Students shoot at teacher: టీచర్ పైననే కాల్పులు జరిపిన ఇద్దరు విద్యార్థులు; సెల్ఫీ వీడియోలో గొప్పలు
Students shoot at teacher: విద్య నేర్పిన గురువుపైననే ఇద్దరు విద్యార్థులు కాల్పులు జరిపిన ఘటన ఉత్తర ప్రదేశ్ లోని ఆగ్రాలో జరిగింది. కాల్పులు జరిపిన అనంతరం తాము చేసిన పనిని గొప్పగా చెప్పుకుంటూ సెల్ఫీ వీడియో కూడా తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
Students shoot at teacher: ఇద్దరు మైనర్ విద్యార్థులు తమ టీచర్ పైననే కాల్పులు జరిపారు. టీచర్ కాలిపై ఒక రౌండ్ కాల్పులు జరిపి వెళ్లిపోయారు. అనంతరం, సెల్ఫీ వీడియో తీసుకుని, అందులో, ఇంకా తమ పగ చల్లారలేదని, ఆరు నెలల్లో మొత్తం 40 బుల్లెట్లను టీచర్ శరీరంలో దింపుతామని హెచ్చరించారు.
ఆగ్రాలో..
ఆగ్రాలో సుమీత్ సింగ్ అనే టీచర్ ఒక కోచింగ్ సెంటర్ నిర్వహిస్తున్నాడు. అతడి తమ్ముడి పేరు తరుణ్. కాల్పులకు తెగబడిన ఆ ఇద్దరు విద్యార్థుల వయస్సు ఒకరికి 16 ఏళ్లు, మరొకరికి 18 ఏళ్లు. ఈ ఇద్దరు కూడా ఇంతకుముందు సుమీత్ సింగ్ దగ్గర చదువు నేర్చుకున్నారు. కాగా, వారం క్రితం ఆ ఇద్దరు విద్యార్థుల్లో ఒకరు.. తమ కోచింగ్ సెంటర్ లో చదువుకునే ఒక అమ్మాయిని వేధిస్తుండగా, చూసిన సుమీత్ సింగ్ తమ్ముడు తరుణ్.. ఆ విద్యార్థులను అలా అమ్మాయిని వేధించవద్దని హెచ్చరించాడు.
నేరుగా కోచింగ్ సెంటర్ కే వచ్చి..
దాంతో, గురువారం ఆ ఇద్దరు విద్యార్థులు తుపాకీతో సుమీత్ సింగ్ కోచింగ్ సెంటర్ కు వచ్చారు. ఫోన్ చేసి, తరుణ్, సుమీత్ సింగ్ లను బయటకు రమ్మని పిలిచారు. బయటకు వచ్చిన సుమీత్ సింగ్ కాలిపై కాల్పులు జరిపారు. స్థానికులు రావడంతో అక్కడి నుంచి వెళ్లిపోయారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరి బాధితుడు సుమీత్ ను ఆసుపత్రికి తరలించారు. అనంతరం, కేసు నమోదు చేసి ఆ ఇద్దరు విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు. టీచర్ పై కాల్పులు జరిపిన అనంతరం అక్కడే ఆ విద్యార్థులు తము చేసిన పనిని గొప్పగా చెప్పుకుంటూ సెల్ఫీ వీడియో తీసుకుని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. బాలీవుడ్ సినిమా ‘గ్యాంగ్స్ ఆఫ్ వసేపూర్’ తరహా క్రమినల్స్ మేము అని చెప్పుకున్నారు. ప్రస్తుతం ఆ ఇద్దరు పోలీసుల అదుపులో ఉన్నారు.