No kids: వీరికి పిల్లలే కాదు.. పెళ్లీ వద్దంటా.. కారణం తెలిస్తే షాక్ అవుతారు..
పిల్లలు కావాలని చాలా మంది మొక్కని దేవుడుండడు. ఎక్కని మెట్లుండవు. కానీ వీళ్లేమో అసలు పిల్లలే వద్దంటున్నారు. ఇంకొందరు అసలు పెళ్లి కూడా వద్దంటున్నారు.
యూ యంగ్ యి అమ్మమ్మ ఆరుగురు పిల్లలకు జన్మనిచ్చింది. అమ్మ ఇద్దరికి జన్మనిచ్చింది. కానీ తను అసలు పిల్లలే వద్దనుకుంది.
‘నా భర్తకు, నాకు పిల్లలంటే చాలా ఇష్టం.. అయితే పిల్లలను పెంచాలంటే మేం చాలా త్యాగాలు చేయాల్సి వస్తుంది..’ అని యూ చెప్పారు. ఆమె సియోల్ ఫైనాన్షియల్ కంపెనీ ఉద్యోగి. ‘అది రెండింటిలో ఏది ఎంచుకోవాలన్న అంశానికి సంబంధించింది. మేం మాపై ఎక్కువగా ఫోకస్ చేసుకునేందుకు ఈ ఒప్పందానికి వచ్చాం..’ అని చెప్పారు.
సౌత్ కొరియాలో యూ తరహాలో చాలా మంది పిల్లలను వద్దనుకున్నారు. కొందరైతే అసలు పెళ్లే వద్దనుకున్నారు. ఇతర దేశాలు కూడా ఈ తరహా ట్రెండ్ ఫాలో అవుతున్నప్పటికీ.. సౌత్ కొరియాలో మాత్రం ఇది సమస్య అయి కూర్చుంది. దేశంలో జనాభా క్రమంగా తగ్గుముఖం పడుతోంది.
సౌత్ కొరియా గణాంకాల విభాగం సెప్టెంబరు మాసంలో దేశపు టోటల్ ఫర్టిలిటీ రేట్ ప్రకటించింది. పునరుత్పత్తి సామర్థ్యం ఉండే వయస్సులో మహిళలు కనే సంతానం సంఖ్యను ఈ టోటల్ ఫర్టిలిటీ రేట్ (టీఎఫ్ఆర్) సూచిస్తుంది. సౌత్ కొరియాలో గత ఏడాది కేవలం 0.81గా ఉన్నట్టు ప్రకటించింది. ప్రపంచంలోనే అతి తక్కువ టీఎఫ్‌ఆర్ కలిగి ఉన్న దేశంగా వరుసగా మూడో ఏడాది సౌత్ కొరియా నిలిచింది.
తొలిసారిగా దేశ జనాభా 2021లో తగ్గిపోయింది. తగ్గుతున్న జనాభా దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తుందని దేశం ఆందోళన చెందింది. సౌత్ కొరియా ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలోనే పదో అతి పెద్దది. ఇక్కడ లేబర్ కొరత, పన్ను చెల్లింపుదారుల సంఖ్య తగ్గడం, వృద్ధుల సంక్షేమంపై ఎక్కువ వ్యయం చేయాల్సి రావడం వంటి అంశాలు సౌత్ కొరియాను కలవర పెడుతున్నాయి.
సమస్యను మెరుగ్గా పరిష్కరించేందుకు వీలుగా ప్రభావవంతమైన చర్యలను కనిపెట్టాలని అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ యంత్రాంగాన్ని ఆదేశించారు. జనాభా తగ్గుదలను నివారించడానికి, ఫర్టిలిటీ రేట్ పెంచడానికి 210 బిలియన్ డాలర్లు ఖర్చు చేస్తున్నా ఇంకా సత్ఫలితాలు దక్కలేదు.
సౌత్ కొరియన్ యువత చెబుతున్నదేంటంటే తమ పేరెంట్స్, గ్రాండ్ పేరెంట్స్ కుటుంబాన్ని కలిగి ఉండడం ఒక బాధ్యతలా భావించారని, కానీ తాము అలా కాదని అంటున్నారు. జాబ్ మార్కెట్‌లో అనిశ్చితి, ఇల్లు కొనుగోలుకు అధిక వ్యయం, సామాజిక, లింగ అసమానతలను వారు వేలెత్తి చూపుతున్నారు. క్రూరమైన పోటీ నెలకొన్న ఈ సమాజంలో పిల్లలను పెంచడానికి అవుతున్న భారీ ఖర్చును వారు ప్రశ్నిస్తున్నారు. పనిలో వివక్ష ఒకవైపు, పిల్లల సంరక్షణలో మెజారిటీ బాధ్యతలు తమకే ఉండాలన్న పితృస్వామ్య వ్యవస్థ గురించి మహిళలు ఫిర్యాదు చేస్తున్నారు.
‘ఒక్క ముక్కలో చెప్పాలంటే బతకడానికి ఈ దేశం ఈజీ ప్లేస్ కాదని ప్రజలు అనుకుంటున్నారు..’ అని కొరియా ఇనిస్టిట్యూట్ ఫర్ హెల్త్ అండ్ సోషల్ ఎఫైర్స్ నుంచి జనాభా పాలసీ నిపుణులు లీ సో-యంగ్ అంటున్నారు. ‘తమ కంటే తమ పిల్లల జీవితాలు మెరుగ్గా ఉండవని వారు నమ్ముతున్నారు. అందువల్ల తమకు పిల్లలు ఉండాలని ఎందుకు బాధపడాలని ప్రశ్నిస్తున్నారు..’ అని వివరించారు.
డ్రాపౌట్‌గా భావిస్తున్నారు..
‘చాలా మంది తమను తాము డ్రాపౌట్స్‌గా భావిస్తున్నారు. మంచి స్కూళ్లలో చేరలేక, గౌరవప్రదమైన ఉద్యోగాలు పొందలేక ఈ భావనను అనుభవిస్తున్నారు. పెళ్లి చేసుకుని పిల్లలను కన్నా సంతోషంగా ఉండలేమని భావిస్తున్నారు. దేశంలో సామాజిక రక్షణ కరువైందని ఆందోళన చెందుతున్నారు..’ అని కొరియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ చైల్డ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ నిపుణురాలు చోయ్ యూన్ క్యుంగ్ అంటున్నారు. 1960 నుంచి 1980 మధ్య భారీగా ఆర్థిక వృద్ధి ఉన్నప్పటికీ సంక్షేమ కార్యక్రమాలు రూపొందించడంలో సౌత్ కొరియా విఫలమైందని వివరించారు.
తాను కాలేజీకి వెళ్లే వరకు తనకూ భవిష్యత్తులో ఓ బేబీ ఉండాలని యూ కూడా అనుకుంది. కానీ తన సహోద్యోగులైన మహిళలు తమ పిల్లల విషయంలో పడ్డ ఆందోళన చూసి తాను విరమించుకుంది. తమ పిల్లలతో మాట్లాడేందుకు టాయిలెట్ నుంచి మాట్లాడేవారని, పిల్లలు అనారోగ్యంగా ఉంటే ఇంటికి పరుగులు పెట్టాల్సి వచ్చేదని, కానీ మగాళ్లకు ఆ బాధ్యత లేదని వాపోయారు. ‘ఇదంతా చూశాక, నాకు పిల్లలు ఉంటే అది ఉద్యోగంపై నా ఏకాగ్రతను దెబ్బతీస్తుందని గ్రహించాను..’ అని యూ చెప్పారు.
34 ఏళ్ల తన భర్త జో జున్ వి మాట్లాడుతూ పిల్లలు ఉండడం అవసరమని తాను అనుకోవడం లేదని అన్నారు. ఒక ఐటీ కంపెనీలో ఇంటర్‌ప్రిటర్‌గా ఆయన పనిచేస్తున్నారు. చాలా ఏళ్లు ఉద్యోగ వేటలో అలసిపోయానని, ఒక కొండ అంచున నిలబడ్డట్టుగా ఉండేదని, ఇక ఇప్పుడు జీవితాన్ని ఆస్వాదించాలని చూస్తున్నట్టు చెప్పారు.
అయితే సౌత్ కొరియాలో ఎంతమంది తాము పెళ్లి చేసుకోవద్దని నిర్ణయించుకున్నారు? ఎంతమంది పిల్లలు వద్దనుకున్నారు? వంటి గణాంకాలు అధికారికంగా లేవు. కానీ సౌత్ కొరియా జాతీయ గణాంకాల ఏజెన్సీ వివరాల ప్రకారం 1996లో 4,30,000 పెళ్లిళ్లు జరగగా, గత ఏడాది ఆ సంఖ్య 1,93,000కు పడిపోయింది. 1996లో 6,91,200 మంచి చిన్నారులు జన్మించగా, గత ఏడాది ఆ సంఖ్య 2,60,600కు పడిపోయింది. 1971లో ఈ సంఖ్య 10 లక్షలుగా ఉంది.
సింగిల్‌గా ఉండిపోవడానికి కారణాలు
33 ఏళ్ల గ్రాఫిక్ డిజైనర్ కంగ్ హన్ బియోల్ జీవితాంతం ఇక సింగిల్‌గా ఉండిపోవాలనుకున్నారు. పిల్లలను పెంచడానికి సౌత్ కొరియా సరైన ప్లేస్ కాదని భావిస్తున్నారు. అలాగే లింగ అసమానత్వంతో ఆమె మానసిక వ్యథను అనుభవిస్తున్నారు. మహిళలే లక్ష్యంగా డిజిటల్ సెక్స్ నేరాలు జరుగుతున్నాయని, పబ్లిక్ రెస్ట్‌రూమ్స్‌లో స్పై కెమెరాలు పెడుతున్నారని వాపోయారు. సోషల్ జస్టిస్ కోసం ప్రయత్నిస్తున్న వారిని నిర్లక్ష్యం చేసే సంస్కృతి నెలకొందని వాపోయారు. ‘సొసైటీ ఆరోగ్యంగా ఆలోచిస్తే, మహిళలు, పురుషులకు సమాన స్థాయి కల్పిస్తే నేను వివాహం గురించి ఆలోచిస్తాను..’ అని కంగ్ అన్నారు.
కంగ్ రూమ్మేట్ 26 ఏళ్ల హా హ్యుంజి కూడా సింగిల్‌గా ఉండాలని నిర్ణయించుకున్నారు. ఎందుకంటే ఆమె స్నేహితురాళ్లలో వివాహం చేసుకున్న వారు ఇదే సలహా ఇచ్చారు. ఇంటి పని, పిల్లల సంరక్షణ మహిళలే చూసుకోవాల్సి వస్తోందని, అందుకే పెళ్లి చేసుకోవద్దని సలహా ఇచ్చారట. ఒక వేళ పెళ్లి చేసుకుని పిల్లలు పుడితే వారి చదవులకు భారీగా ఖర్చు చేయాల్సి వస్తుందని ఆమె వర్రీ అవుతోంది. ‘నేను పెళ్లి చేసుకోకుండానే ఆనందంగా ఉండగలను. నా స్నేహితులతో నా జీవితాన్ని ఆనందంగా గడపగలను..’ అని సియోల్‌లో కాక్‌టైల్ బార్ నడిపే హా అన్నారు.
1995 వరకు సౌత్ కొరియా జనాభా నియంత్రణ కార్యక్రమాలు చేపట్టింది. యుద్ధానంతరం జనాభా అధిక పెరుగుదలను అదుపులో పెట్టేందుకు ఆ పనిచేసింది. ప్రజారోగ్య కేంద్రాల వద్ద కాంట్రాసెప్టివ్ పిల్స్ (గర్భనిరోధక మాత్రలు), కండోమ్స్ ఉచితంగా పంపిణీ చేసింది. వాసెక్టమీ చేయించుకున్న పురుషులకు మిలిటరీ రిజర్వ్ ట్రైనింగ్ పొందడం నుంచి మినహాయింపు ఇచ్చింది.
1950-1960ల కాలంలో సౌత్ కొరియన్ మహిళలు సగటున నలుగురి నుంచి ఆరుగురు పిల్లలకు జన్మనిచ్చారు. 1970ల కాలంలో సగటున నలుగురికి జన్మనిచ్చారు. 1980 తరువాత ఈ సగటు 2కు పడిపోయిందని ఐక్య రాజ్య సమితి గణాంకాలు చెబుతున్నాయి.
పిల్లలు కంటే ప్రోత్సాహకాలు
ఎక్కువ సంఖ్యలో పిల్లలను కనే వారికి సౌత్ కొరియా ప్రోత్సాహకాలు ఇస్తోంది. అలాగే ఇతర సపోర్టివ్ ప్రోగ్సామ్ కూడా అము చేస్తోంది. అయినప్పటికీ టోటల్ ఫర్టిలిటీ రేట్ పడిపోతూ వస్తోంది. అందువల్ల మరిన్ని సమగ్ర చర్యలు తీసుకోవాలని గత నెలలలో ప్రభుత్వ టాస్క్‌ఫోర్స్ నిర్ణయించింది.
కాగా పిల్లలు వద్దనుకున్న వారిపై సౌత్ కొరియా సమాజం కోపంగా ఉంది. 2021లో యూ, జో పిల్లలు వద్దనుకున్న తమ నిర్ణయాన్ని వారి యూట్యూబ్ ఛానెల్‌లో ప్రకటించినప్పుడు చాలా మంది వీరిని స్వార్థపరులుగా కామెంట్ చేశారు. అధిక పన్నులు కట్టాలని డిమాండ్ చేశారు. మరికొందరు వీరిని దూషించారు కూడా.
75 ఏళ్ల సియోల్ నివాసి లీ సంగ్ జే దీనిపై స్పందిస్తూ మానవాళి పెళ్లి చేసుకోవడం, పిల్లలకు జన్మనివ్వడం ప్రకృతి ధర్మం అని అన్నారు. ‘ఈ రోజుల్లో చాలా మంది పెళ్లి కాని యువతులు కుక్కపిల్లలను స్ట్రాలర్స్‌లో తీసుకెళుతూ వాటికి తాము తల్లులుగా చెబుతున్నారు. వారేమైనా వాటికి జన్మనిచ్చారా? నిజంగా వాళ్లు చాలా క్రేజీగా ఉన్నారు..’ అని ఆయన అన్నారు.
నిజానికి జాతి ప్రయోజనాల కోసం తాను పిల్లలను కనకపోయినప్పటికీ, ఎక్కువ మంది పిల్లలను కన్నందుకు తనను దేశభక్తురాలు అని పెద్దవాళ్లు తనను అన్నారని 38 ఏళ్ల సియో జి సియోంగ్ అన్నారు. ఆమె జనవరిలో ఐదో పాపకు జన్మనివ్వబోతోంది.
నలుగురు పిల్లలు ఉంటే రెంట్ ఫ్రీ
సియో కుటుంబం ఇటీవలే అన్యాంగ్ సిటీలో అద్దె లేని అపార్ట్‌మెంట్‌కు మారింది. కొరియా లాండ్ అండ్ హౌజింగ్ కార్పొరేషన్ ఈ అపార్ట్‌మెంట్ ఇచ్చింది. కనీసం నలుగురు పిల్లలు ఉంటే ఇలా అద్దె లేని అపార్ట్‌మెంట్ ఇస్తారు. సియో, ఆమె భర్త కిమ్ డాంగ్ పిల్లల పెంపకానికి ఇతరత్రా ప్రోత్సాహకాలు కూడా అందుకుంటారు.
తమ పిల్లలు భిన్నమైన వ్యక్తిత్వాలు, నైపుణ్యాలతో పెరగడాన్ని చూస్తుంటే ఆనందంగా ఉంటుందని కిమ్ అంటారు. ఇంటి వద్దే ఒకరితో ఒకరు ఆడుకోవడం పిల్లల్లో సోషల్ స్కిల్స్ పెరగడంలో తోడ్పడిందని సియో చెప్పారు. ‘వారు చాలా ముద్దుగా ఉంటారు. అందుకే కష్టమైనా పిల్లలకు జన్మనిస్తూనే ఉన్నా..’ అని ఆమె చెప్పారు.