Jack Dorsey : 'ట్విట్టర్​ను మూసేస్తామని బెదిరించారు'- భారత ప్రజాస్వామ్యంపై డోర్సే విమర్శలు-indian govt said will shut down twitter jack dorsey questions democracy ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Jack Dorsey : 'ట్విట్టర్​ను మూసేస్తామని బెదిరించారు'- భారత ప్రజాస్వామ్యంపై డోర్సే విమర్శలు

Jack Dorsey : 'ట్విట్టర్​ను మూసేస్తామని బెదిరించారు'- భారత ప్రజాస్వామ్యంపై డోర్సే విమర్శలు

Sharath Chitturi HT Telugu
Jun 13, 2023 09:06 AM IST

Jack Dorsey on Indian government : భారత ప్రభుత్వం, దేశ ప్రజాస్వామ్యంపై విమర్శలు చేశారు ట్విట్టర్​ సహ వ్యవస్థాపకుడు జాక్​ డోర్సే. రైతు నిరసనల నేపథ్యంలో ప్రభుత్వం తమను ఒత్తిడికి గురి చేసిందని ఆరోపించారు.

'ట్విట్టర్​ను మూసేస్తామని బెదిరించారు'- భారత ప్రజాస్వామ్యంపై డోర్సె విమర్శలు
'ట్విట్టర్​ను మూసేస్తామని బెదిరించారు'- భారత ప్రజాస్వామ్యంపై డోర్సె విమర్శలు (REUTERS/Anushree Fadnavis//File Photo)

Jack Dorsey on Indian government : భారత దేశంలో ప్రజాస్వామ్య విలువలను ప్రశ్నిస్తూ.. కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు ట్విట్టర్​ సహ వ్యవస్థాపకుడు జాక్​ డోర్సే. రైతు నిరసనల నేపథ్యంలో.. ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న అకౌంట్లను బ్లాక్​ చేయాలని ట్విట్టర్​కు అనేక మార్లు అభ్యర్థనలు అందినట్టు వివరించారు. ఈ విషయంపై భారత ప్రభుత్వం ట్విట్టర్​ను ఒత్తిడికి గురిచేసినట్టు, అవసరమైతే సామాజిక మాధ్యమాన్ని నిషేధిస్తామని కూడా బెదిరించినట్టు పేర్కొన్నారు.

బ్రేకింగ్​ పాయింట్స్​ అనే యూట్యూబ్​ ఛానెల్​కు తాజాగా ఇంటర్వ్యూ ఇచ్చారు డోర్సే. ఈ నేపథ్యంలో ఇండియాలో ప్రజాస్వామ్యం గురించి మాట్లాడారు.

"రైతుల నిరసనలపై వస్తున్న సానుకూల స్పందనలను ట్విట్టర్​ నుంచి తొలగించాలని కేంద్రం మాకు చెప్పింది. లేకపోతే ఇండియాలో ట్విట్టర్​ను మూసేస్తామని హెచ్చరించింది. మా ఉద్యోగుల ఇళ్లపై రైడ్లు నిర్వహిస్తామని బెదిరించింది. రైడ్లు చేసింది కూడా! ఇది ఇండియా.. అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం!," అని వ్యాఖ్యానించారు ట్విట్టర్​ కో ఫౌండర్​.

2020లో మూడు వ్యవసాయ చట్టాలను ప్రవేశపెట్టింది కేంద్రం. దీనికి రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. లక్షలాది మంది రైతులు ఉద్యమించారు. 2021 నవంబర్​ వరకు ఆందోళనలు కొనసాగాయి. ఈ నేపథ్యంలో రైతులకు సామాజిక మాధ్యమాల్లో దేశవ్యాప్తంగా మద్దతు లభించింది. చివరికి దిగొచ్చిన ప్రభుత్వం.. రైతు చట్టాలను ఉపసంహరించుకుంది.

Jack Dorsey India democracy : జాక్​ డోర్సే మాటలు సోషల్​ మీడియాలో వైరల్​గా మారాయి. విపక్షాలు డోర్సే ఇంటర్వ్యూను ట్యాగ్​ చేస్తూ.. పోస్టులు చేస్తున్నారు. మోదీ ప్రభుత్వంపై విమర్శలు కురిపిస్తున్నాయి.

డోర్సే తాజా వ్యాఖ్యలపై కేంద్రం స్పందించింది. ఆయన చెప్పినవి తప్పులని పేర్కొంది.

“డోర్సే చెప్పినవి పచ్చి అబద్ధాలు.  ఇంకా చెప్పాలంటే.. ట్విట్టర్​ చాలా సార్లు భారత చట్టాలను ఉల్లంఘించింది. 2020- 2022 మధ్యలో ఇలా చేసింది. ఆ తర్వాతే ట్విట్టర్​ చట్టలను పాటించడం మొదలుపెట్టింది. ట్విట్టర్​లో ఎవరు జైలుకు వెళ్లలేదు. ట్విట్టర్​ను మూసివేయలేదు.” అని కేంద్ర స్కిల్​ డెవలప్​మెంట్​శాఖ మంత్రి రాజీవ్​ చంద్రశేఖర్​ తెలిపారు.

Whats_app_banner

సంబంధిత కథనం