Jammu and Kashmir: మూడు నెలల్లో ఉగ్రవాదుల దాడుల్లో 12 మంది జవాన్లు, 10 పౌరులు మృతి
Terrorist attacks: 2024 సంవత్సరం ప్రారంభం నుంచి జమ్ముకశ్మీర్ ప్రాంతంలో ఉగ్రవాదుల దాడులు పెరుగుతున్నాయి. ఈ ఉగ్రదాడుల్లో పెద్ద సంఖ్యలో జవాన్లు చనిపోతున్నారు. గత మూడు నెలల వ్యవధిలోనే ఉగ్రవాదుల దాడుల్లో 12 మంది వీర జవాన్లు మృత్యువాత పడగా, 10 మంది సాధారణ పౌరులు కూడా చనిపోయారు.
Terrorist attacks: జమ్ముకశ్మీర్ లోని దోడాలో సోమవారం జరిగిన ఉగ్రదాడిలో నలుగురు భారత ఆర్మీ జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. 2024 జనవరి 1 నుంచి జమ్మూకశ్మీర్ ప్రాంతంలో జరిగిన ఉగ్రవాద దాడుల్లో ఆర్మీ కెప్టెన్ సహా 12 మంది భద్రతా సిబ్బంది, 10 మంది పౌరులు మరణించగా, 55 మంది గాయపడ్డారు. అదే సమయంలో జమ్మూ ప్రాంతంలో, ముఖ్యంగా సరిహద్దు జిల్లాల్లో భద్రతా బలగాల కాల్పుల్లో పెద్ద సంఖ్యలోనే ఉగ్రవాదులు హతమయ్యారు.
32 నెలల్లో 49 మంది వీర జవాన్ల మృతి
గత 32 నెలల్లో ఉగ్రవాద దాడుల కారణంగా 48 మంది సైనికులు మరణించారు. ఈ సంవత్సరం ఇప్పటివరకు ఉగ్రవాదుల దాడుల్లో చనిపోయిన జవాన్ల వివరాలు ఇక్కడ ఉన్నాయి.
జూలై 2024
జూలై 15: దోడా జిల్లాలో ఉగ్రవాదులతో జరిగిన ఎదురుకాల్పుల్లో ఒక అధికారితో సహా నలుగురు సైనికులు మరణించారు.
జూలై 8: కథువా జిల్లాలో ఆర్మీ ట్రక్కుపై ఉగ్రవాదులు జరిపిన దాడిలో ఐదుగురు సైనికులు మరణించారు.
జూలై 7: రాజౌరీ జిల్లాలోని భద్రతా స్థావరంపై ఉగ్రవాదుల దాడిలో ఒక సైనికుడు గాయపడ్డాడు. కశ్మీర్ ప్రాంతంలోని కుల్గాం జిల్లాలో జరిగిన జంట ఎన్ కౌంటర్లలో ఆరుగురు ఉగ్రవాదులతో సహా ఎనిమిది మంది మరణించారు.
జూన్ 2024
జూన్ 26: దోడా జిల్లాలోని అటవీ ప్రాంతంలో జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు.
జూన్ 12: దోడా జిల్లాలో ఉగ్రవాదుల దాడిలో ఒక పోలీసు గాయపడ్డాడు.
జూన్ 11/12: కథువా జిల్లాలోని జాయింట్ చెక్ పోస్టుపై ఉగ్రవాదులు జరిపిన దాడి సమయంలో జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు, ఒక సీఆర్పీఎఫ్ జవాను మరణించారు. దోడా జిల్లాలో జరిగిన ఉగ్రదాడిలో ఐదుగురు రాష్ట్రీయ రైఫిల్స్ సిబ్బంది, ఒక స్పెషల్ పోలీస్ ఆఫీసర్ గాయపడ్డారు.
జూన్ 9: రియాసి జిల్లాలో బస్సుపై ఉగ్రవాదులు జరిపిన దాడిలో తొమ్మిది మంది యాత్రికులు మరణించగా, 42 మంది గాయపడ్డారు.
మే 2024
మే 4: పూంచ్ జిల్లాలో జరిగిన ఉగ్రదాడిలో ఒక ఐఏఎఫ్ జవాను మృతి చెందగా, ఐదుగురు గాయపడ్డారు.
ఏప్రిల్ 2024
ఏప్రిల్ 28: ఉధంపూర్ జిల్లాలో ఉగ్రవాదులతో జరిగిన ఎన్ కౌంటర్ లో ఓ గ్రామ రక్షణ గార్డు మృతి చెందాడు.
ఏప్రిల్ 22: రాజౌరీ జిల్లాలో ఓ ప్రభుత్వ ఉద్యోగిని ఉగ్రవాదులు కాల్చి చంపారు.