Smriti Irani: ‘‘మహిళల రుతుచక్రం వివరాలు యజమానులకు ఎందుకు తెలియాలి’’: స్మృతి ఇరానీ-why womens menstrual cycle should be known to employers smriti irani ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Smriti Irani: ‘‘మహిళల రుతుచక్రం వివరాలు యజమానులకు ఎందుకు తెలియాలి’’: స్మృతి ఇరానీ

Smriti Irani: ‘‘మహిళల రుతుచక్రం వివరాలు యజమానులకు ఎందుకు తెలియాలి’’: స్మృతి ఇరానీ

HT Telugu Desk HT Telugu
Dec 22, 2023 09:26 PM IST

Smriti Irani: రుతుస్రావం సందర్భంగా మహిళలకు తప్పని సరి సెలవు ఇవ్వడంపై కేంద్రమంత్రి స్మృతి ఇరానీ మరోసారి స్పందించారు. తన వాదనను సమర్ధించుకుంటూ, మహిళల రుతుచక్రం వివరాలు యజమానులకు ఎందుకు తెలియాలని ప్రశ్నించారు.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం (PTI)

Smriti Irani: కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ పీరియడ్ లీవ్ అంశంపై తన వైఖరిని మరోసారి స్పష్టం చేశారు. ఒక మహిళ యొక్క పీరియడ్ లీవ్ ఆమె యజమానికి ఎందుకు తెలియాలని అని ప్రశ్నించారు.

పెయిడ్ పీరియడ్ లీవ్స్ ఆలోచన లేదు

పెయిడ్ పీరియడ్ లీవ్స్ (PERIOD LEAVES) కోసం ప్రభుత్వం ఎలాంటి విధానాన్ని తీసుకురావడం లేదని స్మృతి ఇరానీ ఇటీవల పార్లమెంట్ లో ప్రకటన చేశారు. ఈ సందర్భంగా ఆమె చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. రుతుస్రావం అనేది మహిళల జీవితంలో సహజమైన భాగమని, అది వైకల్యం కాదని ఆమె వ్యాఖ్యానించారు. దీనిపై ఆమె శుక్రవారం మరోసారి వివరణ ఇచ్చారు.

వివక్ష, వేధింపులకు అవకాశం

పీరియడ్ లీవ్ వల్ల పని ప్రదేశాల్లో మహిళలు వివక్షను ఎదుర్కొనే అవకాశముందని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ (Smriti Irani) తెలిపారు. ‘‘ముఖ్యంగా ప్రైవేటు సంస్థల్లో ఈ సెలవులను పొందడం కోసం మహిళలు తమ రుతుచక్ర (menstrual cycle) వివరాలను హెచ్ ఆర్ కు, అకౌంట్స్ విభాగాలకు తెలియజేయాల్సి ఉంటుంది. దీనివల్ల ఆమె వివక్షకు, వేధింపులకు గురయ్యే ముప్పు ఉంటుంది. ఇప్పటికే పని ప్రదేశాల్లో ఎన్నో వేధింపులు ఎదుర్కొంటున్న మహిళలకు, ఇలాంటి చర్యల ద్వారా మరిన్ని వేధింపులు, వివక్ష ఎదుర్కొనే పరిస్థితులు కల్పిస్తున్నాం. ఒక మహిళ తన రుతు చక్ర వివరాలను యజమానికి తెలియజేయాల్సిన అవసరమేంటి?’’ అని ఆమె ప్రశ్నించారు.

అడ్డంకి అనే అర్థంలో వాడాను

పార్లమెంటులో తాను ఇచ్చిన సమాధానంలో ఇంగ్లీష్ లో హ్యాండిక్యాప్ (HANDICAP) అనే పదాన్ని ఉపయోగించానని, వైకల్యం అనే అర్థంలో కాకుండా, అడ్డంకి అనే అర్థంలో ఆ పదాన్ని వాడానని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ (Smriti Irani) వివరించారు. అంగవైకల్యం అని తాను అనలేదన్నారు. రుతుస్రావం (menstrual cycle) సమయంలో భరించలేని నొప్పి కలిగే వారు వెంటనే డాక్టర్ ను సంప్రదించడం మంచిదన్నారు. ఉద్యోగస్తులైన మహిళలు రుతుస్రావ సమయంలో సమస్యలు ఎదుర్కొంటున్నట్లయితే, వారు చట్టబద్ధంగా మెడికల్ లీవ్ తీసుకోవచ్చని సూచించారు.

Whats_app_banner