Bengaluru news: బెంగళూరులో పోలీసులపై దాడి చేసి, ఏకంగా ఎస్ ఐ చేతినే కొరికిన యువతి
Bengaluru crime news: అర్ధరాత్రి దాటి, క్లోజ్ చేసే సమయం ముగిసిపోయినప్పటికీ. మాల్ లోనే ఉండి, బయటకు వెళ్లడానికి నిరాకరించిన ఒక యువతిని బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేశారు.
Bengaluru crime news: బెంగళూరుకు చెందిన ఒక యువతి కోరమంగలలోని ఒక మాల్ కు వెళ్లి అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా బయటికి వెళ్లడానికి నిరాకరించడం తో మాల్ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. అక్కడికి చేరుకున్న పోలీసులు ఆ యువతని మాల్ లో నుంచి బయటికి పంపించడానికి ప్రయత్నించారు అందుకు నిరాకరించిన ఆ యువతి పోలీసులపైనే దాడికి ప్రయత్నం చేసింది. దాంతో ఆ యువతిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆమెను పోలీస్ స్టేషన్ కు తీసుకువెళ్లారు.
పోలీసులపై దాడి
పోలీస్ స్టేషన్ లో పోలీసులు ఆ యువతిని ప్రశ్నించారు. మాల్ సిబ్బంది ఏమైనా దురుసుగా, తప్పుగా ప్రవర్తించారా? అని ఆ యువతిని ప్రశ్నించారు. ఆ ప్రశ్నలకు సూటిగా సమాధానమివ్వకుండా.. ఆ యువతి పోలీసులపైనే దాడికి దిగింది. స్టేషన్ నుంచి పారిపోవడానికి ప్రయత్నించింది. ఆమెను అడ్డుకోవడానికి ప్రయత్నించిన ఒక మహిళా ఎస్సై చేతిని కొరికేసింది. దాంతో ఆ యువతిని అరెస్టు చేసి జ్యుడీషియల్ కస్టడీకి పంపించారు.
మాల్ లో షో చూసి
ఈ ఘటన శనివారం తెల్లవారుజామున జరిగింది. ఆమెను దావనగెరెకు చెందిన యువతిగా గుర్తించారు. బెంగళూరులో ఉద్యోగం చేస్తూ కోరమంగలలో ఒక పీజీ హాస్టల్ లో ఉంటోంది. కోరమంగల లోని నెక్సస్ మాల్ లో శుక్రవారం రాత్రి 10:30 గంటల సమయంలో నన్ 2 షో ఉంది. అ షో కు వెళ్లిన ఆ యువతి షో ముగిసిన తర్వాత కూడా అదే మాల్ లో తెల్లవారు జాము 2.30 గంటల వరకు ఉండిపోయింది. చివరకు మాల్ ను మూసేసే సమయం కావడంతో సిబ్బంది ఆమెను బయటికి వెళ్లాలని కోరారు. అందుకు నిరాకరించిన ఆ యువతి వారిపై దూషణలకు దిగింది. ఆమెను బయటకు పంపించడానికి వచ్చిన పోలీసులపై కూడా దాడికి దిగింది. చివరకు ఆమెను అదుపులోకి తీసుకుని స్టేషన్ కు తరలించారు. ఆమె మానసిక పరిస్థితి పై అనుమానాలు ఉన్నాయని పోలీసులు తెలిపారు. ఆమెను ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించామని వెల్లడించారు. ఆ యువతిపై ఐపిసి 353, 323, 324, 504 సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు.