Karnataka CM: ‘‘అందరికీ ఆశ ఉంటుంది కదా’’ - సీఎం మార్పు వార్తలపై కర్నాటక హోంమంత్రి పరమేశ్వర సంచలన కామెంట్స్
కర్నాటకలో ముఖ్యమంత్రిని మార్చనున్నారనే వార్తల నేపథ్యంలో ఆ రాష్ట్ర హోం మంత్రి పరమేశ్వర ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నాయకత్వ మార్పు జరిగితే కర్ణాటక సీఎం పదవి రేసులో చాలామంది కాంగ్రెస్ నేతలు ఉన్నారని, అది సహజమేనని ఆయన వ్యాఖ్యానించారు. వారిలో చాలామంది బాహాటంగానే తమ ఆకాంక్షను వ్యక్తం చేస్తున్నారని అన్నారు.
కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో నాయకత్వ మార్పు చేపడితే.. ముఖ్యమంత్రి పదవి కోసం కొందరు కాంగ్రెస్ నేతలు గట్టిగానే పోటీ పడుతున్నారని, రాష్ట్ర ముఖ్యమంత్రి పదవిని చేపట్టే సత్తా తమకు ఉందని వారంతా భావిస్తున్నారని హోం మంత్రి జి.పరమేశ్వర మంగళవారం అన్నారు. అయితే ప్రస్తుతానికి ముఖ్యమంత్రి సిద్ధరామయ్యని మార్చే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు.
‘‘ముడా’’ కేసులో సీఎం ప్రాసిక్యూషన్
ముడా స్థల కేటాయింపు కేసులో కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రాసిక్యూషన్ కు గవర్నర్ అనుమతి ఇచ్చిన నేపథ్యంలో రాష్ట్రంలో ముఖ్యమంత్రి మార్పు ఊహాగానాలు ఊపందుకున్నాయి. గవర్నర్ చర్యను సవాలు చేస్తూ ముఖ్యమంత్రి సిద్దరామయ్య హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ హైకోర్టులో విచారణలో ఉంది. ఈ నేపథ్యంలో, రాష్ట్రంలో నాయకత్వ మార్పుపై స్థానికంగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
సీఎం కావడానికి చాలా మంది రెడీ
రాష్ట్రంలో నాయకత్వ మార్పు వార్తలపై మంగళవారం రాష్ట్ర హోం మంత్రి పరమేశ్వర స్పందించారు. నాయకత్వ మార్పు జరిగితే సీఎం కావడానికి కాంగ్రెస్ నాయకులు చాలామంది పోటీకి సిద్ధమవుతున్నారని, ప్రతి ఒక్కరూ తాము సీఎం పదవి చేపట్టడానికి సమర్థులమేనని భావిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. అయితే, ఈ సమయంలో ముఖ్యమంత్రిని మార్పు ఉండబోదని ఆయన స్పష్టం చేశారు. అయితే, కొందరు సీనియర్ నేతలు సీఎం కావాలన్న తమ ఆకాంక్షను బాహటంగానే వ్యక్తం చేస్తున్నారని పరమేశ్వర అంగీకరించారు.
కాంగ్రెస్ అధిష్టానం స్పందించాలి..
రాష్ట్రంలో ముఖ్యమంత్రి మార్పు వార్తలపై కాంగ్రెస్ పార్టీ అధిష్టానం స్పందించి, క్లారిఫికేషన్ ఇవ్వాలని కర్నాటక సీనియర్ కాంగ్రెస్ నేతలు అభిప్రాయపడుతున్నారు. కాంగ్రెస్ (congress) అధిష్టానం క్లారిటీ ఇస్తే, నాయకత్వ మార్పు ఊహాగానాలు ఆగిపోతాయని చెబుతున్నారు. ‘‘అలాంటి విషయాలను పరిస్థితి వచ్చినప్పుడు వ్యక్తపరచాలి, ఇప్పుడు కాదు’’ అని కాంగ్రెస్ సీనియర్ నేత ఒకరు అన్నారు. ముఖ్యమంత్రి పదవీకాలంపై ఊహాగానాలకు అడ్డుకట్ట వేయాలని కోరుతూ రాష్ట్ర కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంజునాథ్ భండారీ, ఎమ్మెల్సీ దినేష్ గూలిగౌడ సోమవారం ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు లేఖ రాశారు.
ముఖ్యమంత్రి మార్పు లేదు
దీనిపై పరమేశ్వరను ప్రశ్నించగా.. ‘‘ముఖ్యమంత్రి పదవికి సంబంధించిన చర్చ అనవసరమని నేను కూడా చాలా సందర్భాల్లో చెప్పాను. రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉన్నారని, పరిపాలన సజావుగా సాగుతోందని, ప్రస్తుత పరిస్థితుల్లో ముఖ్యమంత్రి మార్పునకు అవకాశం లేదనేది అందరికీ తెలిసిన విషయమే’’ అని పరమేశ్వర జవాబిచ్చారు. పలువురు కాంగ్రెస్ నాయకులు, మంత్రులు స్వయంగా సిఎం మార్పు గురించి మాట్లాడటం. వారి ఆకాంక్షలను వ్యక్తం చేయడం, దీనిపై హైకమాండ్ మౌనంగా ఉండటం సరికాదన్నారు. ‘‘మీరు సిఎం అవుతారా అని మీడియా ప్రతినిధులు అడిగినప్పుడు. సీఎం పదవి వద్దు అని ఏ నాయకుడు చెప్పడు కదా.. కాబట్టి, మేము కూడా సీఎం అవుతామనే చెప్తాము. అంతకు మించి ఏమీ లేదు’’ అని పరమేశ్వర వివరించారు.
ముందు వరుసలో డీకే శివకుమార్
నాయకత్వ మార్పు జరిగితే ఉప ముఖ్యమంత్రి, రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్ ఈ పదవికి ప్రధాన పోటీదారుగా కనిపిస్తున్నారు. హోం మంత్రి పరమేశ్వర, పీడబ్ల్యూడీ మంత్రి సతీష్ జార్కిహోళి పేర్లు కూడా ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి కావడానికి సీనియారిటీనే ప్రామాణికంగా తీసుకోవాలని ఇద్దరు సీనియర్ మంత్రులు ఎంబీ పాటిల్, శివానంద్ పాటిల్ ఇటీవల వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ సీనియర్ ఎమ్మెల్యేలు పరిపాలనా సంస్కరణల కమిషన్ చైర్మన్ ఆర్ వి దేశ్ పాండే, సిద్దరామయ్య ఆర్థిక సలహాదారు బసవరాజ్ రాయరెడ్డి కూడా ముఖ్యమంత్రి కావాలనే తమ కోరికను వ్యక్తం చేశారు.
ఢిల్లీకి రాష్ట్ర నేతలు
సీఎం ఆశావహుల గురించి పార్టీలో చర్చ జరుగుతున్న సమయంలో భారీ, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి ఎంబీ పాటిల్ ఢిల్లీ పర్యటనపై పరమేశ్వర స్పందిస్తూ.. ‘‘హోం మంత్రిత్వ శాఖకు సంబంధించిన పనుల కోసం నేను కూడా వెళ్తాను. నేను వెళ్లినంత మాత్రాన సీఎం పదవి కోసం లాబీయింగ్ చేయడానికి వెళ్లానని ఎలా చెప్పగలం? అది అనవసరం, దానిపై చర్చ అనవసరం’’ అని వ్యాఖ్యానించారు.