Hate crime : 6ఏళ్ల బాలుడిని 26సార్లు పొడిచి చంపిన వృద్ధుడు! ముస్లిం అని..!
Hate crime : ముస్లింలు ఉంటున్న ఇంటిపై దాడి చేశాడు ఓ వృద్ధుడు. 6ఏళ్ల బాలుడిని 26సార్లు కత్తితో పొడిచాడు. అమెరికాలో జరిగిన ఈ ఘటనలో బాలుడు ప్రాణాలు కోల్పోయాడు.
US hate crime : అమెరికాలో అత్యంత దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ 71ఏళ్ల వృద్ధుడు.. ఓ మహిళతో పాటు ఓ బాలుడిపై దాడి చేశాడు. 6ఏళ్ల బాలుడిని కత్తితో 26సార్లు పొడవగా.. అతను ప్రాణాలు కోల్పోయాడు. ఇజ్రాయెల్- హమాస్ మధ్య జరుగుతున్న యుద్ధం నేపథ్యంలో ఈ ఘటన జరిగిందని పోలీసులు చెబుతున్నారు.
ఇదీ జరిగింది..
అమెరికాలోని ఇల్లినాయిస్ ప్రాంతంలో స్థానిక కాలమానం ప్రకారం శనివారం జరిగింది ఈ ఘటన. బాధితులు ముస్లింలు. వారు జోసెఫ్ జుబా అనే వృద్ధుడి ఇంట్లో అద్దెకు ఉంటున్నారని సమాచారం. మహిళ వయస్సు 32ఏళ్లు. బాలుడి వయస్సు 6ఏళ్లు. పాలిస్తీనియన్ అమెరికన్ అని తెలుస్తోంది. మహిళ, బాలుడి మధ్య బంధంపై స్పష్టత లేదు.
కాగా.. ఆ వృద్ధుడు హఠాత్తుగా ఆ ఇంట్లోకి వెళ్లాడు. మహిళ, బాలుడిపై కత్తితో దాడి చేశాడు. మహిళకు తీవ్రమైన గాయాలయ్యాయి. 6ఏళ్ల బాలుడిని 26సార్లు పొడిచాడు. ఫలితంగా అతను ప్రాణాలు కోల్పోయాడు.
Illinois crime news : మరోవైపు.. తీవ్రగాయాలతో పడి ఉన్న మహిళ.. శక్తిని తెచ్చుకుని పోలీసులకు ఫోన్ చేసింది. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. వెంటనే ఘటనాస్థలానికి పరుగులు తీశారు.
"ఇద్దరు బాధితులను బెడ్రూమ్లో గుర్తించాము. వారి శరీరానికి అనేక గాయాలయ్యాయి. ఛాతీ నుంచి రక్తం కారుతూ కనిపించారు," అని పోలీసులు వివరించారు.
బాధితురాలిని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె అక్కడ చికిత్స పొందుతోంది.
Israel Hamas war : "ఇంటి తలుపు కొట్టాడు. నా గొంతు నులిమి చంపాలని చూశాడు. 'మీ ముస్లింలు చావాలి' అని గట్టిగా అరిచాడు," అని.. ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా.. బాధితురాలు.. బాలుడి తండ్రికి మెసేజ్ చేసినట్టు పోలీసులు వెల్లడించారు.
కాగా.. బాలుడి మృతదేహానికి పోస్టుమార్టం చేసిన వైద్యులు షాక్‌కు గురయ్యారు.
"బాలుడిని చాలా కిరాతకంగా చంపాడు. పోస్టుమార్టం చేస్తుండగా.. అతని కడుపులో నుంచి 7 ఇంచ్‌ల బ్లేడ్‌తో కూడిన మిలిటరీ స్టైల్ కత్తిని బయటకు తీశాము," అని వైద్యులు వెల్లడించారు.
Muslim boy killed in US : ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడిని అరెస్ట్ చేశారు. ప్రాథమిక దర్యాప్తు చేపట్టిన తర్వాత పలు కీలక విషయాలు వెల్లడించారు.
"ముస్లింలు కావడంతోనే వారిద్దరిపై దాడి జరిగింది. మధ్య ఆసియాలో ఇజ్రాయెల్- హమాస్ మధ్య జరుగుతున్న యుద్ధానికి దీనికి లింక్ ఉందని డిటెక్టివ్లు నిర్ధరించారు," అని పోలీసులు తెలిపారు.
అమెరికాలో జరిగిన ఈ ద్వేషపూరిత నేరాన్ని ఆ దేశాధ్యక్షుడు జో బైడెన్ ఖండించారు. "ఇది చాలా దారుణమైన ఘటన," అని అభివర్ణించారు. ఘటనకు సంబంధించిన వార్త విన్న తర్వాత షాక్‌కు గురైనట్టు వివరించారు.
"ఇలాంటి ఘటనలకు అమెరికాలో చోటు లేదు. ఇది మనిషి ప్రాథమిక విలువలకు వ్యతిరేకం," అని జో బైడెన్ అన్నారు. అమెరికావాసులు ఐకమత్యంతో ముందుకొచ్చి.. ఇస్లమఫోబియాను అరికట్టాలని పిలుపునిచ్చారు.
సంబంధిత కథనం