Filter coffee : తాగితే ఫిల్టర్ కాఫీనే తాగాలి అంటున్న ప్రపంచం!
TasteAtlas filter coffee : టేస్ట్ అట్లాస్‌కి సంబంధించిన ప్రపంచవ్యాప్తంగా టాప్ 10 కాఫీల జాబితాలో దక్షిణ భారత ఫిల్టర్ కాఫీ రెండొవ స్థానంలో ఉంది. ఇది దాని గొప్ప రుచి, సాంప్రదాయ బ్రూయింగ్ పద్ధతికి ప్రసిద్ధి చెందింది.
సౌత్ ఇండియన్ ఫిల్టర్ కాఫీ మరోసారి అంతర్జాతీయంగా ప్రశంసలు పొందింది. టేస్ట్ అట్లాస్‌కి సంబంధించిన ప్రపంచవ్యాప్తంగా టాప్ 10 కాఫీల జాబితాలో రెండొవ స్థానాన్ని దక్కించుకుంది. గొప్ప రుచి, ప్రత్యేకమైన బ్రూయింగ్ ప్రక్రియకు ప్రసిద్ధి చెందిన ఈ కాఫీ దక్షిణ భారత గృహాలలో ప్రధానమైనదన్న విషయం తెలిసిందే. ఈ లిస్ట్‌లో క్యూబా ఎస్ప్రెస్సో మొదటి స్థానాన్ని దక్కించుకుంది.
ఆ సువాసన.. అమోఘం!
దక్షిణ భారత ఫిల్టర్ కాఫీని తయారు చేసే సాంప్రదాయ పద్ధతిలో సరళమైన, స్టెయిన్లెస్ స్టీల్ ఫిల్టర్ యంత్రం ఉంటుంది. ఈ పరికరంలో రెండు భాగాలు ఉంటాయి. పైన కాఫీ పౌడర్ కలిగి ఉంటుంది. అందులో వేడి నీళ్లు పోస్తే, దిగువ భాగం కాచిన కాఫీని సేకరిస్తుంది. కాఫీ నెమ్మదిగా దిగువకు జారుతుంటే, ఆ సువాసనలు అమోఘం కదూ! చాలా మంది కాఫీ ప్రియులు రాత్రిపూట ఫిల్టర్‌ని ఏర్పాటు చేస్తారు. ఉదయం వేడి వేడి ఫిల్టర్ కాఫీ నోట్లో పడితేనే రోజు మొదలవుతుంది
ఈ కాఫీ మిశ్రమాన్ని పాలు, కావాల్సినంత చక్కెరలో కలుపుకుని తాగుతారు. చిన్నపాటి స్టీల్ గ్లాసులో దీన్ని సర్వ్ చేయడం చూస్తూనే ఉంటాము. సాసర్లో కాఫీ పోసుకుని సిప్ చేస్తుంటే, ఆ ఫీలే వేరు!
సౌత్ ఇండియా ఫిల్టర్ కాఫీకి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు దక్కడం చాలా మంది గర్వంగా ఫీల్ అవుతున్నారు. గ్రీస్‌కి చెందిన ఎస్ప్రెస్సో ఫ్రెడో, ఇటాలియన్ కాపచీనో, టర్కిష్ కాఫీ వంటి ఫేమస్ డ్రింక్స్‌ని వెనక్కి నెట్టి, ఈ ఫిల్టర్ కాఫీ రెండో స్థానంలో నిలబడటం నిజంగా గొప్ప విషయం.
అయితే రోజుకు 400 మిల్లీగ్రాముల కెఫైన్ తీసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇది మనిషికి మనిషికి వేరువేరుగా ఉంటుందని స్పష్టం చేస్తున్నారు. షుగర్ ఇన్‌టేక్‌ని కూడా దృష్టిలో పెట్టుకోవాలని సూచిస్తున్నారు. లేకపోత జీర్ణక్రియ సమస్యలు, నిద్రలేమి వంటివి తలెత్తొచ్చని చెబుతున్నారు.
కాగా టేస్ట్ అట్లాస్ ఈ ఫిల్టర్ కాఫీ 2వ స్థానంలో రావడం ఇది మొదటిసారి కాదు. ఈ ఏడాది మార్చ్‌లో రిలీజ్ చేసిన ర్యాంకింగ్స్‌లో కూడా ఫిల్టర్ కాఫీకి రెండో ర్యాంక్ దక్కింది. త్వరలోనే సౌత్ ఇండియాకి చెందిన ఫిల్టర్ కాఫీకి నెంబర్.1 ర్యాంక్ వస్తే, ఇది నిజంగా గర్వకారణం అని అందరు అభిప్రాయపడుతున్నారు.
సంబంధిత కథనం