Menstrual maternity leaves to students: విద్యార్థినులకు రుతుచక్రం, ప్రసూతి సెలవులు.. కేరళ ప్రభుత్వ నిర్ణయం-menstrual maternity leaves to students of higher educational institutes kerala government declares ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Menstrual Maternity Leaves To Students: విద్యార్థినులకు రుతుచక్రం, ప్రసూతి సెలవులు.. కేరళ ప్రభుత్వ నిర్ణయం

Menstrual maternity leaves to students: విద్యార్థినులకు రుతుచక్రం, ప్రసూతి సెలవులు.. కేరళ ప్రభుత్వ నిర్ణయం

HT Telugu Desk HT Telugu
Jan 19, 2023 11:03 PM IST

Menstrual, maternity leaves to students: కేరళ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థినులకు ఉపయుక్తమైన గొప్ప నిర్ణయాన్ని ప్రకటించింది.

విద్యార్థులకు ఉపయుక్తమైన నిర్ణయం ప్రకటించిన కేరళ ముఖ్యమంత్రి
విద్యార్థులకు ఉపయుక్తమైన నిర్ణయం ప్రకటించిన కేరళ ముఖ్యమంత్రి (PTI)

తిరువనంతపురం, జనవరి 19: ఉన్నత విద్యాశాఖ పరిధిలోని అన్ని విద్యాసంస్థల్లోని విద్యార్థినులు అందరికీ రుతుచక్రం, ప్రసూతి సెలవులు మంజూరు చేయాలని కేరళ ప్రభుత్వం నిర్ణయించింది. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ గురువారం ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రభుత్వ నిర్ణయాన్ని విజయన్ తన ట్విట్టర్ హ్యాండిల్, ఫేస్‌బుక్ పేజీలో ప్రకటించారు.

ఇలాంటి మహిళా అనుకూల అడుగు వేయడం దేశంలోనే ఇదే ప్రథమమని, సమాజంలో లింగ న్యాయం జరగాలనే వామపక్ష ప్రభుత్వ నిబద్ధతకు ఇది నిదర్శనమని విజయన్ అన్నారు.

‘మరోసారి కేరళ దేశానికి ఒక నమూనాగా నిలుస్తుంది. మా ఉన్నత విద్యా శాఖ పరిధిలోని అన్ని విద్యా సంస్థల్లోని విద్యార్థినులకు రుతుక్రమం, ప్రసూతి సెలవులు మంజూరు అవుతాయి. లింగ-న్యాయమైన సమాజాన్ని సాధించడానికి ఎల్‌డిఎఫ్ ప్రభుత్వ నిబద్ధతను పునరుద్ఘాటిస్తున్నాం..’ అని ఆయన ట్వీట్ చేశారు.

రుతుచక్రం సాధారణ జీవ ప్రక్రియ అయినప్పటికీ మహిళల్లో చాలా మానసిక ఒత్తిడి, శారీరక అసౌకర్యం కలుగుతుందని ఆయన అన్నారు. అందువల్ల విద్యార్థినులకు హాజరు నిబంధనలో రెండు శాతం సడలింపు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందని ఆయన తన ఫేస్‌బుక్ పోస్ట్‌లో తెలిపారు. ఉన్నత విద్యాశాఖ పరిధిలోని యూనివర్సిటీలు, కాలేజీల్లో విద్యార్థినుల కోసం ఒక రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి మహిళా అనుకూల నిర్ణయం తీసుకోవడం దేశంలోనే తొలిసారి అని ఆయన అన్నారు.

18 ఏళ్లు నిండిన విద్యార్థినులకు గరిష్టంగా 60 రోజుల ప్రసూతి సెలవులను అనుమతించాలని ఉన్నత విద్యాశాఖ నిర్ణయించిందని ఆయన తెలిపారు. కొచ్చిన్ యూనివర్శిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (సీయూఎస్‌ఏటీ) తన విద్యార్థులకు రుతుక్రమ సెలవులు అందిస్తోందని, డిపార్ట్‌మెంట్ పరిధిలోని అన్ని రాష్ట్ర విశ్వవిద్యాలయాలలో ఇదే విధానాన్ని అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు ఉన్నత విద్యా మంత్రి ఆర్.బిందు సోమవారం తెలిపారు.

యూనివర్శిటీకి చెందిన ఎస్‌ఎఫ్‌ఐ నేతృత్వంలోని విద్యార్థి సంఘం చేసిన ఫిర్యాదు మేరకు సీయూఎస్ఏటీ ఈ నిర్ణయం తీసుకుంది. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న విద్యార్థుల డిమాండ్‌ను పరిగణనలోకి తీసుకున్న వర్సిటీ హాజరులో రెండు శాతం అదనపు మినహాయింపు ప్రకటించింది. గత ఏడాది డిసెంబరులో మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం (ఎంజీయూ) 18 సంవత్సరాలు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకు 60 రోజుల ప్రసూతి సెలవులను మంజూరు చేయాలని నిర్ణయించింది. తద్వారా వారు ఎటువంటి ఆటంకాలు లేకుండా చదువు కొనసాగించవచ్చు.