Congress reshuffle:లోక్ సభ ఎన్నికల ముందు కాంగ్రెస్ లో భారీగా వ్యవస్థాగత మార్పులు.. ప్రియాంక గాంధీ విషయంలో అనూహ్య నిర్ణయం
Congress reshuffle: కాంగ్రెస్ పార్టీ చత్తీస్ గఢ్ వ్యవహారాల ఇన్ చార్జిగా పార్టీ ప్రధాన కార్యదర్శి సచిన్ పైలట్ ను నియమించారు. దీంతోపాటు పార్టీలో పలు కీలక మార్పులు చేశారు.
Congress reshuffle: రాజస్థాన్ మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్ ను ఛత్తీస్ గఢ్ పార్టీ వ్యవహారాల ఇంచార్జ్ గా నియమించారు. చత్తీస్ గఢ్ లో ఇటీవలి ఎన్నికల్లో బిజెపి చేతిలో కాంగ్రెస్ ఓడిపోయిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే శనివారం పార్టీలో పలు సంస్థాగత మార్పులకు ఆమోదం తెలిపినట్లు కాంగ్రెస్ ఒక ప్రకటనలో తెలిపింది.
ప్రియాంకకు కీలక బాధ్యతలు..
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తర్వాత, కీలకమైన లోక్ సభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ సంస్థాగత పునర్వ్యవస్థీకరణలో ప్రియాంక గాంధీ వాద్రాను ఉత్తర ప్రదేశ్ కాంగ్రెస్ ఇంచార్జ్ పదవి నుండి తొలగించారు. అయితే, ఆమె కాగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతారు. ప్రస్తుతానికి ఆమెకు ఎలాంటి బాధ్యతలను ఇవ్వలేదు. దాంతో, ఆమెకు పార్టీలో మరింత కీలక బాధ్యతలను ఇవ్వనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.
కర్నాటకకు సూర్జేవాలా..
ముకుల్ వాస్నిక్ ను గుజరాత్, జితేంద్ర సింగ్ ను అస్సాం, మధ్యప్రదేశ్, రణదీప్ సింగ్ సుర్జేవాలా ను కర్ణాటక, దీపక్ బబరియా ను ఢిల్లీ, హర్యానా, అవినాష్ పాండే ను ఉత్తరప్రదేశ్, కుమారి సెల్జా ను ఉత్తరాఖండ్ రాష్ట్రాలకు ఇన్ చార్జ్ లుగా నియమించారు.
తెలంగాణ అదనపు బాధ్యతలు దీప్ దాస్ మున్షీకి
జార్ఖండ్ తో పాటు పశ్చిమబెంగాల్ అదనపు బాధ్యతలను జీఎస్ మీర్ కు, కేరళ, లక్షద్వీప్ లతో పాటు, తెలంగాణ అదనపు బాధ్యతలను దీపా దాస్ మున్షీకి, మహారాష్ట్రకు రమేశ్ చెన్నితలను, బీహార్ కు మోహన్ ప్రకాశ్ ను, మేఘాలయ, మిజోరాం, అరుణాచల్ ప్రదేశ్ లకు డాక్టర్ చెల్లకుమార్ ను, ఒడిశా, తమిళనాడు, పుదుచ్చేరిలకు డాక్టర్ అజయ్ కుమార్ ను, జమ్ముకశ్మీర్ కు భరత్ సింగ్ సోలంకీని, హిమాచల్ ప్రదేశ్, చండీగఢ్ లకు రాజీవ్ శుక్లా ను ఇన్ చార్జ్ లుగా నియమించారు.సుఖ్జీందర్ సింగ్ రాంధవా కు రాజస్తాన్, దేవేందర్ యాదవ్ కు పంజాబ్, మాణిక్ రావ్ ఠాక్రేకు గోవా, డామన్ డయ్యూ, దాద్రా నగర్ హవేలీల బాధ్యతలను అప్పగించారు. మాణిక్ రావ్ ఠాగూర్ కు ఆంధ్రప్రదేశ్ తో పాటు అండమాన్ నికోబార్ బాధ్యతలను అదనంగా ఇచ్చారు.