Katchatheevu island controversy explained : 2024 లోక్‌సభ ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో.. కాంగ్రెస్ పార్టీపై మరో 'పిడుగు'! ‘కచ్చతివు ద్వీపం’ వివాదాన్ని మళ్లీ తెరపైకి తీసుకొచ్చారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. భారత దేశాన్ని విడదీసి, భారత్‌లో ఒక భాగమైన ద్వీపాన్ని.. కాంగ్రెస్ ప్రభుత్వం.. శ్రీలంకకు ఇచ్చేసిందని ఆరోపించారు. ఫలితంగా.. ఈ కచ్చతివు వివాదం మళ్లీ వార్తలకెక్కింది. ఈ నేపథ్యంలో.. అసలేంటి ఈ వివాదం? అన్న ప్రశ్నలకు సమాధానం ఇక్కడ తెలుసుకుందాము..
తమిళనాడు రామేశ్వరం- శ్రీలంకకు మధ్యలో ఉన్న ఓ చిన్న ద్వీపం.. ఈ కచ్చతివు. ఇది 285 ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది. తమిళనాడు నుంచి కేవలం 25కి.మీల దూరంలోనే ఉంటుంది ఈ ద్వీపం. దీనిపై చాలా సంవత్సరాలుగా వివాదం ఉన్నప్పటికీ.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. ఆదివారం చేసిన ఓ ట్వీట్‌తో ఇప్పుడు ఈ కచ్చతివు వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది.
"ఆశ్చర్యకరమైన విషయం! కచ్చతివును కాంగ్రెస్.. శ్రీలంకకు ఇచ్చేసిందని కొత్త ఆధారాలు బయటకు వచ్చాయి. ఇది భారతీయులను ఆగ్రహానికి గురి చేస్తోంది. కాంగ్రెస్‌ను నమ్మలేమని ప్రజల్లో ఉన్న ఆలోచనలు మళ్లీ నిరూపితమయ్యాయి," అని ట్వీట్ చేశారు ప్రధాని మోదీ.
Katchatheevu island : "భారత దేశ ఐకమత్యం, సమగ్రత, ప్రయోజనాలను 75ఏఏళ్లుగా కాంగ్రెస్ పార్టీ బలహీనపరుస్తూ వస్తోంది," అని మోదీ అన్నారు.
భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ హయాంలోనూ.. ఈ కచ్చతివు వివాదం కొనసాగింది. అయితే.. 'ఇంత చిన్న విషయాన్ని మాటిమాటికి ప్రస్తవించకండి. అవసరమైతే కచ్చతివును వదులుకోవడానికి సిద్ధం' అని నెహ్రూ అన్నట్టు.. తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నమళై వ్యాఖ్యానించారు. ఆర్టీఐ ద్వారా తాను సంపాదించిన రెండు డాక్యుమెంట్స్‌లో నెహ్రూ ఈ మెరకు వ్యాఖ్యానించినట్టు ఉందని పేర్కొన్నారు.
కానీ.. కచ్చతివు అనే ప్రాంతం.. భారత్‌లో ఒక భాగమని నిరూపించేందుకు అనేక ఆధారాలు ఉన్నట్టు, అప్పటి అటార్నీ జనరల్ వాదించారు. ఈ విషయం కూడా.. అన్నమళై పొందిన డాక్యుమెంట్స్‌లో ఉంది.
కాగా.. 1974లో ఈ కచ్చతివు ద్వీపాన్ని భారత్.. నిజంగానే శ్రీలంకకు ఇచ్చేసింది! ఈ మేరకు.. కచ్చితువు శ్రీలంకకు చెందినది అని ఇందిరా గాంధీ నేతృత్వంలోని ప్రభుత్వం గుర్తించింది. ఇదే విషయంపై.. 1974 జూన్ 26న శ్రీలంకలో, రెండు రోజుల తర్వాత.. జూన్ 28న దిల్లీలో సంబంధిత ఒప్పందాలపై సంతకాలు చేశారు.
Katchatheevu island controversy : ఈ కచ్చతివులో చేపలు పట్టేందుకు చాలా మంది తమిళులు వెళుతూ ఉంటారు. కానీ ఇప్పుడది చాలా కష్టంగా మారింది. ఇంటర్నేషనల్ మేరిటైమ్ బౌండరీ లైన్‌కి అవతల ఉన్న ఈ ప్రాంతానికి వెళుతుంటే.. శ్రీలంక అధికారులు మత్స్యకారులను అరెస్ట్ చేస్తున్నారు. కచ్చితివును శ్రీలంకలో భాగంగా భారత్ గుర్తించడం.. చాలా మంది తమిళులకు ఇష్టం లేదు.
కచ్చతివులో సెయింట్ ఆంటోని ఆలయం ఉంటుంది. ప్రతియేటా అక్కడ ఉత్సవాలు జరుగుతాయి. 1974లో జరిగిన ఒప్పందం ప్రకారం.. భారత మత్స్యకారులు ఉత్సవంలో పాల్గొనవచ్చు. అక్కడ విశ్రాంతి తీసుకోవచ్చు. కానీ వేటకు వెళుతున్న వారకి మాత్రం తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
కాగా.. కచ్చతివుని శ్రీలంకకు ఇచ్చేయడంపై అప్పటి విపక్ష పార్టీలు తీవ్రంగా నిరసన వ్యక్తం చేశాయి. కానీ ఇందిరా గాంధీ ప్రభుత్వం.. వాటిని పట్టించుకోకుండా, శ్రీలంకకు అప్పజెప్పిందని తెలుస్తోంది. శ్రీలంకతో సత్సంబంధాల కోసమే.. అప్పటి భారత ప్రభుత్వం ఇలా చేసిందని వార్తలు వచ్చాయి.
సంబంధిత కథనం