Samvidhaan Hatya Diwas: జూన్ 25ను 'సంవిధాన్ హత్య దివస్'గా ప్రకటించిన మోదీ ప్రభుత్వం
ఎమర్జెన్సీ విధించిన జూన్ 25వ తేదీని 'సంవిధాన్ హత్య దివస్'గా భారత ప్రభుత్వం ప్రకటించింది. 1975 జూన్ 25న అప్పటి ప్రధాని, కాంగ్రెస్ నాయకురాలు ఇందిరాగాంధీ దేశవ్యాప్తంగా అత్యవసర స్థితి ప్రకటించారు. ఈ ఎమర్జెన్సీ 1977 మార్చి 21 వరకు, అంటే 21 నెలల పాటు కొనసాగింది.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ ప్రభుత్వం జూన్ 25 ను "సంవిధాన్ హత్యా దివస్ "గా ప్రకటించింది. నాటి ఇందిరా గాంధీ ప్రభుత్వం 1975 జూన్ 25న ఎమర్జెన్సీ ప్రకటించి రాజ్యాంగాన్ని హత్య చేసిందని, అందువల్ల జూన్ 25వ తేదీని సంవిధాన్ హత్యా దివస్ గా పాటించాలని నిర్ణయించామని కేంద్రం వివరించింది. 1975 జూన్ 25న అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ ఎమర్జెన్సీని ప్రకటించారని కేంద్ర హోంశాఖ శుక్రవారం విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్లో పేర్కొంది. 1975 జూన్ 25న అప్పటి ప్రధాని, కాంగ్రెస్ నాయకురాలు ఇందిరాగాంధీ 21 నెలల పాటు జాతీయ ఎమర్జెన్సీ విధించారు.
మోదీ స్పందన
'సంవిధాన్ హత్య దివస్' పాటించడం భారత రాజ్యాంగాన్ని తుంగలో తొక్కినప్పుడు ఏమి జరుగుతుందో గుర్తు చేస్తుందని ప్రధాని మోదీ అన్నారు. ఎమర్జెన్సీ వల్ల నష్టపోయిన ప్రతి ఒక్కరికీ నివాళులు అర్పించే రోజు కూడా ఇదేనని, భారత చరిత్రలో కాంగ్రెస్ చీకటి దశను ఈ ‘రాజ్యాంగ హత్యా దినం’ ఆవిష్కరించిందని ప్రధాని అన్నారు.
ఎమర్జెన్సీ బాధితులకు నివాళిగా..
ఎమర్జెన్సీ కాలంలో అధికార దుర్వినియోగానికి వ్యతిరేకంగా పోరాడిన వారందరికీ నివాళులు అర్పించేందుకు, అధికార దుర్వినియోగానికి ఏ విధంగానూ మద్దతివ్వవద్దని భారత ప్రజలను తిరిగి గుర్తు చేయడానికి ప్రతి సంవత్సరం జూన్ 25ను 'సంవిధాన్ హత్య దివస్'గా పాటించాలని నిర్ణయించామని కేంద్రం తెలిపింది. భారత ప్రజలకు రాజ్యాంగంపై, ప్రజాస్వామ్య శక్తిపై అచంచల విశ్వాసం ఉందని తెలిపింది.
జూన్ 25 సంవిధాన్ హత్యా దివస్
'సంవిధాన్ హత్యా దివస్' పాటించడం ద్వారా ప్రతి భారతీయుడిలో వ్యక్తిగత స్వేచ్ఛ, ప్రజాస్వామ్య రక్షణ అనే శాశ్వత జ్వాల సజీవంగా ఉంటుందని, తద్వారా కాంగ్రెస్ వంటి నియంతృత్వ శక్తులు ఆ భయానక పరిస్థితులను పునరావృతం చేయకుండా నిరోధించవచ్చని కేంద్ర హోం మంత్రి అమిత్ షా వ్యాఖ్యానించారు. 1975 జూన్ 25న అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ నియంతృత్వ ధోరణిని ప్రదర్శిస్తూ దేశంపై ఎమర్జెన్సీని విధించడం ద్వారా మన ప్రజాస్వామ్య ఆత్మను గొంతు నులిమి చంపేశారని అమిత్ షా తన ఎక్స్ పోస్ట్ లో పేర్కొన్నారు. తమ తప్పేమీ లేకుండా లక్షలాది మందిని జైళ్లలో పెట్టారని, మీడియా గొంతు నొక్కారని మండిపడ్డారు. అణచివేత ప్రభుత్వం చేతిలో వివరించలేని హింసను ఎదుర్కొన్నప్పటికీ ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించడానికి పోరాడిన లక్షలాది మంది స్ఫూర్తిని గౌరవించడానికి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని అమిత్ షా అన్నారు.
కాంగ్రెస్ స్పందన
1975లో ఇందిరాగాంధీ ప్రభుత్వం విధించిన ఎమర్జెన్సీని స్మరించుకుంటూ ఏటా జూన్ 25ను 'రాజ్యాంగ హత్యా దినం' గా జరుపుకుంటామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన కొద్ది గంటల్లోనే కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ ప్రధాని మోదీని టార్గెట్ చేస్తూ వరుస ట్వీట్లు చేశారు. 2024 జూన్ 4న భారత ప్రజలు ప్రధాని మోదీకి నిర్ణయాత్మక వ్యక్తిగత, రాజకీయ, నైతిక ఓటమిని అందించారని జైరాం రమేశ్ వ్యాఖ్యానించారు. అంతకుముందే పదేళ్ల పాటు ఆ నాన్ బయోలాజికల్ ప్రధాని అప్రకటిత ఎమర్జెన్సీని విధించారని విమర్శించారు. ఇప్పుడు ప్రచారం కోసం ఈ కార్యక్రమం చేపట్టారని ఆరోపించారు. ఇటీవల ముగిసిన పార్లమెంట్ సమావేశాల్లో స్పీకర్ ఓం బిర్లా ఎమర్జెన్సీ కాలాన్ని ఖండించగా, ఆ సమయంలో ప్రాణాలు కోల్పోయిన వారి జ్ఞాపకార్థం సభ రెండు నిమిషాలు మౌనం పాటించింది.