PM Modi - Karnataka Election 2023: కర్ణాటక రాజధాని బెంగళూరు(Bengaluru)లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) వరుసగా రెండో రోజు రోడ్ షో నిర్వహించారు. నేడు (మే 7, ఆదివారం) సుమారు 10 కిలోమీటర్ల పాటు అట్టహాసంగా రోడ్ షో జరిగింది. వేలాది సంఖ్యలో ప్రజలు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రహదారి పొడవునా ప్రధాని మోదీపై పూల వర్షం కురిపించారు. అసెంబ్లీ ఎన్నికల పోలింగ్(మే 10)కు మూడు రోజుల ముందు.. తిప్పెసాంద్ర జంక్షన్ వద్ద ఉన్న కెంపెగౌడ విగ్రహం నుంచి ఎంజీ రోడ్డులోని ట్రినిటీ సర్కిల్ వరకు మోదీ రోడ్ షో ఆదివారం జరిగింది. కర్ణాటకలో అధికారాన్ని నిలబెట్టుకోవాలని అధికార బీజేపీ పట్టుదలగా ఉండగా.. ప్రధాని మోదీ ఆ పార్టీ తరఫున రాష్ట్రంలో విస్తృతంగా ప్రచారం చేశారు. రోడ్ షోలు నిర్వహించారు.
PM Modi - Karnataka Election 2023: బెంగళూరులో శనివారం 26 కిలోమీటర్ల మేర ప్రధాని మోదీ రోడ్ షో జరిగింది. నేడు (ఆదివారం) సుమారు 10 కిలోమీటర్ల పాటు సాగింది. ఒకేసారి 36 కిలోమీటర్ల రోడ్‍షో జరపాలని ముందుగా బీజేపీ భావించింది. అయితే, ఆదివారం నీట్ పరీక్ష ఉండటం, ట్రాఫిక్ వల్ల ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు శనివారమే 26 కిలోమీటర్ల రోడ్ షో జరిపింది. నేడు ఆ మిగిలిన 10 కిలోమీటర్ల రోడ్ షో నిర్వహించింది.
PM Modi - Karnataka Election 2023: ఆదివారం ఉదయం ముందుగా తిప్పెసాంద్ర రోడ్డు వద్ద ఉన్న కెంపెగౌడ విగ్రహానికి పూలతో నివాళులు అర్పించారు ప్రధాని మోదీ. అక్కడి నుంచి రోడ్ షో మొదలైంది. హెచ్ఏఎల్ రెండో స్టేజీ, ఓల్డ్ మద్రాస్ రోడ్డు మీదుగా సాగింది. దారిపొడవునా ప్రజలు, బీజేపీ కార్యకర్తలు.. మోదీపై పూల వర్షం కురిపించారు. మోదీ.. మోదీ అని నినాదాలు చేశారు. మొత్తంగా ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలను తాకుతూ ఈ రోడ్ షో జరిగింది. చివరగా ట్రినిటీ సర్కిల్‍లో రోడ్ షో ముగిసింది. బెంగళూరులో మెగా రోడ్ షో ముగిసిన తర్వాత ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. తమను ఆశీర్వదించడానికి వచ్చిన ప్రజలకు కృతజ్ఞతలు అని పేర్కొన్నారు.
బెంగళూరు తనపై చూపించిన అభిమానాన్ని జీవితాంతం గుర్తుంచుకుంటానని శనివారం రోడ్‍షో తర్వాత మోదీ ట్వీట్ చేశారు.
కర్ణాటకలోని 224 అసెంబ్లీ స్థానాలకు బుధవారం (మే 10) పోలింగ్ జరగనుంది. మే 13వ తేదీన ఎన్నికల ఫలితాలు వెల్లడి కానున్నాయి. అధికారం నిలబెట్టుకుంటామని బీజేపీ ధీమా వ్యక్తం చేస్తోంది. అయితే, కర్ణాటకలో మళ్లీ గెలిచి తీరుతామని కాంగ్రెస్ విశ్వాసం వ్యక్తం చేస్తోంది. వీలైనన్ని ఎక్కువ స్థానాలు సాధించి ప్రభుత్వ ఏర్పాటులో కీలకపాత్ర పోషించాలని జేడీఎస్ భావిస్తోంది.