UGC news: నెట్ స్కోర్ తో పీహెచ్ డీ అడ్మిషన్లకు యూజీసీ అనుమతి
NET score for PhD admissions: పీహెచ్ డీలో ప్రవేశానికి నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ (NET) స్కోర్ ను కూడా పరిగణనలోకి తీసుకోవచ్చని యూజీసీ స్పష్టం చేసింది. అభ్యర్థి మార్కులతో పాటు నెట్ స్కోర్ ను పర్సంటైల్ లో ప్రకటిస్తామని తెలిపింది.
NET score for PhD admissions: వివిధ విశ్వవిద్యాలయాలు/హెచ్ఈఐలు నిర్వహించే ప్రవేశ పరీక్షల స్థానంలో పీహెచ్ డీ ప్రోగ్రాముల్లో ప్రవేశానికి విద్యార్థులు యూజీసీ నెట్ స్కోర్ ను ఉపయోగించుకోవచ్చని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC) బుధవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది.
జాతీయ విద్యా విధానం
నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 (NEP 2020) అమలులో భాగంగా పీహెచ్ డీ ప్రవేశాల కోసం ఒక జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షను ఏర్పాటు చేయడం కోసం ప్రత్యేకంగా నిపుణుల కమిటీని ఏర్పాటు చేశామని యూజీసీ (UGC) కార్యదర్శి ప్రొఫెసర్ మనీష్ ఆర్ జోషి తెలిపారు. దేశవ్యాప్తంగా పీహెచ్ డీ ప్రవేశాలకు ఒకే జాతీయ స్థాయి ప్రవేశ పరీక్ష ఉండడం వల్ల విద్యార్థులకు ఉపయోగకరమన్నారు. 2024 మార్చి 13న జరిగిన కమిటీ సిఫార్సుల మేరకు 2024-2025 విద్యాసంవత్సరం నుంచి వివిధ విశ్వవిద్యాలయాలు/హెచ్ఈఐలు నిర్వహించే ప్రవేశ పరీక్షల స్థానంలో విద్యార్థులు పీహెచ్డీ ప్రోగ్రాముల్లో ప్రవేశం పొందేందుకు నెట్ స్కోరును ఉపయోగించుకోవచ్చని నిర్ణయించారు.
ఈ మూడు కేటగిరీలను అర్హత
యూజీసీ నెట్ (UGC NET) పరీక్ష ద్వారా ఈ కింది కేటగిరీలకు అర్హత లభిస్తుంది. అవి
- జేఆర్ఎఫ్ తో పీహెచ్ డీ లో ప్రవేశానికి అర్హత, అసిస్టెంట్ ప్రొఫెసర్ గా నియామకం.
- జేఆర్ఎఫ్ లేకుండా పీహెచ్ డీ లో ప్రవేశం, అసిస్టెంట్ ప్రొఫెసర్ గా నియామకం.
- పీహెచ్ డీ ప్రోగ్రామ్ లో ప్రవేశానికి మాత్రమే అర్హత. వీరికి జేఆర్ఎఫ్ కానీ, అసిస్టెంట్ ప్రొఫెసర్ గా నియామకం కానీ లభించదు.
ఇంటర్వ్యూకి 30 శాతం వెయిటేజీ
2, 3 కేటగిరీల్లో అర్హత సాధించిన అభ్యర్థులకు పీహెచ్ డీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే పరీక్షకు 70 శాతం, ఇంటర్వ్యూకు 30 శాతం వెయిటేజీ ఇస్తామని యూజీసీ తెలిపింది. నెట్ మార్కుల కంబైన్డ్ మెరిట్, ఇంటర్వ్యూ/వైవా వోసీలో వచ్చిన మార్కుల ఆధారంగా ప్రవేశం కల్పిస్తారు. కేటగిరీ 2, 3లో అభ్యర్థులు నెట్ లో సాధించిన మార్కులు పీహెచ్ డీలో ప్రవేశానికి ఏడాది పాటు చెల్లుబాటు అవుతాయి.