Sabarimala temple: శబరిమల అయ్యప్ప స్వామి దర్శనానికి భారీగా భక్తుల రాక
కేరళలోని శబరిమల అయ్యప్పస్వామిని ఆదివారం భక్తులు పెద్ద సంఖ్యలో దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.
శబరిమల అయ్యప్పస్వామిని ఆదివారం భక్తులు పెద్ద సంఖ్యలో దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ ఏడాది నవంబరు 17న ప్రారంభమైన మండల-మకరవిళక్కు సీజన్ నేపథ్యంలో ఆలయానికి భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటోంది.
ప్రస్తుతం శబరిమల ఆలయంలో జరిగిన అవకతవకలపై వివాదం చెలరేగడంతో అయ్యప్ప స్వామిని దర్శించుకునేందుకు భక్తులు గంటల తరబడి నిరీక్షించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
శబరిమల ఆలయంలో భక్తుల నిరీక్షణ సమయాన్ని తగ్గించడానికి తగిన సిబ్బందిని నియమించాలని కోరుతూ కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి శనివారం కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కు లేఖ రాశారు.
భక్తులకు ఆహారం, నీరు, పారిశుధ్యం, వైద్య సదుపాయాలు వంటి కనీస సౌకర్యాలు కల్పించేలా విజయన్ చూడాలని లేఖలో కేంద్ర మంత్రి కోరారు.
శబరిమల ఆలయానికి వెళ్లే సమయంలో అయ్యప్ప భక్తులు ఎదుర్కొంటున్న అసౌకర్యాలను పరిష్కరించాలని కేంద్ర మంత్రి కోరారు.
శబరిమల యాత్ర సందర్భంగా అయ్యప్ప భక్తులు ఎదుర్కొంటున్న సమస్యలు, అసౌకర్యాలను పరిష్కరించాలని కేరళ సీఎం పినరయి విజయన్ కు లేఖ రాసినట్లు కిషన్ రెడ్డి తన సోషల్ మీడియా హ్యాండిల్ ఎక్స్(ట్విటర్) లో పోస్ట్ చేశారు. శబరిమల సందర్శకులకు తగినంత మంది సిబ్బంది, సురక్షిత ప్రయాణం, మెరుగైన మౌళిక సదుపాయాలు, వైద్య సహాయం అందించాలని కోరారు.
శబరిమల ఆలయం, దానికి అనుబంధంగా అయ్యప్ప భక్తులు చేపట్టిన 40 రోజుల ఆధ్యాత్మిక యాత్ర హిందూ విశ్వాసంలో అత్యంత గౌరవనీయమైన విశ్వాస వ్యవస్థల్లో ఒకటి అని కేరళ ముఖ్యమంత్రికి రాసిన లేఖలో కిషన్ రెడ్డి పేర్కొన్నారు.
‘ప్రతి సంవత్సరం దాదాపు కోటి మంది భక్తులు శబరిమలను సందర్శిస్తారని, వారిలో ఎక్కువ మంది నవంబర్ నుండి జనవరి వరకు మండల సీజన్లో అయ్యప్ప స్వామిని దర్శించుకుంటారని మీకు తెలుసు. నేను నివసిస్తున్న తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి 15 లక్షలకు పైగా భక్తులు వస్తుంటారు. సన్నిధానంలో ఎక్కువ సేపు నిరీక్షించడం వల్ల భక్తులు ఎదుర్కొంటున్న తీవ్ర అసౌకర్యాల గురించి అయ్యప్ప స్వామి భక్తుల నుంచి, వివిధ వార్తా కథనాల ద్వారా నా దృష్టికి వచ్చింది. ఇటీవల దర్శనం కోసం ఎదురుచూస్తూ ఓ యువతి మృతి చెందడం కూడా తీవ్ర మనోవేదనకు గురిచేసింది..’ అని కేంద్ర మంత్రి అన్నారు.
ఆలయ ఆవరణలో పంపా నుంచి సన్నిధానం వెళ్లే ట్రెక్కింగ్ మార్గంలో సహాయం అందించడానికి సిద్ధంగా ఉన్న ఎన్జీవోలను అనుమతించే అంశాన్ని పరిశీలించాలని కోరారు. తక్షణమే స్పందించి ఈ విషయంలో అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని కేరళ సీఎంను కోరారు.