గతంలో రెండుసార్లు ఫ్లైట్​ టికెట్లను రద్దు చేసుకున్న ప్రజ్వల్​ రేవన్న.. చివరికి గురువారం అర్థరాత్రి లుఫ్తాన్సా ఫ్లైట్​ ఎల్​హెచ్​0764లో జర్మనీ నుంచి ఇండియాకు తిరిగొచ్చారు.

ప్రజ్వల్​ రేవన్న దాఖలు చేసిన ముందస్తు బెయిల్​ పిటిషన్​ని.. బెంగళూరులోని ఓ స్పెషల్​ కోర్టు గురువారం రద్దు చేసింది. ఫలితంగా.. ఆయన అరెస్ట్​ నుంచి తప్పించుకోలేకపోయారు.

ప్రజ్వల్​ రేవన్న సెక్స్​ కుంభకోణం..

Prajwal Revanna sex scandal : హసన్​ ఎంపీ ప్రజ్వల్​ రేవన్న.. మాజీ ప్రధానమంత్రి హెచ్​డీ దేవెగౌడ మనవడు. జేడీఎస్​ ప్రముఖ రాజకీయ నేత హెచ్​డీ రేవన్న కుమారుడు. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్​డీ కుమారస్వామికి బంధువు.

2019లో హసన్​ సీటు గెలిచిన ప్రజ్వల్​.. 2024 లోక్​సభ ఎన్నికల్లోనూ బీజేపీ- జేడీఎస్​ పొత్తులో భాగంగా అక్కడి నుంచే పోటీ చేశారు.

కాగా.. ఎందరో మహిళలను లైంగికంగా వేధించినట్టు ప్రజ్వల్​ రేవన్నపై ఆరోపణలు ఉన్నాయి. 2024 లోక్​సభ ఎన్నికల్లో హసన్​ నియోజకవర్గానికి ఏప్రిల్​ చివర్లో పోలింగ్​ జరగ్గా.. అందుకు ఒక రోజు ముందు.. ప్రజ్వల్​ రేవన్న సెక్స్​ కుంభకోణానికి సంబంధించిన వీడియోలతో కూడిన అనేక పెన్​డ్రైవ్​లు హసన్​లో కలకలం సృష్టించాయి. పోలింగ్​ జరిగిన వెంటనే.. డిప్లొమాటిక్​ పస్​పోర్ట్​ మీద ఇండియాను విడిచిపెట్టి వెళ్లిపోయారు ప్రజ్వల్​ రేవన్న. ఈ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అనంతరం ప్రజ్వల్​ రేవన్న సెక్స్​ కుంభకోణం కేసు.. అనేక మలుపులు తిరిగింది.

Prajwal Revanna videos : ఇక తాను ఇండియాకు వస్తానని, మే 31న సిట్​ బృందం దర్యాప్తులో పాల్గొంటానని, అధికారులకు అన్ని విధాలుగా సహకారం అందిస్తానని కొన్ని రోజుల క్రితం ట్వీట్​ చేశారు ప్రజ్వల్​. చివరికి.. బెంగళూరు విమానాశ్రయంలో ప్రజ్వల్​ రేవన్నని పోలీసులు అరెస్ట్​ చేశారు.

మరి నెక్ట్స్​ ఏంటి..?

గురువారం అర్థరాత్రి.. ప్రజ్వల్​ రేవన్నను విమానాశ్రయం సిబ్బంది.. పోలీసులకు అప్పగించినట్టు తెలుస్తోంది. అక్కడి నుంచి ప్రజ్వల్​ రేవన్నని సీఐడీ (క్రైమ్​ ఇన్​వెస్టిగేషన్​ డిపార్ట్​మెంట్​) ఆఫీస్​కు తీసుకెళ్లినట్టు సమాచారం. ఆయన రాత్రంతా సిట్​ బృందం కస్టడీలో ఉన్నట్టు తెలుస్తోంది.

Prajwal Revanna flight number : ఇంకొన్ని గంటల్లో ప్రజ్వల్​ రేవన్నకు వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. కాగా.. అరెస్ట్​ చేసిన 24 గంటల్లో ఆయన్ని మెజిస్ట్రేట్​ ముందు హాజరుపరచాల్సి ఉంటుంది.

ప్రజ్వల్​ దాఖలు చేసిన ముందుస్తు బెయిల్​ పిటిషన్​ ఇప్పటికే రద్దు అయ్యింది. కానీ.. రెగ్యులర్​ బెయిల్​ పిటిషన్​పై శుక్రవారం విచారణ జరగనుంది. అంతేకాదు.. ప్రజ్వల్​ రేవన్న తల్లి భవానీ రేవన్న దాఖలు చేసిన ముందస్తు బెయిల్​ పిటిషన్​ తీర్పు కూడా నేడు వెలువడనుంది.

టీ20 వరల్డ్ కప్ 2024

సంబంధిత కథనం