menstrual leave: మహిళలకు రుతుస్రావ సెలవు ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం; అన్ని జాబ్స్ కు వర్తిస్తుందని స్పష్టీకరణ-odisha govt announces one day menstrual leave for women in all jobs ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Menstrual Leave: మహిళలకు రుతుస్రావ సెలవు ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం; అన్ని జాబ్స్ కు వర్తిస్తుందని స్పష్టీకరణ

menstrual leave: మహిళలకు రుతుస్రావ సెలవు ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం; అన్ని జాబ్స్ కు వర్తిస్తుందని స్పష్టీకరణ

HT Telugu Desk HT Telugu
Aug 15, 2024 06:15 PM IST

ఒడిశా రాష్ట్రంలో మహిళలకు నెలకు ఒక రోజు రుతుస్రావ సెలవు విధానాన్ని ప్రభుత్వం గురువారం ప్రకటించింది. ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో పనిచేస్తున్న మహిళలు అందరికీ ఈ సెలవు విధానం వర్తిస్తుందని స్పష్టం చేసింది.

మహిళలకు రుతుస్రావ సెలవు ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం
మహిళలకు రుతుస్రావ సెలవు ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం

ప్రభుత్వ, ప్రైవేటు రంగంలోని అన్ని ఉద్యోగాల్లో మహిళలకు నెలలో ఒక రోజు నెలసరి సెలవు విధానాన్ని ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం గురువారం ప్రకటించింది. కటక్ లో జరిగిన జిల్లా స్థాయి స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ఒడిశా డిప్యూటీ సీఎం ప్రభావతి పరిదా ఈ ప్రకటన చేశారు. రుతుచక్రం మొదటి లేదా రెండవ రోజున పని నుండి సెలవు తీసుకోవడానికి అర్హులైన మహిళా ఉద్యోగులకు ఒక రోజు రుతుక్రమ సెలవు విధానం తక్షణమే అమల్లోకి వస్తుంది.

పెయిడ్ మెన్స్ట్రువల్ లీవ్ పాలసీ

రుతుస్రావం అయ్యే వారందరికీ పెయిడ్ మెన్స్ట్రువల్ లీవ్ పాలసీని అమలు చేయాలనే దీర్ఘకాలిక డిమాండ్ నేపథ్యంలో ఒడిశా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అన్ని భాగస్వామ్య పక్షాలను సంప్రదించిన తర్వాత పెయిడ్ మెన్స్ట్రువల్ లీవ్ పాలసీని రూపొందించే అంశాన్ని పరిశీలించాలని సుప్రీంకోర్టు జూలై 8న కేంద్రాన్ని కోరింది. అయితే, వేతనంతో కూడిన రుతుస్రావ సెలవును తప్పనిసరి చేసే యోచనలో కేంద్రం ప్రస్తుతానికి లేదు.

ఈ రాష్ట్రాల్లో రుతుస్రావ సెలవు ఇప్పటికే ఉంది..

కేరళ, బీహార్ రాష్ట్రాల్లో ఈ మెన్స్ట్రువల్ లీవ్ విధానం ఇప్పటికే అమల్లో ఉంది. ఇప్పుడు ఈ జాబితాలో ఒడిశా కూడా చేరింది. ఇదిలావుండగా, ఈ విధానాన్ని దేశవ్యాప్తంగా అమలు చేసే ఆలోచన లో కేంద్ర ప్రభుత్వం లేదు. రుతుస్రావ సెలవుల అంశంపై లోక్ సభలో కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి అన్నపూర్ణాదేవి లిఖితపూర్వక సమాధానమిస్తూ, ప్రస్తుతం అన్ని కార్యాలయాలకు వేతనంతో కూడిన రుతుస్రావ సెలవులను కల్పించే ప్రతిపాదన ఏదీ ప్రభుత్వ పరిశీలనలో లేదని చెప్పారు.

సుప్రీంకోర్టు సూచన

తప్పనిసరి ప్రసూతి సెలవుల విధానానికి నమూనా విధానాన్ని రూపొందించడానికి సంబంధిత భాగస్వాములతో చర్చలు జరపాలని సుప్రీంకోర్టు జూలైలో కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ సందర్భంగా.. మహిళా ఉద్యోగులకు రుతుస్రావం సెలవు కోరుతూ దాఖలైన పిటిషన్ ను కూడా పరిగణనలోకి తీసుకోవాలన్న అభ్యర్థనను సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ విధానం వల్ల యజమానులు మహిళలను ఉద్యోగాల్లోకి తీసుకోవడాన్ని నిరోధించే అవకాశం ఉందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది.

చాన్నాళ్లుగా డిమాండ్

రుతు స్రావ సెలవు డిమాండ్ భారత్ లో చాన్నాళ్లుగా ఉంది. రుతుస్రావం అంశం గురించి బహిరంగంగా మాట్లాడడమే తప్పనే ధోరణి ఇంకా సమాజంలో నెలకొని ఉంది. చాలా మంది మహిళలు వారి పీరియడ్స్ సమయంలో అసౌకర్యం, ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఇటీవల రుతుస్రావ సెలవులను మహిళల ఆరోగ్యానికి చట్టబద్ధమైన, అవసరమైన అంశంగా గుర్తించే దిశగా అడుగులు పడుతున్నాయి.