PM-KISAN 12th Installment: 12వ విడత పీఎం కిసాన్ విడుదల.. 11 కోట్ల రైతులకు లబ్ధి
PM-KISAN 12th installment: ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ యోజన ద్వారా 11 కోట్ల మంది రైతుల ఖాతాలో 12వ విడతగా మొత్తం రూ. 16,000 కోట్లు జమయ్యాయి.
న్యూఢిల్లీ, అక్టోబరు 17: రైతులు యాసంగికి సమాయాత్తమయ్యే వేళ, దీపావళి పండగ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం ప్రధానమంత్రి-కిసాన్ పథకం కింద అర్హులైన 11 కోట్ల మంది రైతులకు 12వ విడతగా రూ. 16,000 కోట్ల నగదును వారి ఖాతాల్లో జమచేశారు. దీంతో ఇప్పటి వరకు లబ్ధిదారులకు బదిలీ అయిన మొత్తం రూ. 2.16 లక్షల కోట్లు దాటుతుందని అంచనా.
ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM-KISAN) కింద అర్హులైన రైతులకు ప్రతి నాలుగు నెలలకు రూ. 2,000 చొప్పున మూడు సమాన వాయిదాలలో సంవత్సరానికి రూ. 6,000 ఆర్థిక ప్రయోజనం అందుతుంది. పీఎం కిసాన్ నిధి నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు బదిలీ అవుతుంది. ఈ పథకం ఫిబ్రవరి 2019లో ప్రారంభమైంది.
దేశ రాజధానిలోని పూసా క్యాంపస్‌లో జరుగుతున్న రెండు రోజుల కార్యక్రమం ‘పీఎం కిసాన్ సమ్మాన్ సమ్మేళన్ 2022’లో 12వ విడతను ప్రధాని విడుదల చేశారు.
ఈ కార్యక్రమంలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్, రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవియా కూడా పాల్గొన్నారు.
దేశవ్యాప్తంగా 13,500 మంది రైతులు, దాదాపు 1,500 అగ్రి స్టార్టప్ ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు.
పరిశోధకులు, విధాన రూపకర్తలు, ఇతర వాటాదారులు కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు.
కిసాన్ సమ్మాన్ నిధి పథకంలో పూర్తి సాయం కేంద్ర ప్రభుత్వమే అందిస్తుంది. అర్హులైన రైతులను ఎంపిక చేసి వారికి పెట్టుబడిసాయంగా ఆర్థికసాయం అందిస్తుంది.