Mukesh Ambani: చంపేస్తామని ముకేశ్ అంబానీకి మరో బెదిరింపు మెయిల్; ‘మా వద్ద బెస్ట్ షార్ప్ షూటర్ ఉన్నాడ’ని హెచ్చరిక
Death threat to Mukesh Ambani: ప్రముఖ పారిశ్రామిక వేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ కి మరో బెదిరింపు మెయిల్ వచ్చింది. రూ. 400 కోట్లు ఇవ్వనట్లైతే, చంపేస్తామని తాజా మెయిల్ లో దుండగుడు హెచ్చరించాడు. తమ వద్ద దేశంలోనే బెస్ట్ షార్ప్ షూటర్ ఉన్నాడని ఆ మెయిల్ లో ముకేశ్ అంబానీని హెచ్చరించాడు.
Death threat to Mukesh Ambani: అడిగినంత డబ్బు ఇవ్వకపోతే చంపేస్తామని ముకేశ్ అంబానీకి గత నాలుగు రోజుల్లో మూడు మెయిల్స్ వచ్చాయి. ఈ మూడు కూడా ఒకే మెయిల్ ఐడీ నుంచి రావడం గమనార్హం. తమ వద్ద దేశంలోనే బెస్ట్ షార్ప్ షూటర్ (best shooter) ఉన్నాడని ఆ మెయిల్స్ లో దుండగుడు హెచ్చరించాడు.
రూ. 20 కోట్ల నుంచి..
ముకేశ్ అంబానీకి అక్టోబర్ 27వ తేదీన తొలి బెదిరింపు మెయిల్ వచ్చింది. రూ. 20 కోట్లు ఇవ్వకపోతే, కాల్చి చంపేస్తామని ఆ మెయిల్ లో హెచ్చరించారు. దాంతో, ముకేశ్ అంబానీ సెక్యూరిటీ ఆఫీసర్ ముంబైలోని స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. మర్నాడు, అదే ఈ మెయిల్ ఐడీ నుంచి మరో మెయిల్ వచ్చింది. అందులో, క్రితం రోజు నాటి తమ హెచ్చరికను పట్టించుకోనందున, చెల్లించాల్సిన మొత్తాన్ని రూ. 200 కోట్లకు పెంచుతున్నట్లు ఆ దుండగుడు పేర్కొన్నాడు. రూ. 200 కోట్లు తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశాడు.
మూడో మెయిల్..
తాజాగా, అక్టోబర్ 31న అదే ఐడీ నుంచి మరో మెయిల్ వచ్చింది. అందులో ఆ దుండగుడు తను డిమాండ్ చేసిన మొత్తాన్ని రూ. 400 కోట్లకు పెంచాడు. తమ హెచ్చరికలను పట్టించుకోనందున, ఇప్పుడు రూ. 200 కోట్లు కాకుండా, రూ. 400 కోట్లు తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశాడు. ఆ మొత్తాన్ని చెల్లించకపోతే ముకేశ్ అంబానీని కాల్చి చంపేస్తామని ఆ మెయిల్ లో హెచ్చరించాడు. భారత్ లోనే అత్యుత్తమ షార్ప్ షూటర్ తమ వద్ద వద్ద ఉన్నాడని గుర్తు చేశాడు.
గతంలో కూడా..
గతంలో కూడా ముకేశ్ అంబానీపై, అంబానీ కుటుంబంపై ఇలాంటి హెచ్చరికలు చాలా వచ్చాయి. 2022 లో రిలయన్స్ గ్రూప్ ఆధ్వర్యంలోని సర్ హెచ్ ఎన్ ఫౌండేషన్ హాస్పిటల్ కు ఇలాంటి బెదిరింపు ఫోన్ కాల్ వచ్చింది. ఆ ఆసుపత్రిని పేల్చేస్తున్నామని ఆ కాల్ లో దుండగుడు బెదిరించాడు. ఆ కాల్ చేసింది ముంబైకి చెందిన ఒక నగల వ్యాపారి అని గుర్తించిన పోలీసులు.. అతడిని అరెస్ట్ చేశారు. అంతకుముందు, 2021 ఫిబ్రవరిలో, ముకేశ్ అంబానీ నివాసం ఆంటీలియా (Antilia) సమీపంలో అనుమానాస్పదంగా పార్క్ చేసి ఉన్న ఒక ఎస్ యూ వీని పోలీసులు గుర్తించారు. పరీక్షించగా, ఆ వాహనంలో భారీగా పేలుడు పదార్ధాలు లభించాయి.