2024 LS polls: కాంగ్రెస్ కు మరో షాక్; పంజాబ్ లో ఒంటరిగానే పోటీ అంటున్న ఆప్
2024 LS polls: రానున్న లోక్ సభ ఎన్నికల్లో అధికార బీజేపీని ఓడించడం లక్ష్యంతో ఏకమైన విపక్ష కూటమి ‘ఇండియా’ లో అప్పుడే లొసుగులు ప్రారంభమయ్యాయి.
2024 LS polls: 2024 లోక్ సభ ఎన్నికల్లో పశ్చిమబెంగాల్ లో ఒంటరిగానే పోటీ చేయబోతున్నామని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ మమత బెనర్జీ ప్రకటించి.. విపక్ష కూటమిలోని ప్రధాన పార్టీ కాంగ్రెస్ కు మొదటి షాక్ ను ఇచ్చింది.
పంజాబ్ లో కూడా..
తాజాగా, పంజాబ్ లో కూడా ఆమ్ ఆద్మీ పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుందని ఆ పార్టీ నేత, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ బుధవారం స్పష్టం చేశారు. దాంతో, కాంగ్రెస్ కు ఒకే రోజులో రెండు షాక్స్ తగిలాయి. 2024 లోక్ సభ ఎన్నికల్లో పంజాబ్ లో అధికార ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోదని పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ స్పష్టం చేశారు. పంజాబ్ లోని మొత్తం 13 లోక్ సభ సీట్లలో ఆమ్ ఆద్మీ పార్టీ పోటీ చేస్తుందని తేల్చి చెప్పారు. 2024 లోక్ సభ ఎన్నికల్లో పంజాబ్ లో ఆప్ మొత్తం 13 సీట్లను గెల్చుకుంటుందని బుధవారం భగవంత్ మాన్ ధీమా వ్యక్తం చేశారు.
చర్చలు జరగుతున్నాయి..
ఈ ఏడాది ఏప్రిల్-మే నెలల్లో జరగనున్న లోక్ సభ ఎన్నికల్లో ఆప్, కాంగ్రెస్ ల మధ్య సీట్ల పంపకాలపై చర్చలు జరుగుతున్న నేపథ్యంలో మన్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. కాగా, పంజాబ్ లో సీట్ల పంపకాల చర్చలను ఆప్, కాంగ్రెస్ లు నిలిపివేసినట్లు తెలుస్తోంది. మన్ వ్యాఖ్యలు రెండు పార్టీల మధ్య సీట్ల పంపకాల చర్చలకు ఎదురుదెబ్బగా భావిస్తున్నారు. ఆప్, తృణమూల్ కాంగ్రెస్ రెండూ విపక్ష ఇండియా కూటమిలో భాగంగానే ఉన్నాయి.