Mukesh Ambani threat: ముకేశ్ అంబానీని చంపేస్తామని బెదిరించిన తెలంగాణ వ్యక్తి అరెస్ట్
Mukesh Ambani threat: ప్రముఖ పారిశ్రామికవేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీని చంపేస్తామని బెదిరిస్తూ మెయిల్ చేసిన ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిలో ఒకరు తెలంగాణలోని వరంగల్ కు చెందిన వ్యక్తి.
Mukesh Ambani threat: రూ. 400 కోట్లు ఇవ్వకపోతే చంపేస్తామని ముకేశ్ అంబానీని బెదిరిస్తూ మెయిల్స్ చేసిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు శనివారం అదుపులోకి తీసుకున్నారు. పెద్ద మొత్తంలో డబ్బులు ఇవ్వాలని వారు గతవారం వరుసగా మూడు రోజుల పాటు మెయిల్స్ చేసి బెదిరించారు.
వరంగల్ వాసి..
ముకేశ్ అంబానీని మెయిల్ లో బెదిరించిన వారిలో తెలంగాణ లోని వరంగల్ కు చెందిన వ్యక్తి కూడా ఉన్నారు. వరంగల్ కు చెందిన 19 ఏళ్ల గణేశ్ రమేశ్ వనపర్తి ఈ మెయిల్స్ పంపినట్లు గుర్తించిన ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు శనివారం వరంగల్ లో అతడిని అదుపులోకి తీసుకున్నారు. మరో నిందితుడు గుజరాత్ కు చెందిన 21 ఏళ్ల షాదాబ్ ఖాన్ గా గుర్తించారు. శనివారం అతడిని కూడా అదుపులోకి తీసుకున్నారు. ఈ ఇద్దరు నిందితులు ముకేశ్ అంబానీకి చెందిన అధికారిక మెయిల్ ఐడీకి ఈ బెదిరింపు మెయిల్స్ చేశారు. అక్టోబర్ 27న చేసిన మొదటి మెయిల్ లో రూ. 20 కోట్లు డిమాండ్ చేశారు. ఆ తరువాత మెయిల్ లో, మొదటి మెయిల్ ను నిర్లక్ష్యం చేసినందుకు రూ. 200 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. చివరకు రూ. 400 కోట్లు చెల్లించకపోతే, ముకేశ్ అంబానీని, అతడి కుటుంబాన్ని చంపేస్తామని మరో మెయిల్ లో హెచ్చరించారు.
వేర్వేరు ఐడీలతో..
ఈ ఇద్దరు రెండు వేర్వేరు మెయిల్ ఐడీలను ఉపయోగించి ఈ బెదిరింపు మెయిల్స్ చేసినట్లు ముంబై క్రైం బ్రాంచ్ పోలీసులు గుర్తించారు. గణేశ్ వనపర్తిని పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టగా, అతడిని నవంబర్ 8 వరకు పోలీస్ కస్టడీకి కోర్టు అనుమతించింది. కాగా, గుజరాత్ కు చెందిన షాదాబ్ ఖాన్ ఉన్నత చదువులు చదివిన విద్యావంతుడు అని పోలీసులు తెలిపారు. నిందితులిద్దరిపై భారతీయ శిక్షాస్మృతి (IPC)లోని సంబంధిత సెక్షన్లు 387, 506 (2) (నేరపూరిత బెదిరింపు) కింద కేసులు నమోదు చేశారు. దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.
గతంలో కూడా..
గతంలో కూడా ముకేశ్ అంబానీపై, అంబానీ కుటుంబంపై ఇలాంటి హెచ్చరికలు చాలా వచ్చాయి. 2022 లో రిలయన్స్ గ్రూప్ ఆధ్వర్యంలోని సర్ హెచ్ ఎన్ ఫౌండేషన్ హాస్పిటల్ కు ఇలాంటి బెదిరింపు ఫోన్ కాల్ వచ్చింది. ఆ ఆసుపత్రిని పేల్చేస్తున్నామని ఆ కాల్ లో దుండగుడు బెదిరించాడు. ఆ కాల్ చేసింది ముంబైకి చెందిన ఒక నగల వ్యాపారి అని గుర్తించిన పోలీసులు.. అతడిని అరెస్ట్ చేశారు. అంతకుముందు, 2021 ఫిబ్రవరిలో, ముకేశ్ అంబానీ నివాసం ఆంటీలియా (Antilia) సమీపంలో అనుమానాస్పదంగా పార్క్ చేసి ఉన్న ఒక ఎస్ యూ వీని పోలీసులు గుర్తించారు. పరీక్షించగా, ఆ వాహనంలో భారీగా పేలుడు పదార్ధాలు లభించాయి.