KTR Delhi Tour: కేటీఆర్ ఢిల్లీ పర్యటన.. పెండింగ్ సమస్యల పరిష్కారమే లక్ష్యం
KTR Delhi Tour: తెలంగాణ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఢిల్లీలో పర్యటించనున్నారు. పెండింగ్ సమస్యల పరిష్కారంతో పాటు కేంద్రం నుంచి తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన నిధుల వ్యవహారం, ప్రాజెక్టులకు అనుమతు వ్యవహారంపై చర్చించనున్నారు.
KTR Delhi Tour: తెలంగాణ మంత్రి కేటీఆర్‌రెండు రోజుల పాటు ఢిల్లీలో పర్యటించనున్నారు. కేటీఆర్ ఢిల్లీ పర్యటనలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అవుతారని ప్రచారం జరుగుతోంది. రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ అంశాలపై కేంద్ర సర్కారుపై ఒత్తిడి తెచ్చేందుకు శుక్రవారం ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు.
తెలంగాణలో వివిధ ప్రాజెక్టులకు కేంద్రం నుంచి రావాల్సిన అనుమతులు, పథకాలు, అభివృద్ధి అంశాల్లో అందించాల్సిన సహాయంపై కేంద్ర మంత్రులను కలువనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తొమ్మిదేళ్లుగా వివిధ అభివృద్ధి కార్యక్రమాల అమలుకు కేంద్ర ప్రభుత్వం సహకారం కోరుతోంది.
నిధులు, ప్రాజెక్టులకు అనుమతులు, సాగు నీటి ప్రాజెక్టుకు జాతీయ హోదా వంటి అంశాలపై బీజేపీ ప్రభుత్వం నాన్చివేత ధోరణి ప్రదర్శిస్తోందని తెలంగాణ ప్రభుత్వం ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వంపై మరింత ఒత్తిడి తీసుకు రావాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా మంత్రి కేటీఆర్ ఢిల్లీలో పర్యటిస్తున్నారు. పలువురు కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్ర ప్రభుత్వ డిమాండ్లను వినిపించనున్నారు.
రాజధాని హైదరాబాద్‌లో ట్రాఫిక్ నిర్వహణకు చేపట్టి న ఎస్సార్డీపీలో భాగంగా తలపెట్టిన స్కై వే నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం కంటోన్మెంట్ భూములు కావాలని రక్షణ శాఖను కోరుతున్నది. ఈ వ్యవహారంలో ఇప్పటిదాకా కేంద్రం ఏటూ తేల్చకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. ఈ నేపథ్యంలో మంత్రి కేటీఆర్ నేరుగా రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ను కలిసి కంటోన్మెంట్ భూముల అంశాన్ని లేవనెత్తనున్నారు. పెరుగుతున్న నగర జనాభా అవసరాలకు అనుగుణంగా నిర్మాణాల ఆవశ్యకతను వివరించనున్నారు.
రసూల్‌పుర వద్ద చేపట్టిన రోడ్డు అభివృద్ధి పనులకు కేంద్ర హోంశాఖ పరిధిలోని భూముల అవసరం ఉన్నది. ఇందుకు అవసరమైన సహకారంపై కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిసే అవకాశం ఉందని చెబుతున్నారు.
వరంగల్ వద్ద ఉన్న మామునూరు ఎయిర్‌పోర్ట్‌పై కేంద్రం ఎటూ తేల్చకుండా పెండింగ్‌లో ఉంచారు. ఈ అంశంపై కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా లేదా వీకే సింగ్‌తో సమావేశమై, స్పష్టమైన నిర్ణయాన్ని ప్రకటించాలని కోరే అవకాశం ఉంది.
పట్టణాభివృద్ధి శాఖకు సంబంధించిన పలు అంశాలపై కేంద్రమంత్రి హర్దీప్‌సింగ్‌పురీతో కేటీఆర్్ సమావేశం కానున్నారు. హైదరాబాద్‌లో ఉన్న మెట్రో పరిధిని మరింత విస్తరించాలని ఇప్పటికే అనేక సార్లు కేంద్రానికి విజ్ఞప్తి చేసినా స్పందించ లేదు. హర్దీప్‌సింగ్‌పురీతో సమావేశం సందర్భంగా ఈ విషయంపై తేల్చాలని కోరే అవకాశం ఉన్నది. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ వరకు విస్తరణతో పాటు మహేశ్వరం వరకు హైదరాబాద్ మెట్రో సేవల్ని పొడిగిస్తామని ఇటీవల సిఎం కేసీఆర్ ప్రకటించారు.
వీటితోపాటు రాష్ట్రానికి సంబంధించిన ఇతర పెండింగ్ అంశాలపై ఆయా శాఖల కేంద్రమంత్రులను మంత్రి కేటీఆర్ కలువనున్నారు.పెండింగ్ అంశాలపై కేంద్రం నుంచి స్పష్టమైన ప్రకటన లేదా హామీ రాకపోతే మోదీ సర్కారు వైఖరిని ఎండగట్టాలని యోచిస్తున్నట్లు బిఆర్‌ఎస్ వర్గాలు చెబుతున్నాయి. ఢిల్లీ పర్యటన ముగించుకుని వచ్చిన తర్వాత రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం సృష్టిస్తున్న ఆటంకాలను ప్రజలకు వివరించి, బీజేపీ తీరును బయటపెట్టేందుకు ప్రణాళిక రూపొందించినట్టు ప్రచారం జరుగుతోంది.