Rajya Sabha Seats : రాజ్యసభకు పోటాపోటీ, టీడీపీ రెండు, జనసేనకు ఒకటి- బీజేపీకీ లేనట్లే
Rajya Sabha Seats : వైసీపీ ఎంపీల రాజీనామాలతో రాజ్యసభలో ఏపీకి చెందిన మూడు స్థానాలు ఖాళీ అయ్యాయి. ఈ మూడు సీట్లకు కూటమి పార్టీల సీనియర్ నేతలు పోటీ పడుతున్నారు. అయితే ఇప్పటికే కూటమి పార్టీలు వీటిపై ఒక అభిప్రాయానికి వచ్చినట్లు సమాచారం. రెండు టీడీపీ, ఒకటి జనసేన పంచుకున్నట్లు తెలుస్తోంది.
Rajya Sabha Seats : రాజ్యసభ సీట్లపై టీడీపీ, జనసేన సీనియర్ నేతలు కన్నేశారు. ఎన్నికల్లో పోటీ చేయని సీనియర్ నేతలు ఇప్పుడు రాజ్యసభలోకి ప్రవేశించాలని చూస్తోన్నారు. తాము సీనియర్ నేతలమని, పెద్దల సభకు తామే అర్హులమని సన్నిహితుల వద్ద చెప్పేసుకుంటున్నారు. తమకు అవకాశం ఇవ్వాలని పార్టీ అధ్యక్షుడికి విజ్ఞప్తులు సైతం పెట్టుకున్నారు.
రాష్ట్రంలో ఖాళీ అయిన రాజ్యసభ సీట్లను పలువురు టీడీపీ, జనసేన పార్టీలకు చెందిన సీనియర్ నేతలు ఆశిస్తున్నారు. ఇటీవలి రాష్ట్రంలో జరిగిన అధికార మార్పుతో ముగ్గురు వైసీపీకి చెందిన మోపిదేవి వెంకటరమణ, ఆర్.కృష్ణయ్య, బీద మస్తాన్ రావులు తమ రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. దీంతో రాష్ట్రంలో మూడు రాజ్యసభ స్థానాలకు ఖాళీ ఏర్పడింది. త్వరలో ఈ మూడు స్థానాలను భర్తీ చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేయనుంది.
అయితే సాధారణంగా ఎమ్మెల్యేలు ఎన్నుకునే రాజ్యసభ స్థానాలు మూడు, రాష్ట్రంలో 164 ఎమ్మెల్యేలతో ఉన్న టీడీపీ కూటమికే దక్కుతాయి. దాదాపు ఏకగ్రీవం అయిపోతాయి. వైసీపీకి కేవలం 11 మంది ఎమ్మెల్యే ఉండటంతో బరిలో అభ్యర్థిని కూడా నిలబెట్టడానికి సాహసించదు. మరోవైపు ప్రస్తుతం టీడీపీకి రాజ్యసభలో ఒక సభ్యుడు కూడా లేరు. ఆ పార్టీ స్థాపించిన 1983 నుండి ఇప్పటి వరకు ఈ పరిస్థితిని ఎప్పుడూ ఎదుర్కొలేదు. టీడీపీ చివరి రాజ్యసభ సభ్యుడిగా కనకమేడల రవీంద్ర కుమార్ ఉన్నారు. ఆయన పదవీ కాలం ముగియడంతో ఈ ఏడాది ఫిబ్రవరి 8న రాజ్యసభలో పదవీ విరమణ చేశారు. అప్పటి నుంచి టీడీపీ రాజ్యసభలో తన ప్రాతినిధ్యాన్ని కోల్పోయింది.
అయితే వైసీపీ ఎంపీలు రాజీనామా చేయడంతో రాజ్యసభలో టీడీపీ తన ప్రాతినిధ్యాన్ని పునర్వ్యస్థీకరించేందుకు అవకాశం వచ్చింది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వల్ల ఆంధ్రప్రదేశ్ నుంచి మరో కొత్త పార్టీ కూడా రాజ్యసభలో అడుగుపెట్టే అవకాశం ఉంది. ప్రస్తుతం మూడు స్థానాలకు ఖాళీగా ఏర్పడటంతో ఆ మూడింటిని కూటమి పార్టీల మధ్య పంపకాలు జరిగినట్లు సమాచారం. అందులో భాగంగానే టీడీపీ రెండు, జనసేనకి ఒక రాజ్యసభ స్థానం కేటాయించేందుకు ఉభయ పార్టీలు అంగీకరించినట్లు సమాచారం. అయతే మరో కూటమి పార్టీ బీజేపీకి ఈసారికి లేనట్లేనని స్పష్టం అవుతోంది. తరువాత ఖాళీ అయితే అప్పుడు కేటాయించే అవకాశం ఉంది.
టీడీపీ నుంచి అరడజను మంది ఆశావహులు
టీడీపీకి కేటాయించిన రెండు స్థానాలకు భారీ స్థాయిలో ఆశావహులు ఉన్నారు. దాదాపు అరడజను మంది సీనియర్ నేతలు రాజ్యసభ కోసం ఎదురు చూస్తున్నారు. మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు, మాజీ ఎంపీలు గల్లా జయదేవ్, కంభంపాటి రామ్మోహన్ రావు, కనకమేడల రవీంద్ర కుమార్, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య పేర్లు వినబడుతున్నాయి. మరోవైపు జనసేన నుంచి పవన్ కల్యాణ్ అన్న నాగబాబుకు ఇచ్చే అవకాశం ఉందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.
అయితే ఇటీవలి వైసీపీకి రాజీనామా చేసిన మాజీ రాజ్యసభ సభ్యుడు బీద మస్తాన్ రావు త్వరలో టీడీపీలో చేరుతారని, రాజీనామా చేసిన సీటును తనకే కేటాయించాలని ఆయన షరతు పెట్టినట్లు టీడీపీ వర్గాల సమాచారం. దీంతో టీడీపీకి కేటాయించిన రెండు సీట్లలో ఒకటి బీద మస్తాన్‌రావుకు కేటాయించే అవకాశం ఉంది. మరో సీటుకు అరడజను మంది ఆశావహుల్లో ఎవరికి ఇస్తారనే ఉత్కంఠ టీడీపీ నేతల్లో నెలకొంది.
ఎమ్మెల్సీల స్థానాలపై కసరత్తు
త్వరలో జరగనున్న శాసనమండలి పట్టభద్ర నియోజకవర్గ ఎన్నికల్లో పోటీ చేసేందుకు టీడీపీ కసరత్తు చేస్తోంది. అలాగే తూర్పు-పశ్చిమ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ మరణంతో 2023 డిసెంబర్ 15 నుంచి ఖాళీగా ఉంది. గవర్నర్ నామినేటెడ్ (1), స్థానిక సంస్థలు (విజయనగరం-1), ఎమ్మెల్యే కోటా (3) మొత్తం ఆరు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీగా ఉన్నాయి. దీంతో ఆరు స్థానాల్లో ఐదు స్థానాలను టీడీపీ కూటమి సొంతం చేసుకుంటుంది. ఒక స్థానం తూర్పు-పశ్చిమ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ నియోజకవర్గానికే పోటీ ఉంటుంది.
అలాగే కృష్ణా-గుంటూరు నియోజకవర్గ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు, తూర్పు-పశ్చిమ గోదావరి నియోజకవర్గ ఎమ్మెల్సీ వెంకటేశ్వరావు పదవీ కాలం మర్చితో ముగియనుంది. దీంతో ఈ రెండు స్థానాల్లో టీడీపీ తన అభ్యర్థులను పోటీలో ఉంచేందుకు సిద్ధమైంది. మొత్తం ఎనిమిది ఎమ్మెల్సీ స్థానాల్లో కనీసం టీడీపీకి ఆరు, జనసేన, బీజేపీకి ఒక్కొక్కటి కేటాయించే అవకాశం ఉంది. టీడీపీ తరపున ఎవరికైతే అసెంబ్లీ ఎన్నికల్లో సీట్లు రాలేదో వారికి వచ్చే అవకాశం ఉంది. టీడీపీ నేతలు ఆలపాటి రాజేంద్రప్రసాద్, దేవినేని ఉమామహేశ్వరరావు, ఎస్‌వీఎస్ఎన్ వర్మ, జవహర్, వర్ల రామయ్య, పీలా గోవింద, బొడ్డు వెంకటరమణ, గన్నే వీరాంజనేయులు తదితరులు ఉన్నారు.
జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు
సంబంధిత కథనం