Modi Russia Tour : యుద్దభూమిలో సమస్యకు పరిష్కారం దొరకదు.. పుతిన్‌తో మోదీ
Modi Russia Tour : ప్రధాని మోదీ రష్యా పర్యటన విజయవంతమైంది. రష్యా, ఉక్రెయిన్ యుద్ధంపై పుతిన్‌తో మోదీ మాట్లాడారు. యుద్దభూమిలో ఎటువంటి పరిష్కారం దొరకదని చర్చలు, దౌత్యం కోసం కోరారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉక్రెయిన్‌లోని పిల్లల ఆసుపత్రిపై రష్యా క్షిపణి దాడిని ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ముందు లేవనెత్తారు. యుద్ధభూమిలో ఎటువంటి పరిష్కారం కనుగొనలేరని చెప్పి, చర్చలు, దౌత్యం మార్గానికి తిరిగి రావాలని పేర్కొన్నారు.
ఫిబ్రవరి 2022లో ఉక్రెయిన్‌లో యుద్ధం ప్రారంభమైన తర్వాత రష్యాలో మోదీ పర్యటించడం ఇదే మెుదటిసారి. సోమవారం తన స్వదేశంలో పుతిన్‌తో జరిగిన ప్రైవేట్ సమావేశంలో, మంగళవారం క్రెమ్లిన్‌లో జరిగిన వార్షిక శిఖరాగ్ర సమావేశంలో వివాదం గురించి మెదీ చర్చించారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ భారతదేశం, రష్యా నాయకుల మధ్య సమావేశాన్ని విమర్శించిన కొన్ని గంటల తర్వాత శిఖరాగ్ర సమావేశంలో పిల్లల ఆసుపత్రిపై దాడిని మోదీ సూటిగా ప్రస్తావించారు.
'యుద్ధమైనా, ఘర్షణలైనా, ఉగ్రదాడులైనా, ప్రాణనష్టం జరిగినప్పుడు మానవత్వంపై నమ్మకం ఉన్న ప్రతి వ్యక్తి తీవ్రంగా ప్రభావితమవుతాడు. కానీ అందులోనూ అమాయక పిల్లలు చనిపోతే, అమాయక పిల్లలు చనిపోవడం చూస్తుంటే గుండె గుచ్చుకుంటుంది. ఆ బాధ చాలా భయంకరంగా ఉంటుంది.' అని మోదీ అన్నారు.
'తరువాతి తరం ఉజ్వల భవిష్యత్తుకు శాంతి అత్యంత అవసరమని స్నేహితుడిగా నేను ఎప్పుడూ చెబుతూనే ఉన్నాను. యుద్ధభూమిలో పరిష్కారం సాధ్యం కాదని కూడా నాకు తెలుసు. బాంబులు, తుపాకులు, బుల్లెట్ల మధ్య పరిష్కారాలు, శాంతి చర్చలు సఫలం కాలేవు. చర్చల ద్వారానే శాంతికి మార్గాన్ని వెతుక్కోవాలి.' అని మోదీ అన్నారు.
ఉక్రెయిన్‌లోని అతిపెద్ద పీడియాట్రిక్ సదుపాయమైన ఓహ్మత్‌డిట్ చిల్డ్రన్స్ హాస్పిటల్, దేశవ్యాప్తంగా ఉన్న నగరాలపై రష్యా క్షిపణి దాడుల కారణంగా పెద్ద నష్టం జరిగింది. ఈ దాడుల్లో ఆసుపత్రిలో ఉన్న చాలా మంది మరణించగా, 140 మంది గాయపడ్డారు.
నాలుగు నుండి ఐదు గంటలపాటు కొనసాగిన వారి సమావేశంలో పుతిన్‌తో ఈ విషయాన్ని విస్తృతంగా చర్చించినట్లు మోదీ పేర్కొన్నారు. ఉక్రెయిన్ సమస్యపై మేమిద్దరం ఓపెన్ మైండ్‌తో, సుదీర్ఘంగా మా అభిప్రాయాలను చర్చించగలిగామని చెప్పారు. మేము చాలా గౌరవంగా ఒకరి అభిప్రాయాలను వినడానికి, అర్థం చేసుకోవడానికి ప్రయత్నించామన్నారు. తమ సమావేశంలో ఎలాంటి విషయాలు కప్పిపుచ్చకుండా, పుతిన్ చాలా బహిరంగంగా మాట్లాడారని మోదీ అన్నారు. ఈ చర్చల నుంచి చాలా ఆసక్తికరమైన ఆలోచనలు ఉద్భవించాయని చెప్పారు.
శాంతిని నెలకొల్పేందుకు భారత్ అన్ని విధాలా సహాయ సహకారాలు అందించేందుకు సిద్ధంగా ఉందని మోదీ చెప్పారు. భారతదేశం శాంతికి అనుకూలంగా ఉందని నేను మీకు, ప్రపంచ సమాజానికి హామీ ఇస్తున్నానని స్పష్టం చేశారు.