Manipur Violence: మణిపూర్ హింసపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
Manipur Violence: మణిపూర్ లో కొనసాగుతున్న హింసాత్మక ఘటనలపై శుక్రవారం సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. మణిపూర్ నుంచి సీబీఐ కేసుల విచారణను అస్సాంకు బదిలీ చేస్తూ ఆదేశాలిచ్చింది.
Manipur Violence: మణిపూర్ లో కొనసాగుతున్న హింసాత్మక ఘటనలపై శుక్రవారం సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. మణిపూర్ నుంచి సీబీఐ కేసుల విచారణను అస్సాంకు బదిలీ చేస్తూ ఆదేశాలిచ్చింది.
రెండు వైపులా బాధితులు..
మణిపూర్ హింసలో రెండు వర్గాల్లోనూ బాధితులున్నారని, వారిలో ఎవరికి ఎక్కువ అన్యాయం జరిగింది? ఎవరు ఎక్కువ నష్టపోయారు? ఏ వర్గం ఎక్కువగా హింసకు గురైంది?.. వంటి వివరాల లోతుల్లోకి తాము వెళ్లాలనుకోవడం లేదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. రెండు వర్గాల్లోనూ బాధితులున్నారన్నది వాస్తవమని స్పష్టం చేసింది. ‘‘అటు మైదాన ప్రాంతాల్లోనూ, ఇటు పర్వత ప్రాంతాల్లోనూ హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. రెండు ప్రాంతాల్లోనూ బాధితులున్నారు. నిందితులున్నారు’’ అని వ్యాఖ్యానించింది.
మే 3 వ తేదీ నుంచి..
ఈశాన్య రాష్ట్రం మణిపూర్ లో మే 3 వ తేదీ నుంచి పెద్ద ఎత్తున హింసాత్మక ఘటనలు చోటు చేసుకోవడం ప్రారంభమైంది. మైదాన ప్రాంతాల్లో ప్రాబల్యం ఉన్న, జనాభా పరంగా మెజారిటీలుగా ఉన్న మెయితీ (Meitei) లకు ఎస్టీ హోదా కల్పించాలన్న ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ పర్వత ప్రాంతాల్లో ప్రాబల్యం ఉన్న గిరిజన కుకీ (Kuki) వర్గాలు నిరసనలు ప్రారంభించిన నేపథ్యంలో ఈ హింసాత్మక ఘటనలు ప్రారంభమయ్యాయి. రెండు వర్గాలు ఒకరిపై మరొకరు దారుణంగా దాడులకు పాల్పడడం ప్రారంభించారు. ఈ హింసలో ఇప్పటివరకు 160 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. మణిపూర్ లో 53% జనాభా మెయితీలు కాగా, 16% కుకీలు ఉంటారు. ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో మణిపూర్ లో చోటు చేసుకుంటున్న హింసను దేశ ప్రజలు తీవ్రంగా ఖండించడం ప్రారంభించారు.
కేసులు అస్సాంకు బదిలీ..
ఈ నేపథ్యంలో మణిపూర్ హింసకు సంబంధించిన ఈ కేసులను సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కేంద్రం సీబీఐ కి అప్పగించింది. సుప్రీంకోర్టు ఈ కేసుల విషయమై శుక్రవారం కీలక వ్యాఖ్యలు చేసింది. మణిపూర్ హింసకు సంబంధించిన కేసుల విచారణను అస్సాంకు బదిలీ చేస్తూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ఆదేశాలిచ్చింది. ఈ కేసుల విచారణకు ప్రత్యేకంగా కోర్టును ఏర్పాటు చేయాలని, ప్రత్యేకంగా న్యాయమూర్తులను కేటాయించాలని గువాహటి హై కోర్టును ఆదేశించింది. ఆన్ లైన్ లో విచారణ జరపడానికి వీలుగా అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించింది. బాధితులు, సాక్ష్యులు కోరుకుంటే అస్సాంలో విచారణకు నేరుగా హాజరయ్యేందుకు అవకాశం కల్పించాలని స్పష్టం చేసింది.