Parliament breach: పార్లమెంట్ భద్రతావైఫల్యం ఘటనలో పోలీసుల అదుపులో మరొకరు, పరారీలో ఇంకొకరు.. ఎవరు వీరంతా?
Parliament breach: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పార్లమెంట్ లో భద్రతా వైఫల్యం ఘటనలో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. నిందితులపై కఠినమైన చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం కింద కేసు నమోదు చేశారు.
Parliament breach: బుధవారం లోక్ సభ (lok sabha) జరుగుతుండగా, మనోరంజన్, సాగర్ శర్మ అనే ఇద్దరు వ్యక్తులు ప్రేక్షకుల గ్యాలరీ లో నుంచి సభలోకి దూకి, పసుపు రంగు పొగను వెదజల్లిన ఘటన దేశ ప్రజలను నిశ్చేష్టులను చేసింది. పార్లమెంటు భద్రతపై కొత్త ప్రశ్నలను లేవనెత్తింది. ఆ ఇద్దరు నిందితులు ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నారు. పార్లమెంటు వెలుపల అదే పసుపు రంగు పొగను వెదజల్లుతూ నిరసన తెలుపుతున్న మరో ఇద్దరు అమోల్ షిండే, నీలమ్ దేవీలను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.
ఐదో వ్యక్తి అరెస్ట్..
ఆ నలుగురు ఇచ్చిన సమాచారం తో వారికి గురుగ్రామ్ లో షెల్టర్ ఇచ్చిన విశాల్ శర్మ అనే వ్యక్తిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరికి సహకరించిన లలిత్ అనే వ్యక్తి పరారీలో ఉన్నాడు. కాగా, నిరుద్యోగులైన నిందితులు అందరూ వేరు వేరు ప్రాంతాలకు చెందిన వారు అని, వారికి సోషల్ మీడియా ద్వారా గత 4 ఏళ్లుగా పరిచయమని పోలీసుల విచారణలో తేలింది. మైసూరు కు చెందిన మనో రంజన్ స్థానిక బీజేపీ ఎంపీ ప్రతాప సింహ ద్వారా పార్లమెంటులోనికి ప్రవేశించడానికి పాస్ లు సంపాదించాడు. నిందితులపై పోలీసులు కఠినమైన చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (UAPA) కింద, అలాగే ఐపీసీలోని 120బీ, 452 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.
ఉన్నత చదువులు చదివి..
నిరుద్యోగం, రైతుల నిరసన, మణిపూర్ లో పరిస్థితులు తదితర దేశంలో నెలకొన్న పరిస్థితులకు నిరసనగా తాము ఈ చర్య చేపట్టామని నిందితులు పోలీసులకు తెలిపారు. నిందితుల్లో నీలమ్ దేవీ MA, B.ED, M.Ed, M.Phil చదివారు. నెట్ క్వాలిఫై అయ్యారు. ప్రస్తుతం పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నారు. అమోల్ షిండే మహారాష్ట్రలోని లాతూర్ కు చెందిన వారు. అయితే, వీరంతా ఏదైనా ఉగ్రవాద లేక తీవ్రవాద సంస్థ తరఫున పని చేస్తున్నారా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.