Lawrence Bishnoi : సల్మాన్‌ ఖాన్‌కు వార్నింగ్ ఇచ్చిన లారెన్స్ బిష్ణోయ్ సోదరుడు..!-lawrence bishnoi brother anmol threat to salman khan know his demands here ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Lawrence Bishnoi : సల్మాన్‌ ఖాన్‌కు వార్నింగ్ ఇచ్చిన లారెన్స్ బిష్ణోయ్ సోదరుడు..!

Lawrence Bishnoi : సల్మాన్‌ ఖాన్‌కు వార్నింగ్ ఇచ్చిన లారెన్స్ బిష్ణోయ్ సోదరుడు..!

Anand Sai HT Telugu
Nov 05, 2024 11:02 AM IST

Lawrence Bishnoi Brother : సల్మాన్ ఖాన్‌కు లారెన్స్ బిష్ణోయ్ సోదరుడు వార్నింగ్ ఇచ్చాడు. ఆలయానికి వెళ్లి క్షమాపణాలు చెప్పాలని పోలీసులకు వచ్చిన సందేశంలో ఉంది.

సల్మాన్ ఖాన్, లారెన్స్ బిష్ణోయ్
సల్మాన్ ఖాన్, లారెన్స్ బిష్ణోయ్

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్‌కు మరోసారి బెదిరింపులు వచ్చాయి. ఈసారి గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్ సోదరుడు అన్మోల్ నుంచి బెదిరింపు వచ్చినట్లు చెబుతున్నారు. అయితే దీనిపై పోలీసులు ఇంకా అధికారికంగా ఏమీ చెప్పలేదు. గతంలో ఎన్సీపీ నేత జీషాన్ సిద్ధిఖీ, సల్మాన్‌లకు రూ.2 కోట్లు డిమాండ్ చేస్తూ బెదిరింపులు వచ్చాయి.

తాజాగా ఇది లారెన్స్ సోదరుడు పంపిన సందేశం అని ముంబై ట్రాఫిక్ కంట్రోల్ రూమ్‌కు బెదిరింపు సందేశం వచ్చింది. 5 కోట్లు ఇవ్వాలని మెసేజ్ ద్వారా డిమాండ్ చేశారు. లారెన్స్ ప్రస్తుతం గుజరాత్‌లోని సబర్మతి జైలులో ఉన్నాడు. మరోవైపు అతని సోదరుడు అన్మోల్‌పై ఎన్‌ఐఏ రివార్డు ప్రకటించింది.

ట్రాఫిక్ పోలీసులకు అందిన బెదిరింపు సందేశంలో సల్మాన్ డబ్బుతో పాటు ఆలయానికి వెళ్లి క్షమాపణలు చెప్పాలని కోరినట్లు సమాచారం. కృష్ణ జింకల వేట కేసులో లారెన్స్ గ్యాంగ్ నటుడిని టార్గెట్ చేస్తోందని అంటున్నారు.

'సల్మాన్ ఖాన్ బతికి ఉండాలంటే బిష్ణోయ్ కమ్యూనిటీ గుడికి వెళ్లి క్షమాపణ చెప్పాలి లేదా రూ.5 కోట్లు చెల్లించాలి. లేకుంటే చంపేస్తాం. మా గ్యాంగ్ ఇంకా యాక్టివ్ గా ఉంది.' అని మెసేజ్ వచ్చింది. ప్రస్తుతం ఈ సందేశంపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఈ సందేశం లారెన్స్ బిష్ణోయ్‌కు సంబంధించినదా అని తెలుసుకోవడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.

భీమ్ ఆర్మీ చీఫ్ సత్పాల్ తన్వర్‌ను విదేశాల నుంచి బెదిరించిన అన్మోల్ బిష్ణోయ్‌పై గురుగ్రామ్ పోలీసులు కేసు నమోదు చేశారు. జింబాబ్వే, కెన్యాలోని నంబర్ల ద్వారా అమెరికా, కెనడా నుంచి అన్మోల్ బెదిరింపు కాల్స్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. పోలీసులకు అందిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు కోసం ఎస్టీఎఫ్ (స్పెషల్ టాస్క్ ఫోర్స్), క్రైమ్ అండ్ సైబర్ క్రైమ్ సభ్యులతో కూడిన బృందాన్ని ఏర్పాటు చేశారు.

మరోవైపు లారెన్స్ బిష్ణోయ్ సోదరుడు అన్మోల్ బిష్ణోయ్ అమెరికాలో ఉన్నాడని అమెరికా అధికారులు వెల్లడించారు. దాంతో ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసు అధికారులు అన్మోల్ బిష్ణోయ్ ను భారత్ కు తరలించేందుకు అమెరికా ప్రభుత్వ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నట్టుగా తెలుస్తోంది.

అన్మోల్ బిష్ణోయ్ అరెస్టుకు మహారాష్ట్ర కంట్రోల్ ఆఫ్ ఆర్గనైజ్డ్ క్రైమ్ యాక్ట్ (mcoca) కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. విదేశాల్లో అతడి కోసం గాలింపు చర్యలు చేపట్టడానికి రెడ్ కార్నర్ నోటీసులు కూడా ఇచ్చారు. గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్ సోదరుడు అన్మోల్ బిష్ణోయ్‌ను అరెస్టు చేయడానికి సహకరించిన వారికి జాతీయ దర్యాప్తు సంస్థ రూ.10 లక్షల రివార్డు ప్రకటించింది. అమెరికా నుంచి అతడిని తరలించే ప్రక్రియను క్రమబద్ధీకరించడానికి, క్రైమ్ బ్రాంచ్ కోర్టు పత్రాల సర్టిఫైడ్ కాపీలు కూడా అవసరమని క్రైమ్ బ్రాంచ్ అధికారులు చెబుతున్నారు.

Whats_app_banner