Prashant Kishore: రాజకీయ పార్టీ ప్రారంభించిన ప్రశాంత్ కిషోర్; పార్టీ పేరు, లక్ష్యాల వెల్లడి-prashant kishor launches jan suraaj party says bihars voice must reach delhi ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Prashant Kishore: రాజకీయ పార్టీ ప్రారంభించిన ప్రశాంత్ కిషోర్; పార్టీ పేరు, లక్ష్యాల వెల్లడి

Prashant Kishore: రాజకీయ పార్టీ ప్రారంభించిన ప్రశాంత్ కిషోర్; పార్టీ పేరు, లక్ష్యాల వెల్లడి

Sudarshan V HT Telugu
Oct 02, 2024 05:49 PM IST

ప్రముఖ ఎన్నికల ప్రచార వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కొత్త రాజకీయ పార్టీని ప్రారంభించారు. మహాత్మా గాంధీ జయంతి రోజైన అక్టోబర్ 2వ తేదీన బిహార్ లో జన్ సురాజ్ పార్టీ పేరుతో కొత్త రాజకీయ పార్టీని ప్రారంభించారు. ఇప్పటికే జన్ సురాజ్ సంస్థ పేరుతో ప్రశాంత్ కిశోర్ బీహార్ కు చెందిన వేలాది మందితో సమావేశమయ్యారు.

రాజకీయ పార్టీ ప్రారంభించిన ప్రశాంత్ కిషోర్
రాజకీయ పార్టీ ప్రారంభించిన ప్రశాంత్ కిషోర్ (PTI)

రాజకీయ వ్యూహకర్త, సామాజిక కార్యకర్త ప్రశాంత్ కిశోర్ బుధవారం బిహార్ రాజధాని పట్నాలో ప్రముఖుల సమక్షంలో కొత్త రాజకీయ పార్టీ ‘జన్ సురాజ్ పార్టీ (Jan Suraaj Party)’ని ప్రారంభించారు. పార్టీ ప్రారంభోత్సవానికి ముందు ఆయన మాట్లాడుతూ ‘జై బిహార్’ నినాదాన్ని గట్టిగా వినిపించాలని బిహార్ ప్రజలను కోరారు. ఉపాధి కోసం తమ రాష్ట్రాలకు వచ్చిన బిహారీలను దూషించి, చితకబాదిన రాష్ట్రాలకు ఆ నినాదం గట్టిగా వినిపించాలన్నారు.

జై బిహార్ అనండి..

ప్రస్తుతం దేశంలో బిహారీ అన్న పదం ఒక తిట్టులా మారిందని, ఆ పరిస్థితి మారాలని ప్రశాంత్ కిషోర్ అన్నారు. ‘‘'మీరంతా 'జై బిహార్' అని గట్టిగా నినదించాలి. ఆ నినాదం మిమ్మల్ని, మీ పిల్లలను ఎవరూ 'బిహారీ' అని దూషించకుండా చేయాలి. మీ వాయిస్ ఢిల్లీకి చేరాలి. అది బెంగాల్ కు చేరుకోవాలి. అక్కడ బీహార్ కు చెందిన విద్యార్థులను కొట్టారు. బీహారీ పిల్లలను దూషించిన, కొట్టిన తమిళనాడు, ఢిల్లీ, బొంబాయి ప్రాంతాలకు ఇది చేరాలి’’ అని ప్రశాంత్ కిశోర్ (Prashant Kishore) పిలుపునిచ్చారు. బెంగాల్లోని సిలిగురికి పరీక్ష రాసేందుకు వచ్చిన ఇద్దరు యువకులను వేధించిన కేసులో ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసిన కొద్ది రోజులకే ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

జన్ సురాజ్ పార్టీ

ప్రశాంత్ కిషోర్ ఇప్పటికే జన్ సురాజ్ పేరుతో ఒక ఉద్యమాన్ని ప్రారంభించి, బీహార్ కు చెందిన వేలాది మందితో సమావేశామై, బిహార్ బాగోగులపై అధ్యయనం చేశారు. గత 25-30 ఏళ్లుగాబిహార్ ప్రజలకు ప్రత్యామ్నాయం లేకుండా పోయిందని, దాంతో ప్రజలు లాలూ ప్రసాద్ యాదవ్ కు భయపడి బీజేపీకి ఓటు వేస్తున్నారని ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యానించారు. ఆ రాజకీయ నిస్సహాయతకు ముగింపు పలకడమే తన పార్టీ ముఖ్య ఉద్దేశమని ప్రశాంత్ కిషోర్ అన్నారు. జన్ సురాజ్ పార్టీ బీహార్ ప్రజలందరి పార్టీగా ఉంటుందన్నారు.

నితీశ్ కుమార్ పై విమర్శలు

ఇటీవల ఆర్జేడీ కి దూరమై, బీజేపీతో మరోసారి పొత్తుపెట్టుకుని సీఎం అయిన నితీశ్ కుమార్ (nitish kumar) పై ప్రశాంత్ కిషోర్ విమర్శలు చేశారు. గతంలో ప్రశాంత్ కిషోర్ నితీశ్ కుమార్ పార్టీ జేడీయూలో ఉన్నారు. ఆ పార్టీ ఉపాధ్యక్షుడిగా కూడా వ్యవహరించారు. లాలూ యాదవ్ కు మద్దతిచ్చినందుకు బిహార్ లో కాంగ్రెస్ పార్టీకి పట్టిన గతే.. నితీశ్ కు మద్దతు ఇచ్చినందుకు బీజేపీ (bjp) కి పడుతుందని ప్రశాంత్ కిశోర్ తిట్టిపోశారు. రాష్ట్ర పాలన నిర్వహించగల మానసిక, శారీరక ఆరోగ్యం ఇప్పుడు నితీశ్ కుమార్ కు లేదన్నారు. ‘‘లాలూ ప్రసాద్ యాదవ్ బిహార్ లో 15 ఏళ్ల పాటు 'జంగిల్ రాజ్' నడపడానికి కాంగ్రెస్ సహకరించింది. దాంతో, బీహార్ ప్రజలు కాంగ్రెస్ ను పూర్తిగా తరిమికొట్టారు. బీజేపీకి కూడా అదే గతి పడుతుంది’’ అన్నారు. నితీష్ కుమార్ కు మద్దతివ్వడం బీజేపీ రాజకీయ అనివార్యత అని ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యానించారు.